Share News

Dog Feeding Ban: స్టెరిలైజేషన్‌ తర్వాత కుక్కల్ని వదిలేయండి

ABN , Publish Date - Aug 23 , 2025 | 02:54 AM

ఢిల్లీలో ఒక్క వీధికుక్క కూడా కనిపించకుండా అన్నింటినీ తరలించివేయండి.. స్టెరిలైజేషన్‌ సంతాననియంత్రణ ఆపరేషన్‌ తర్వాత కూడా వీధుల్లోకి వదిలిపెట్టవద్దంటూ ఇచ్చిన తీర్పును శుక్రవారం సుప్రీంకోర్టు సవరించింది.

Dog Feeding Ban: స్టెరిలైజేషన్‌ తర్వాత కుక్కల్ని వదిలేయండి

  • రేబిస్‌ సోకినవాటిని మాత్రం వదలొద్దు.. గత తీర్పును సవరించిన సుప్రీంకోర్టు

  • కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దు

  • త్రిసభ్య బెంచ్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 22 : ఢిల్లీలో ఒక్క వీధికుక్క కూడా కనిపించకుండా అన్నింటినీ తరలించివేయండి.. స్టెరిలైజేషన్‌ (సంతాననియంత్రణ ఆపరేషన్‌) తర్వాత కూడా వీధుల్లోకి వదిలిపెట్టవద్దంటూ ఇచ్చిన తీర్పును శుక్రవారం సుప్రీంకోర్టు సవరించింది. వీధుల్లో పట్టుకున్న కుక్కలను స్టెరిలైజేషన్‌ తర్వాత తిరిగి వీధుల్లోకి వదిలిపెట్టాలని ఆదేశించింది. అయితే, రేబిస్‌ వ్యాధికి గురైనవాటిని, తీవ్రస్వభావం కలిగినవాటిని మాత్రం షెల్టర్లకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. వీధుల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని అనుమతించరాదని, ఈ నిబంధనను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ తాజా ఉత్తర్వులు జారీచేసింది. నిజానికి, వీధికుక్కలపై ఇటీవల సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం జంతుప్రేమికులను కలతపరిచింది. వీధికుక్కల సమస్యను నియంత్రించడంలో స్టెరిలైజేషన్‌ ప్రక్రియకు ఉన్న ప్రాధాన్యాన్ని కోర్టు విస్మరించిందని ‘పెటా’ వంటి జంతు సంరక్షణ సంస్థలు పెదవి విరిశాయి. ఈ నెల 8వ తేదీన జస్టిస్‌ పార్దివాలా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ స్వయంగా కలగజేసుకున్నారు. పునఃపరిశీలన కోసం ఈ అంశాన్ని ముగ్గురు సభ్యుల బెంచ్‌కు ఆయన కేటాయించారు. ఒక బెంచ్‌ తీసుకున్న నిర్ణయంలో చీఫ్‌జస్టిస్‌ జోక్యం చేసుకోవడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఎన్వీ అంజారియాలతో కూడిన బెంచ్‌ శుక్రవారం తాజా ఆదేశాలు జారీచేసింది. ‘కోర్టు వ్యాఖ్యలు మరీ కఠినంగా ఉన్నాయి’ అంటూ గత తీర్పును బెంచ్‌ ప్రస్తావించింది. ఉద్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడం ఏకపక్ష తీర్పులతో వీలుకాదని వ్యాఖ్యానించింది. కుక్కలను ఎక్కడనుంచి పట్టుకువెళ్లారో వ్యాక్సినేషన్‌, డీవార్మింగ్‌ జరిపిన తర్వాత తిరిగి అక్కడికే తెచ్చి వదిలిపెట్టాలని అధికారులకు బెంచ్‌ సూచించింది. వీధికుక్కలను పెంచుకునేందుకు జంతుప్రేమికులను అనుమతించిన కోర్టు.. ఒకసారి దత్తత తీసుకున్నాక తిరిగి అవి వీధుల్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత దరఖాస్తుదారులదేనని తేల్చిచెప్పింది. వీధికుక్కల అంశంపై హైకోర్టుల్లో దాఖలైన అన్ని పిటిషన్లను తెప్పించుకుంటామని, త్వరలోనే దీనిపై జాతీయ పాలసీని రూపొందిస్తామని తెలిపింది. వ్యక్తిగత పిటిషనర్లు, ఎన్‌జీవోలు రూ.25 వేలు నుంచి రూ. రెండు లక్షల వరకు కోర్టులో డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. తీర్పును కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ స్వాగతించారు. జంతువుల సంరక్షణకు, ప్రజల భద్రతకు మధ్య సాధించాల్సిన సమన్వయం విషయంలో సుప్రీంకోర్టు గొప్ప ముందడుగు వేసిందన్నారు.ఛ


సంబరాల్లో మునిగిన జంతుప్రేమికులు

సవరించిన కోర్టు తీర్పు జంతుప్రేమికుల్లో సంతోషాన్ని నింపింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్దకు చేరుకుని వారంతా సంబరాలు జరుపుకొన్నారు. కొందరు భగవంతునికి ధన్యవాదాలు తెలిపితే, ‘హరహర మహాదేవా..’ అంటూ మరికొందరు నినాదాలు చేశారు. కమ్యూనిటీ జంతువుల సంరక్షణపై కోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని ఓ జంతు ప్రేమికురాలు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

చట్టంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు

వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్

For More National News And Telugu News

Updated Date - Aug 23 , 2025 | 02:54 AM