Tungabhadra: ఉప్పొంగుతున్న తుంగభద్ర.. 26 క్రస్ట్‌గేట్ల నుంచి 1.28 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు..
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:18 PM
తుంగభద్ర ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. నదీ తీర ప్రాంతాలు, పంటపొలాలు జలమయం అవుతున్నాయి. నీటి ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతున్న కారణంగా గత కొన్ని రోజులుగా తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ బళ్ళారి, కొప్పళ జిల్లాల జిల్లాధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
- నీటమునిగిన హంపి, ఆనెగొంది చారిత్రక చట్టడాలు
- జలమయమైన లోతట్టు ప్రాంతాలు
బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర(Tungabhadra) ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. నదీ తీర ప్రాంతాలు, పంటపొలాలు జలమయం అవుతున్నాయి. నీటి ప్రవాహం రోజు రోజుకూ పెరుగుతున్న కారణంగా గత కొన్ని రోజులుగా తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ బళ్ళారి, కొప్పళ(Bellary, Koppal) జిల్లాల జిల్లాధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో తుంగభద్ర నది ప్రవహించి విజయనగర జిల్లా పరిధిలోని చారిత్రక ప్రసిద్ది గాంచిన హంపి, కొప్పళ జిల్లా పరిధిలోని ఆనెగొంది,
సణాపురం ప్రాంతాల్లో తుంగభద్ర నది ప్రమాద సూచిక స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. మూడు నాలుగు రోజులుగా బళ్ళారి-కొప్పళ జిల్లాల వారధిగా ఉన్నకంప్లి వంతెన వరద ప్రవాహంలో మునిగి పోగా ఆ మార్గం గుండా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పర్యాయ మార్గాల ద్వారా వెళ్ళడంతో ప్రయాణ భారం ఎక్కువ అవుతోంది. హంపిలో కృష్ణదేవరాయల సమాధితో పాటు , పురందర దాసుల మంటపాలు మునిగిపోయాయి. గంగావతి తాలూకా పరిధిలోని సణాపుర గ్రామం వద్ద కొండప్రాంతాల్లో నడుమ వరద నీరు ప్రవాహం ప్రమాదం దాటి ప్రవహిస్తోంది.
సుందరమైన దృశ్యాన్ని తిలకించడానికి చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు కొండరాళ్ళపై కూర్చొని తుంగభద్ర పరవళ్ళు చూస్తూ నయనానందం పొందుతున్నారు. ఆనెగొంది గ్రామంలో చింతామణి వద్ద చారిత్రక మంటపాలు నీటి మునిగాయి. నీటి ఉధృతి కారణంగా హంపి విరుపాక్షేశ్వర దేవస్థానం సమీపంలో స్నాన మంటపం దాదాపు మునిగి పోగా భక్తులు నదివద్దకు వెళ్ళాళంటేనే భయడపతున్నారు. హంపి చక్రతీర్థ వరద నీటితో పొంగి ప్రవహిస్తుండడం విశేషం.

తొణికిసలాడుతున్న డ్యామ్
తుంగభద్ర రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. క్షణ క్షణానికి వేలాది క్యూసెక్కుల వరద నీరు చేరుతుండడంతో డ్యామ్ జలకళతో తొణికిసలాడుతోంది. గత ఏడాది కంటే ఈ ఏడాది జలాశయం పైభాగంలో జోరు వానలు కురుస్తుండడంతో భారీగా నీరు చేరుతోంది. టీబీ డ్యామ్‌కు ప్రధాన జలవనరులైన తుంగ, భద్ర జలాశయాలు పూర్తి స్థాయిలో నిండడంతో రెండు జలాశాయల గేట్లు ఎత్తి లక్షలాది క్యూసెక్కుల నీటి దిగువకు వదులుతున్నారు. గత ఏడాది జలాశయం 19వ క్రస్ట్‌గేటు కొట్టుకొని పోయిన నేపథ్యంలో నిపుణుల నివేకదికల ప్రకారం ఈ ఏడాది జలాశయంలో 80 టీఎంసీ నీటిని మాత్రమే నిల్వ ఉంచుతున్నారు.
బోర్డు అధికారులు జలాశయానికి చేరుకుంటున్న వరద నీటిని క్రస్ట్‌గేట్ల గుండా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ 1624.44 అడుగులకు చేరుకుంది. జలాశయానికి 1.28లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని, జలాశయంలో 74.68టీఎంసీల నీరు నిల్వ ఉందని బోర్డు అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 1625.13 అడుగులకు నీరు చేరుకోగా, 31.033 క్యూసెక్కులు మాత్రమే ఇన్‌ప్లో ఉండగా, 76.91టీఎంసీల నీరు మాత్రమే ఉండేదన్నారు. ప్రస్తుతం జలాశయానికి అధికంగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో దిగువకు ప్రస్తుతం విడుదల చేస్తున్న వరద నీటి ప్రమాణం పెంచే అవకాశం ఉందని బోర్డు అధికారులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు
శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక
Read Latest Telangana News and National News