TVK Vijay: టీవీకే అధినేతకి ఝలక్.. డీఎంకేలో చేరిన విజయ్ మాజీ మేనేజర్
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:14 PM
మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో.. అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి అతని సన్నిహితుడు, ఇప్పటివరకు ఆయన వెన్నంటి ఉన్న పీటీ సెల్వకుమార్ ఝలక్ ఇచ్చారు. ఆయన టీవీకేని వదిలి డీఎంకే పార్టీలో చేరారు.
చెన్నై: ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షులు, ప్రముఖ సినీనటుడు విజయ్ మాజీ మేనేజర్, ‘కలప్పై మక్కల్ ఇయక్కం’ అధ్యక్షుడు పీటీ సెల్వకుమార్ డీఎంకేలో చేరారు. స్థానిక తేనాంపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆయన డీఎంకేలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్, అధికార ప్రతినిధి ఆర్‌ఎస్ భారతి, మంత్రి పీకే శేఖర్‌బాబు, ఆలంకుళం ఎమ్మెల్యే మనోజ్ పాండిన్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా సెల్వకుమార్ మీడియాతో మాట్లాడుతూ... విజయ్ మక్కల్ మండ్రంలో తాను కార్యకర్తగా పని చేశానన్నారు. ప్రస్తుతం పార్టీలో చేరుతున్న కొత్త నేతలతో మొదటి నుంచి పనిచేస్తున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు లేకుండా పోయిందన్నారు. విజయ్‌కు మంచి ప్రజాదరణ ఉందని, కానీ ఆయన చుట్టూ ఉన్న వారితో పార్టీ మరో దిశకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. చంద్రుడు కొద్ది రోజులే ఉంటాడని, సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడని, అందుకే తాను సూర్యుడి చెంతన చేరానని సెల్వకుమార్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
రెండు నియోజకవర్గాల నేతలతో స్టాలిన్ భేటీ
డీఎంకే తాంబరం, గాంగేయం నియోజకవర్గాల నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌తో గురువారం భేటీ అయ్యారు. శాసనసభ ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేస్తున్న అధ్యక్షులు స్టాలిన్ ‘ఉడన్ పిరప్పే వా’ పేరుతో నియోజకవర్గాల వారీగా నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలు, పార్టీ నేతలు, కార్యకర్తల ఐక్యత తదితరాలను వారిని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో, స్థానిక తేనాంపేటలోని అన్నా అరివాయంలో గురువారం తాంబరం, గాంగేయం నియోజకవర్గాల నేతలతో స్టాలిన్ సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా అందరూ కలసిమెలసి పనిచేయాలని స్టాలిన్ వారికి సూచించారు.
కూటమి పార్టీలతో చర్చలకు ప్రత్యేక కమిటీ
రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీలతో చర్చించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేయాలని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయించారు. గత శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే, డీపీఐ సహా పలు పార్టీలు చోటుచేసుకున్నాయి. కూటమి పార్టీల ఐక్యతతో శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘనవిజయం సాధించింది. రాబోయే శాసనసభ ఎన్నికల్లో కూడా మెజార్టీ విజయం సాధించాలని స్టాలిన్ గట్టి పట్టుదలతో అడుగులు వేస్తున్నారు.
కూటమిలో ప్రస్తుతం ఉన్న పార్టీలు యఽథాతధంగా కొనసాగుతాయని స్టాలిన్ భావిస్తున్నారు. అంతేగాక రాందాస్ నేతృత్వంలోని పీఎంకే, డీఎండీకే కూడా ఈ కూటమిలో చేరే అవకాశముందని సమాచారం. ఈ క్రమంలో, కూటమిలో చేరే పార్టీలతో చర్చించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని స్టాలిన్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కమిటీలో డీఎంకే ప్రిన్సిపల్ కార్యదర్శి కేఎన్ నెహ్రూ, కోశాధికారి టీఆర్ బాలు, అధికార ప్రతినిధి ఆర్‌ఎస్ భారతి, సమాచార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్, మంత్రి తంగం తెన్నరసు తదితరులుంటారని తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
విషాదం.. లోయలో పడిపోయిన ట్రావెల్ బస్సు..
Read Latest Telangana News and National News