TVK Vijay: హీరో విజయ్ పిలుపు.. వారి మాటలు నమ్మి మోసపోకండి..
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:30 PM
డీఎంకే నేతల మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవదు.. మోసపోవద్దు.. అని టీవీకే పార్టీ అధినేత, హీరో విజయ్ అన్నారు. పుదుచ్చేరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు మోసపూరిత హామీలతో వస్తుంటారని, కానీ ఓటర్లు నమ్మవద్దన్నారు.
- పుదువై సభలో డీఎంకేపై విజయ్ వసుర్లు
చెన్నై: ఎట్టి పరిస్థితుల్లోనూ డీఎంకేని నమ్మవద్దని, ఆ పార్టీ నేతలంతా నమ్మించి మోసగిస్తారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్(Vijay) పుదుచ్చేరి ప్రజలకు పిలుపునిచ్చారు. ఉప్పళంరేవు మైదానంలో మంగళవారం ఉదయం జరిగిన బహిరంగ సభలో ప్రచార వాహనంపై నిలిచి ఆయన ప్రసంగించారు. కరూర్ దుర్ఘటన తర్వాత ఆయన బహిరంగ సభలో పాల్గొనటం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రప్రభుత్వం తమిళనాడును ఒక రాష్ట్రంగా, పుదుచ్చేరిని కేంద్రపాలిత ప్రాంతంగా పక్షపాత ధోరణి అవలంభిస్తోందని, అయితే ఈ రెండు ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా తమిళులే అన్న ఏకభావంతోనే తాము వ్యవహరిస్తామని, తమిళులు ప్రపంచంలో ఏ మూల నివసించినా వారంతా తమ ఆత్మీయ బంధువులేనన్నారు.
పుదుచ్చేరి అంటేనే మనక్కుళ వినాయకుడు, అరవిందాశ్రమం, విల్లియనూరు మాత గుర్తుకు వస్తారన్నారు. అంతేగాక తమిళ మహాకవి బసచేసిన పుణ్యభూమి ఇదేనని, పావేందర్ భారతి దాసన్ జన్మించిన భూమి కూడా ఇదేనని తెలిపారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ 1977లో తమిళనాట అధికారంలోకి వచ్చారని, అయితే అంతకంటే ముందుగానే 1974లో పుదుచ్చేరిలో అన్నాడీఎంకేప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అప్పట్లోనే తమిళులను కాపాడేందుకు వచ్చిన మహానాయకుడు ఎంజీఆర్ అని,

ఆయన్ని వదలొద్దంటూ తమిళనాడు ప్రజలను పుదుచ్చేరి వాసులు అప్రమత్తం చేసిన విషయాన్ని ఎవరూ మరువలేరని విజయ్ పేర్కొన్నారు. అంతటి కీర్తిని సంతరించుకున్న పుదుచ్చేరిని మరువగలమా? ఇక్కడున్న ప్రజలు కూడా తమిళనాడులోని ప్రజల్లాగే తనను మూడు దశబ్దాలకు పైగా సినిమా నటుడిగా ఆదరిస్తున్నారని, ప్రస్తుతం రాజకీయల్లోకి వచ్చిన తనను ఉన్నత స్థితికి తీసుకెళ్తారనే నమ్మకం ఉందన్నారు. పుదుచ్చేరి ప్రజలకు ఏ సమస్య ఎదురైనా అందరికంటే తానే ముందుండి పరిష్కరిస్తానని విజయ్ ప్రకటించారు.
పుదుచ్చేరి సర్కార్‌ను చూసి నేర్చుకోండి...
ఈ సభ ఇంత ప్రశాంతంగా భారీ స్థాయిలో జరగటానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌ఆర్ రంగసామి ప్రభుత్వమే కారణమని, అందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని విజయ్ చెప్పారు. పుదుచ్చేరి ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వంలా కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని, వేరే పార్టీకి చెందిన బహిరంగ సభ అయినా పక్షపాత ధోరణి ప్రదర్శించకుండా ఈ సభకు వచ్చిన లక్షలాదిమంది ప్రజలకు పటిష్టమైన భద్రత కల్పించిందని ప్రశంసించారు. పుదుచ్చేరిలో సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రప్రభుత్వం ఇక్కడ అభివృద్ధిని పట్టించుకోలేదనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు.

రాష్ట్ర హోదా కల్పించాలని యేళ్లతరబడి శాసనసభలో తీర్మానాలు చేసి ఆమోదించి పంపినా కేంద్రం సానుకూలత ప్రకటించలేదని ఆరోపించారు. పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో మూతపడిన ఐదు మిల్లులను, పలు కర్మాగారాలను తెరిచేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గానీ, రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం గానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. దేశంలోనే రేషన్ షాపులు లేని ప్రాంతం పుదుచ్చేరి లో ప్రజలకు నిత్యావసర సరకులు లభించేలా చర్యలు చేపట్టాలన్నారు. పుదుచ్చేరిలోని కారైక్కాల్, మాహే, యానాం ప్రాంతాల్లో ఇంకా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
పుదుచ్చేరి - కడలూరు మధ్య రైలు మార్గం నిర్మించాలన్న ప్రతిపాదన యేళ్ల తరబడి పెండింగ్‌లో ఉందని, సుమారు 20లక్షల మంది నివసిస్తున్న యూనియన్ ప్రాంతమైన పుదుచ్చేరి కేంద్ర ఆర్థిక కమిటీలో సభ్యత్వం కల్పించకపోవడం శోచనీయమన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పుదుచ్చేరిలో టీవీకే గెలిచి అధికారంలోకి రావటం ఖాయమని విజయ్ స్పష్టం చేశారు. విజయ్ ఈ సభకు నిర్దేశిత సమయం కంటే ముందే సభా ప్రాంగణానికి చేరుకోవడం విశేషం. అక్కడున్న ప్రచార వాహనంలో గంటపాటు గడిపారు. ఆ తర్వాత నిర్ణీత సమయంలో ఆ వాహనంపైకొచ్చి ప్రసంగించారు. పుదుచ్చేరి పోలీసులు ఆ ప్రచార వాహనం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. విజయ్ ప్రసంగించిన ప్రచార వాహనానికి జనానికి మధ్య సుమారు రెండు వందల అడుగుల దూరం వరకూ ఖాళీగా ఉంచారు. విజయ్ ఈ సభలో 11 నిమిషాలపాటు ప్రసంగించారు.
రంగసామి, విజయ్ ఫొటోలతో ప్లకార్డుల ప్రదర్శన..
ఈ సభకు హాజరైన కార్యకర్తలందరూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి, విజయ్ ఫొటోలున్న ప్లకార్డులను పట్టుకుని సందడి చేశారు. విజయ్ తన ప్రసంగంలో సీఎం రంగసామికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇదే సమయంలో విజయ్ ప్రసంగాన్ని సీఎం రంగస్వామి తన నివాసంలో కూర్చుని మొబైల్ ఫోన్‌లో చివరి వరకు చూడడం విశేషం. ఇదిలా వుండగా ఈ సభలోనూ విజయ్ ఎప్పటిలానే బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి
Read Latest Telangana News and National News