Sonam Wangchuk Arrest: లద్దాఖ్ హింస.. వాంగ్‌చుక్ అరెస్టు..
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:04 PM
షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాంగ్‌చుక్ మీడియా సమావేశంలో మాట్లాడాల్సి ఉండగా, దానికి ముందే ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించాలని, దానిని గిరిజన హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ వాంగ్‌చుక్ ఉద్యమం సాగిస్తున్నారు.
లెహ్: లద్దాఖ్ (Ladakh)లోని లెహ్ (Leh)లో రెండ్రోజుల క్రితం జరిగిన శాంతియుత నిరసనలు హింసాకాండకు దారితీశాయి. ఈ ఘటనల్లో నలుగురు మరణించగా, 70 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కోరుతూ నిరసనలకు దిగిన ఆందోళనకారులను రెచ్చగొట్టారంటూ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk)ను శుక్రవారం నాడు అరెస్టు చేశారు. కఠినమైన జాతీయ భద్రతా చట్టం (NSA) కింద ఆయనను అరెస్టు చేశారు.
షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాంగ్‌చుక్ మీడియా సమావేశంలో మాట్లాడాల్సి ఉండగా, దానికి ముందే ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించాలని, దానిని గిరిజన హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ వాంగ్‌చుక్ ఉద్యమం సాగిస్తున్నారు.
కాగా, వాంగ్‌చుక్ స్వచ్ఛంద సంస్థ అయిన 'స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్ ఆఫ్ లద్దాఖ్' (SECMOL) లైసెన్స్‌ను హోం శాఖ గురువారం నాడు రద్దు చేసింది. ఆ సంస్థకు విరాళాలు నిలిపివేసింది. అరబ్ స్ప్రింగ్, నేపాల్ 'జెన్ జడ్' నిరసనలను తన ప్రసంగంలో వాంగ్‌చుక్ ప్రస్తావిస్తూ లెహ్‌లోని యువతను రెచ్చగొట్టారని హోం మంత్రిత్వ శాఖ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను వాంగ్‌చుక్ తోసిపుచ్చారు. మరోవైపు, ఈ అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కూడా విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది. సీబీఐ గత రెండు నెలలుగా ప్రాథమిక దర్యాప్తు కూడా జరిపింది. వాంగ్‌చుక్ సంస్థ ఎఫ్‌సీఆర్ఏ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. లద్దాఖ్ పర్వావరణ కార్యకర్త అయిన వాంగ్‌చుక్ 2018లో రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు.
ఇవి కూడా చదవండి..
సిక్కుల మనుగడపై వ్యాఖ్యలు.. రాహుల్‌గాంధీకి హైకోర్టులో చుక్కెదురు
మహిళల అకౌంట్లలోకి రూ.7,500 కోట్లు.. ముఖ్యమంత్రి మహిళా యోజన షురూ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి