Share News

Supreme Court: రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్.. కారణమిదే

ABN , Publish Date - Feb 10 , 2025 | 03:01 PM

Supreme Court: రాష్ట్రాలపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. కొన్ని రాష్ట్రాలలో ఇంకా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయకపోవడంపైనా అసహనాన్ని వ్యక్తం చేసింది. అమికస్‌క్యూరీ విజయ్‌ అన్సారియా దాఖలు చేసిన స్టేటస్‌ నివేదికను ధర్మాసనం పరిశీలించింది.

Supreme Court: రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్.. కారణమిదే
Supreme Court of India

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ వేగవంతంపై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాలలో ఇంకా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయకపోవడంపైనా అసహనాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను మార్చి4కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వాజ్యాన్ని అనుమతించి సుప్రీం కోర్టు ఈరోజు (సోమవారం) విచారణ చేపట్టింది. జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ మన్‌మోహన్‌ల ధర్మాసనం విచారణ జరిగింది.


చాలా రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నం...

అమికస్‌క్యూరీ విజయ్‌ అన్సారియా దాఖలు చేసిన స్టేటస్‌ నివేదికను ధర్మాసనం పరిశీలించింది. తన నివేదికలో పేర్కొన్న అనేక విషయాలను కోర్టుకు అమికస్‌క్యూరీ నివేదించింది. ‘‘42 మంది ప్రస్తుత లోక్‌సభ ఎంపీలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. కొన్ని చోట్ల 30 ఏళ్ల నుంచి ప్రజా ప్రతినిధులపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఇప్పటికీ లేవు. మిగిలిన కేసులతో కలిపి విచారణ చేస్తున్నారు తప్ప... ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదు. దేశంలో ప్రజా ప్రతినిధుల కేసులు పెండింగ్‌లో ఉండటానికి ప్రత్యేకంగా విచారించే కోర్టులు లేకపోవడం ఒకటి. నిందితులుగా ఉన్న వారు ఏళ్ల తరబడి కోర్టుల్లో విచారణకు హాజరుకావడం లేదు.. ఇది మరో కారణం. సాక్షులకు ఏళ్ల తరబడి సమన్లు జారీ చేయడం లేదు, మరొకొన్ని అందించకపోవడం మరో కారణం. దేశంలో దాదాపు అన్ని చోట్ల ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఢిల్లీ లాంటి చోట్ల ప్రత్యేక కోర్టులు ఈ కేసులు విచారిస్తున్నా.... చాలా రాష్ట్రాల్లో పరిస్థితి భిన్నంగా ఉందని’’ అమికస్‌క్యూరీ తెలిపారు.


అలా నిబంధనలు విధించాల్సిందే...

హైకోర్టులకు ఈ కేసుల వివరాలపై నివేదిక కోరినా... సరిగా స్పందించక పోవడంతో అందుబాటులోకి వచ్చిన వివరాలతో నివేదిక అందించినట్లు అమికస్‌క్యూరీ పేర్కొన్నారు. క్రిమినల్ కేసులు ఉంటే 4వ తరగతి ఉద్యోగిగా అనర్హులు అవుతారని కానీ ప్రజా ప్రతినిధులుగా ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది. చాలా మంది ప్రజాప్రతినిధులపై డ్రగ్స్‌, ఆహార కల్తీ, కిడ్నాప్‌ కేసులు కూడా ఉన్నాయని పిటిషనర్‌ తరపు న్యాయవాది వికాస్‌ సింగ్‌.. కోర్టుకు చెప్పారు. అలాంటి వారు ప్రజాప్రతినిధులుగా ఉండటానికి వీల్లేదని ప్రజాప్రాతినిధ్య చట్టం స్పష్టంగా చెపుతోందన్నారు. 46, 47 మంది ఎంపీలపై కిడ్నాప్‌ కేసులు కూడా ఉన్నాయని లాయర్ వికాస్‌ సింగ్ తెలిపారు. ప్రతి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నేర చరిత్ర ఉన్న వారిని తమ కార్యవర్గంలో (ఆఫీస్‌ బేరర్‌గా కూడా) ఉంచకుండా ఈసీ నిబంధనలు విధించాలని అమికస్‌క్యూరీ కోరారు. ఇందుకు సంబంధించి ఈసీ మార్గదర్శకాలు ఉన్నాయని... వాటిని వెంటనే అమల్లోకి తీసుకురావాలని అమికస్‌క్యూరీ అన్నారు. అలా చేస్తే రాజకీయ పార్టీలను రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నియంత్రించినట్లు అవుతుందని... అమలు చేయడంలో కొన్ని సమస్యలు వస్తాయి కదా అని జస్టిస్ మన్మోహన్‌ ప్రశ్నించారు.


న్యాయవాదుల అభిప్రాయాలు..

నేర చరిత్ర గల వారిని నియంత్రించాలి అంటే ఇలాంటి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ఆఫీస్‌ బేరర్స్‌‌పై కూడా నియంత్రణ విధిస్తేనే కోర్టు తీర్పులపై ప్రజలకు గట్టి నమ్మకం ఏర్పడుతుందని న్యాయవాదులు చెప్పుకొచ్చారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను పలు హైకోర్టుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులు వివరించారు. కొన్ని కేసుల్లో 200 మంది వరకు సాక్షులు ఉన్నారని... ఒకవేళ నిందితుడు ఎంపీనో, ఎమ్మెల్యేనో అయితే ఒకరే సాక్షి అవుతున్నారని సుప్రీం న్యాయస్థానానికి న్యాయవాదులు తెలిపారు. దోషిగా తేలిన వ్యక్తి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి ఆఫీస్ బేరర్‌గా ఉండగలరా అనేది ప్రశ్న అని ఒక న్యాయవాది అన్నారు. . ఇవాళ చట్టం ప్రకారం వారు హత్య చేయవచ్చు.... కానీ అతను జాతీయ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి ఛైర్మన్‌గా ఉండవచ్చా అనేది కీలకంగా పరిగణించాల్సిన అంశం అన్నారు న్యాయవాది.


అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామన్న సుప్రీం..

ప్రతిఒక్కరి వాదనను తాము పరిగణనలోకి తీసుకుంటామని ఒక న్యాయవాది లేవనెత్తిన్న అభ్యంతరాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. అన్ని రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ వాదనలు కూడా వినాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. పీఎంఎల్‌ఎ, ఎన్‌ఐఎ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై కేసులు కూడా ఆలస్యం చేస్తున్నారని మరో న్యాయవాది.. కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందరి వాదనలు పరిగణనలోకి తీసుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ ఆ కారణంగా ఈ వ్యవహారంలో తుది తీర్పు ఆలస్యం కాకుండా ఉండాలన్నదే తమ లక్ష్యం అని పిటిషనర్‌ తరపు న్యాయవాది వికాస్‌ సింగ్‌ తెలిపారు. పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయని.. కానీ ఎంపీ, ఎమ్మెల్యేలపై కొన్ని ఉండటంతో అవి ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళుతున్నాయని సుప్రీంకోర్టు దృష్టికి మరో న్యాయవాది తీసుకొచ్చారు. అందరి వాదనల అనంతరం జస్టిస్ దీపాంకర్‌ దత్తా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు.


మెరుగైన పరిష్కారంతో రావాలన్న జస్టిస్..

నేరపూరిత రాజకీయాలను నేరంగా పరిగణించడం చాలా ముఖ్యమైన సమస్య అని... ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా అన్ని విషయాలు ఆలోచించి ప్రస్తుతం ఉన్న దానికంటే మెరుగైన పరిష్కారంతో రావాలని జస్టిస్‌ మన్మోహన్ వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధులపై దాఖలైన కేసుల విచారణలో పురోగతి లేదని మధ్యంతర ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. కేసుల విచారణలో పురోగతి లేకపోవడం, కొన్ని హైకోర్టుల నుంచి సరైన సమాచారం ఇవ్వకపోవడం, కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోవడంపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి సంబంధించిన విషయంలో పెద్దగా పురోగతి లేకపోగా... వాటికి ఈ ఏడాది కాలంలో మరికొన్ని కేసులు తోడయ్యాయని ధర్మాసనం తెలిపింది. ఈ కేసుల్లో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8, 9కి ముడిపడి రాజ్యంగపరమైన కొన్ని అంశాలతో ఉన్నాయన్నారు. ఈ విషయంలో అటార్నీ జనరల్‌ తమ అభిప్రాయం చెప్పాలని సుప్రీం కోర్టు కోరింది.


ఈసీ, కేంద్రానికి నోటీసులు...

ఎంపీ, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసుల విచారణ వేగవంతంపై కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక కొన్ని కేసులు నమోదు కావడం, కేసులు ఉన్నవారు కొంత మంది రాజకీయాల నుంచి వైదొలిగారని, మరికొంత మంది మరణించారని... అలాంటి కేసుల విషయాల్లో కూడా ఎలా వ్యవహరించాలో అభిప్రాయం చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. మూడు వారాల్లో కేంద్రం, ఈసి కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు ఇస్తూ.. తదుపరి విచారణ మార్చి 4కి సుప్రీం కోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. కేంద్రం, ఈసి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత పిటిషనర్‌లు రిజాయిండర్‌ దాఖలు చేసినా, చేయకపోయినా తదుపరి విచారణ కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి...

కుంభమేళాలో తదుపరి అమృత స్నానం ఎప్పుడు?

30కి పైగా బట్టల షాపులకు మంటలు

Read Latest National News And Telugu News

Updated Date - Feb 10 , 2025 | 03:15 PM