Budget session: రాష్ట్రపతి ప్రసంగంపై స్పందించిన సోనియా.. బీజేపీ మండిపాటు
ABN , Publish Date - Jan 31 , 2025 | 04:27 PM
Sonia Gandhi: బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఆమె ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు స్పందించారు.

న్యూఢిల్లీ, జనవరి 31: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అందులోభాగంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు స్పందించిన తీరుపై రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ మాట్లాడుతూ.. ప్రసంగం చివరల్లో రాష్ట్రపతి బాగా అలసిపోయారన్నారు. అమె మాట్లాడలేక పోయారని తెలిపారు. అయితే సోనియా గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తప్పు పట్టింది. రాష్ట్రపతికి ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అయినా.. రాష్ట్రపతి వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించ కూడదని బీజేపీ అభిప్రాయపడింది.
ఇక లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్‌గా ఉందన్నారు. చెప్పిన అంశాన్నే పదే పదే ఆమె చెప్పుకొచ్చారని పేర్కొన్నారు. అయితే ఆదివాసీ మహిళ అయిన రాష్ట్రపతిపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలు ఈ విధంగా మాట్లాడడం వారి మైండ్ సెట్‌ను సూచిస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియి అన్నారు.
ఇక బిహార్‌కు చెందిన ఆర్జేడీ ఎంపీ పప్పు యాదవ్ స్పందించారు. రాష్ట్రపతి రబ్బరు స్టాంప్ అని ఆయన అభివర్ణించారు. రాష్ట్రపతి ఒక స్టాంప్ అని పేర్కొన్నారు. ఆమె ప్రేమలేఖ తరహాలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగ పాఠం చదవారన్నారు. గాంధీ కుటుంబలోని వారు కాకుండా బయట వ్యక్తులు రాజ్యాంగ పదవులు చేపడితే వారు సహించలేరని ఈ సందర్భంగా మండిపడ్డారు. అయితే రాష్ట్రపతిపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు.. ప్రతి భారతీయుడిని అవమానించినట్లుగా ఉందన్నారు.
Also : దేవాలయాల్లో వీఐపీ దర్శనాలు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అంతేకాదు.. షెడ్యుల్ తెగలకు చెందిన ప్రతి మహిళను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు అవమానించారని పేర్కొన్నారు. దీనిని దేశం ఏ మాత్రం సహించలేదని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ నేతలు చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా స్పందిస్తూ.. గిరిజన వర్గాలకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ తరహా పదాలను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడం కాంగ్రెస్ పార్టీ స్వభావాన్ని సూచిస్తుందంటూ ఆయన తన ట్విట్టర్ వేదికగా ట్విట్ చేశారు. ఇక మరో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సైతం ఈ వ్యాఖ్యలను ఖండించారు, ఇది రాష్ట్రపతి కార్యాలయాన్ని అవమానించడమే అని అన్నారు.
శుక్రవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గంట పాటు ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్డీయే పాలనలో పని వేగం మూడు రెట్లు పెరిగిందన్నారు. అలాగే వివిధ రంగాల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను రాష్ట్రపతి సోదాహరణగా వివరించారు. ఆ క్రమంలో వక్ఫ్ బోర్డులు, జమిలి ఎన్నికలు తదితర అంశాలను ఆమె ప్రస్తావించారు. ఈ ప్రసంగం అనంతరం పార్లమెంట్ వెలుపల మీడియాలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియా, రాహుల్ గాంధీలు పైవిధంగా స్పందించారు.
For For National News And Telugu News