West Bengal: బెంగాల్‌లో బాబ్రీ మోడల్ మసీదు.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:23 PM
రెజినగర్‌లో ఏర్పాటు చేసిన వేదిక నుంచి కబీర్, పలువురు ఇస్లాం మతపెద్దలు రిబ్బన్ కత్తిరించి లాంఛనంగా బాబ్రీ మసీదు శంకుస్థాపన జరిగినట్టు ప్రకటించారు. నారా-ఏ తక్బీర్, అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేశారు.
బహరాంపూర్: వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అయోధ్య బాబ్రీ మసీదు మోడల్‌లో పశ్చిమబెంగాల్‌లో మసీదు నిర్మించనున్నట్టు ప్రకటించి సస్పెన్షన్‌కు గురైన టీఎంసీ మాజీ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ (Humanyun Kabir) శనివారంనాడు ముర్షీదాబాద్ జిల్లా రెజినగర్‌లో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా రాష్ట్ర పోలీసులు, ఆర్ఏఎఫ్, కేంద్ర బలగాలను ఈ ప్రాంతంలో మోహరించారు.
రెజినగర్‌లో ఏర్పాటు చేసిన వేదిక నుంచి కబీర్, పలువురు ఇస్లాం మతపెద్దలు రిబ్బన్ కత్తిరించి లాంఛనంగా బాబ్రీ మసీదు శంకుస్థాపన జరిగినట్టు ప్రకటించారు. 'నారా-ఏ తక్బీర్', 'అల్లాహో అక్బర్' అంటూ నినాదాలు చేశారు. వాస్తవానికి మసీదు నిర్మాణం చేపట్టాలనుకున్న స్థలం ఈ వేదికకు కిలోమీటరు దూరంలో ఉంది. అయోధ్యలో డిసెంబర్ 6వ తేదీ బాబ్రీ మసీదు కూల్చివేత దినం కావడంతో అదేరోజు బాబ్రీ నమూనాలో మసీదు నిర్మాణాన్ని ప్రారంభిస్తామని కబీర్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఆదివారం ఉదయం నుంచి పలువురు తలపై ఇటుకలు ఉంచుకుని వేదక వద్దకు చేరుకోవడం కనిపించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా అధికార యంత్రాంగం రెజీనగర్‌తో పాటు సమీపంలోని బెల్టాంగ ప్రాంతాన్ని హైసెక్యూరిటీ జోన్‌గా మార్చింది.
రూ.300 కోట్లతో..
మతతత్వ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఈ వారం ప్రారంభంలో కబీర్‌ను పార్టీ నుంచి టీఎంసీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో అయోధ్యలో కూల్చివేతకు గురైన బాబ్రీ మసీదు నమూనాలో బెంగాల్‌లో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కబీర్ అదే వేదిక నుంచి మసీదు నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామని ప్రకటించారు. తన చర్య రాజ్యాంగవిరుద్ధం కాదని, ఆరాధానా స్థలం నిర్మించుకోవడం రాజ్యంగం తమకు కల్పించిన హక్కు అని, బాబ్రీ మసీదును నిర్మించి తీరుతామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు నిధుల సమస్య లేదన్నారు. ఒక పారిశ్రామికవేత రూ.80 కోట్లు ఇస్తామని వాగ్దానం చేసినట్టు తెలిపారు. 8,400 చదరపు అడుగుల భూమిలో మసీదు నిర్మాణం జరుపుతామని చెప్పారు. మసీదు ప్రాంగణంలో ఒక ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, యూనివర్శి, హోటల్, హెలిపాడ్ వంటివి తెస్తామన్నారు. మొత్తం ఖర్చు రూ.300 కోట్ల వరకూ అవుతుందని తెలిపారు. స్థానిక డాక్టర్ ఒకరు కోటి రూపాయలు విరాళం ఇచ్చినట్టు చెప్పారు. దేశంలో 40 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, వారిలో 4 కోట్ల మంది రాష్ట్రంలోనే ఉన్నారని చెప్పారు. అలాంటప్పుడు తాము ఇక్కడ మసీదు కట్టుకోకూడదా అని ప్రశ్నించారు. వేదకపై సౌదీ అరేబియాకు చెందిన మత నాయకులు కూడా పాల్గొన్నారు.
బిజేపే విమర్శలు
కాగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పరోక్షంగా పోలరైజేషన్‌ను టీఎంసీ ప్రోత్సహిస్తోందని బీజేపీ ఆరోపించింది. అయితే కబీర్ చర్యలు, రాజకీయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని టీఎంసీ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
ప్రపంచ దేశాలతో భారత్ బంధాలను ఎవరూ వీటో చేయలేరు: జైశంకర్
ఇండిగో విమానాల రద్దు.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు సిద్ధం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి