Ladakh Statehood Row: రాష్ట్ర హోదా ఆందోళనలు హింసాత్మకం.. నిరాహార దీక్ష విరమించిన సోనం వాంగ్‌చుక్
ABN , Publish Date - Sep 24 , 2025 | 05:54 PM
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించి, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు. ఇందువల్ల భూములు, ఉద్యోగాలు, కల్చరల్ ఐడెంటిటీకి పరిరక్షణ లభిస్తుందని అంటున్నారు.
శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ (Ladakh)కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ (Sonam Wangchuk) 15 రోజులుగా సాగిస్తున్న నిరాహార దీక్షను విరమించారు. రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ లెహ్ నగరంలో పెద్దఎత్తున ఆందోళనకారులు బుధవారం నాడు రోడ్లపైకి వచ్చారు. పోలీసులతో ఘర్షణకు దిగడం, రాళ్లురువ్వడం, సీఆర్‌పీఎఫ్ వాహనంతోపాటు బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టడం వంటి హింసాత్మక చర్యలకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఈ నేపథ్యంలో ఉద్యమం హింసాత్మక రూపు దాల్చడంతో తన నిరాహార దీక్షను విరమిస్తున్నట్టు సోనం వాంగ్‌చుగ్ ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
'లద్దాఖ్ యువకులు తక్షణం హింసను నిలిపివేయాలి. ఇందువల్ల మన ఉద్దేశం దెబ్బతినడంతోపాటు పరిస్థితి దిగజారిపోతుంది. లద్దాఖ్‌లో కానీ దేశంలో కానీ అస్థిరతను మనం కోరుకోవడం లేదు' అని దీక్షా శిబిరం వద్ద గుమిగూడిన తన మద్దతుదారులను ఉద్దేశించి వాంగ్‌చుక్ పేర్కొన్నారు.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించి, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని, తద్వారా భూములు, ఉద్యోగాలు, కల్చరల్ ఐడెంటిటీకి పరిరక్షణ లభిస్తుందని వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు. లద్దాఖ్ రాజకీయ భవిష్యత్తుపై చాలాకాలంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో వాంగ్‌చుక్ నిరాహార దీక్షతో తిరిగి ఈ ఆందోళనకారుల్లో కదలిక వచ్చినట్టు చెబుతున్నారు. 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి బుధవారం నాడు క్షీణించింది. ఈ నేపథ్యంలో యువత రోడ్డుపైకి రావడంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
కాంగ్రెస్సే హింసను ప్రేరేపించింది: బీజేపీ
లద్దాఖ్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై కాంగ్రెస్‌ను బీజేపీ తప్పుపట్టింది. హింసను కాంగ్రెస్ రెచ్చగొట్టిందని అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆరోపించారు. అప్పర్ లెహ్ వార్డుకు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ ఆందోళనకారులను రెచ్చగొట్టినట్టు చాలా స్పష్టంగా తెలుస్తోందన్నారు. బీజేపీ కార్యాలయం, హిల్ కౌన్సిల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ హింస జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయన పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
లద్దాఖ్‌లో భగ్గుమన్న నిరసనలు.. తెరపైకి రాష్ట్ర హోదా డిమాండ్..
జమ్మూకశ్మీర్ నుంచి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రకటించిన ఈసీ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి