Share News

TVK: అన్నాడీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదు, మాది ఒంటరిపోరే.. టీవీకే స్పష్టత

ABN , Publish Date - Oct 29 , 2025 | 09:48 PM

కరూర్ తొక్కిసలాటకు ముందే తమ పార్టీ ఒంటరి పోరుకు నిర్ణయం తీసుకుందని, పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదని టీవీకే జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ తెలిపారు.

TVK: అన్నాడీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదు, మాది ఒంటరిపోరే.. టీవీకే స్పష్టత
TVK Chief Vijay

చెన్నై: కరూర్ తొక్కిసలాట ఘటన అనంతరం అన్నాడీఎంకే నుంచి పొత్తులపై వస్తున్న ఆహ్వానంపై నటుడు విజయ్ (Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) బుధవారంనాడు తొలిసారి స్పందించింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపింది. కరూర్ తొక్కిసలాటకు ముందే విజయ్ సీఎం అభ్యర్థిగా తమ పార్టీ ఒంటరి పోరుకు నిర్ణయం తీసుకుందని, పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదని టీవీకే జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ తెలిపారు.


అన్నాడీఎంకే ర్యాలీలో టీవీకే జెండాలు కనిపిస్తుండటం, రెండు పార్టీల మధ్య పొత్తు దిశగా అడుగులు వేస్తున్నట్టు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి చెప్పడంపై నిర్మల్ కుమార్‌ను మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదన్నారు. మీడియాలో అనేక ఊహాగానాలు వస్తుంటాయని, దానిపై తనను కామెంట్ చేయమనడం సరికాదని అన్నారు. ఒంటరిగా పోటీ చేయాలని నెల రోజుల క్రితం ఎలాంటి వైఖరితో ఉన్నామో దాంట్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.


డీఎంకేను ఓడించేందుకు అన్నాడీఎంకేతో టీవీకే చేతులు కలపాలని ఇటీవల కాలంలో పలువురు అన్నాడీఎంకే, బీజేపీ నేతలు ఆహ్వానం పలికారు. తాజాగా టీవీకే ప్రకటనతో ఆ ఊహాగానాలకు తాత్కాలికంగానైనా తెరపడినట్టుగా భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

రాష్ట్రపతితో రఫేల్ రాణి శివాంగి సింగ్.. పాక్ కట్టుకథలకు మరోసారి చెక్

సొంత కారు లేకుంటే పిల్లను ఇవ్వరన్న డీకే.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 29 , 2025 | 09:51 PM