TVK Chief Vijay: కరూర్ తొక్కిసలాటపై సుప్రీంకోర్టుకు విజయ్
ABN , Publish Date - Oct 08 , 2025 | 02:39 PM
విజయ్ తరఫున న్యాయవాదులు దీక్షిత గోహిల్, ప్రాంజల్ అగర్వాల్, ఎస్ విజయ్‌లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 10న ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. ఇదే కేసుకు సంబంధించి మరో పిటిషన్ కూడా అడ్వకేట్ జీఎస్ మణి దాఖలు చేశారు.
కరూర్: కరూర్ తొక్కిసలాట(Karur Stampede) ఘటన మలుపులు తిరుగుతోంది. టీవీకే (TVK) చీఫ్ విజయ్ (Vijay) సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. తొక్కిసలాట ఘటనపై ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సారథ్యంలో సిట్ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఈనెల 3న హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. పోలీసుల సారథ్యంలోని సిట్ దర్యాప్తునకు బదులుగా స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని తన పిటిషన్‌లో విజయ్ కోరారు.
విజయ్ తరఫున న్యాయవాదులు దీక్షిత గోహిల్, ప్రాంజల్ అగర్వాల్, ఎస్ విజయ్‌లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. అక్టోబర్ 10న ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. ఇదే కేసుకు సంబంధించి మరో పిటిషన్ కూడా అడ్వకేట్ జీఎస్ మణి దాఖలు చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మణి కోరారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇంతవరకూ మూడు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.
సీబీఐ దర్యాప్తునకు నో
సెప్టెంబర్ 27న విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందారు. ఈవెంట్ నిర్వహణా లోపాల వల్లే ప్రమాదం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఘటనపై సిట్ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది. అయితే సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేత ఒకరు వేసిన పిటిషన్‌ను హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ తోసిపుచ్చింది. 27,000 మందికి పైగా జనం విజయ్ సభకు వచ్చారని, ఆయన ఏడు గంటలు ఆలస్యంగా రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే క్రౌడ్ కంట్రోల్ విషయంలో ఈవెంట్ నిర్వాహకులు, టీవీకే నేతలు, స్థానిక పోలీసులు విఫలమయ్యారని కోర్టు విమర్శించింది.
ఇవి కూడా చదవండి..
బిహార్‌లో సీట్ల సర్దుబాట్లు: బీజేపీకి చిరాగ్ పాశ్వాన్ సూక్తి ముక్తావళి
విహార యాత్రకు వెళ్లి పంజాబీ సింగర్ మృతి.. భార్య వద్దని చెప్పినా..
Read Latest Telangana News and National News