Chimdambaram: అన్ని వైపులా లోపం ఉంది.. కరూర్ తొక్కిసలాటపై చిదంబరం
ABN , Publish Date - Sep 29 , 2025 | 05:02 PM
తిరుచ్చిలో మీడియాతో చిదంబరం మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటనపై తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కె.సెల్వపెరుంతగై పార్టీ వైఖరిని చెప్పారని, తన అభిప్రాయం కూడా అదేనని తెలిపారు. అయితే నిన్న, ఈరోజు వార్తాపత్రికలు చదవడం, టీవీలో విజువల్స్ చూసిన తర్వాత అన్ని వైపుల నుంచి లోపాలు ఉన్నట్టు తనకు అనిపించిందని చెప్పారు.
చెన్నై: తమిళనాడులోని కరూర్ (Karur)లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం (P Chidambaram) స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని వైపులా లోపం ఉందని ఆయన అన్నారు. నటుడు, టీవీకే నేత విజయ్ ఈనెల 27న కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పాయారు.
దీనిపై తిరుచ్చిలో మీడియాతో చిదంబరం మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటనపై తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కె.సెల్వపెరుంతగై పార్టీ వైఖరిని చెప్పారని, తన అభిప్రాయం కూడా అదేనని తెలిపారు. అయితే నిన్న, ఈరోజు వార్తాపత్రికలు చదవడం, టీవీలో విజువల్స్ చూసిన తర్వాత అన్ని వైపుల నుంచి లోపాలు ఉన్నట్టు తనకు అనిపించిందని చెప్పారు.
'ఏవైతే లోపాలు కనిపించాయో వాటి ఆధారంగా ఒక పరిష్కారం సూచించాలని అనుకున్నాను. నా సూచనలను తమిళనాడు చీఫ్ సెక్రటరీకి తెలియచేశాను. ప్రభుత్వానికి కూడా చాలా సూచనలు వచ్చాయి. అన్ని సూచనలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు వర్తించే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందని గట్టిగా చెప్పగలను' అని చిదంబరం అన్నారు.
కరూర్ తొక్కసలాట మృతుల్లో 18 మంది మహిళలు, 13 మంది పురుషులు, ఐదుగురు యువతులు, ఐదుగురు యువకులు ఉన్నారు. మృతుల్లో కరూర్ జిల్లాకు చెందిన వారితో పాటు ఈరోడ్, తిరుపూరు, దిండిగల్ జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున, సేలం జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. మృతుల కుటుంబాలకు టీవీకే చీఫ్ విజయ్ రూ.20 లక్షలు చొప్పన ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.2 లక్షలు ఇస్తామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పీఎం జాతీయ సహాయనిధి నుంచి సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50,000 ఇవ్వనున్నారు. తమిళనాడు ప్రభుత్వం సైతం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రలో మత ఘర్షణలు.. లాఠీచార్జి, 30 మంది అరెస్టు
విజయ్ పార్టీ నాయకులపై కేసులు నమోదు
For More National News And Telugu News