Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు హతం
ABN , Publish Date - Sep 22 , 2025 | 06:51 PM
భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరు నక్సల్ కమాండర్లపై రూ.40 లక్షల చొప్పున రివార్డు ఉందని అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఏకే-47 రైఫిల్, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్, బీజీఎల్ లాంచర్, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
రాయపూర్: మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో మరోసారి భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు హతమైనట్టు అధికారులు సోమవారం నాడు తెలిపారు. వీరిని మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులైన రాజు దాదా అలియాస్ కట్టా రామచంద్రారెడ్డి, కోస దాదా అలియాస్ కడారి సత్యనారాయణ రెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ తెలంగాణలోని కరీంనగర్‌కు చెందినవారని నారాయణ్ పూర్ ఎస్పీ రాబిన్‌సన్ గురియా తెలిపారు.
భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరు నక్సల్ కమాండర్లపై రూ.40 లక్షల చొప్పున రివార్డు ఉందని అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఒక ఏకే-47 రైఫిల్, ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్, బీజీఎల్ లాంచర్, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, నక్సల్స్ సాహిత్యం, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
మహారాష్ట్ర సరిహద్దుల్లోని అభుజ్‌మాద్ అడవుల్లో సోమవారం తెల్లవారుజామున ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు అధికారులు చెప్పారు. భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ జరుపుతుండగా కాల్పులు చోటుచేసుకున్నట్టు చెప్పారు. కాగా, ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు చేపట్టిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 249 మంది నక్సలైట్లు హతమయ్యారు. వీరిలో 220 మందిని ఒక్క బస్తర్ డివిజన్‌లోనే బలగాలు మట్టుబెట్టాయి.
ఇవి కూడా చదవండి..
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కలకలం
పైలట్ల తప్పిదం ఉందనడం బాధ్యతారాహిత్యం.. ఎయిరిండియా ప్రమాదంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి