Rahul Gandhi: సిక్కుల మనుగడపై వ్యాఖ్యలు.. రాహుల్‌గాంధీకి హైకోర్టులో చుక్కెదురు
ABN , Publish Date - Sep 26 , 2025 | 03:53 PM
రాహుల్ గాంధీ 2024లో అమెరికాలో పర్యటించినప్పుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు ఇది. భారతదేశంలో సిక్కులు స్వేచ్ఛగా తమ విశ్వాసాలను పాటించలేకున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.
అలహాబాద్: ఇండియాలో సిక్కుల మతస్వేచ్ఛపై గతేడాది అమెరికా (US)లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి అలహాబాద్ హైకోర్టు (Alahabad High Court)లో చుక్కెదురైంది. ఇదే అంశంపై వారణాసిలోని ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాహుల్ వేసిన రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం నాడు తోసిపుచ్చింది. దీంతో ప్రత్యేక కోర్టు విచారణను రాహుల్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
రాహుల్ గాంధీ 2024లో అమెరికాలో పర్యటించినప్పుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు ఇది. భారతదేశంలో సిక్కులు స్వేచ్ఛగా తమ విశ్వాసాలను పాటించలేకున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. వాషింగ్టన్ డీసీ శివార్లలోని హండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడారు. 'సిక్కులు తలపాగాలు ధరించవచ్చా, కడియాలు ధరించవచ్చా, వారు గురుద్వారాకు వెళ్లగలుగుతున్నారా? అనే వాటిపైనే భారత్‌లో ఘర్షణలు జరుగుతున్నాయి' అని రాహుల్ వ్యాఖ్యానించారు.
రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. రాహుల్‌పై ఎఫ్ఐఆర్‌కు ఆదేశించాలని కోరుతూ వారణాసికి చెందిన నాగేశ్వర్ మిశ్రా అనే వ్యక్తి కోర్టుకు వెళ్లారు. ఈ ప్రసంగం అమెరికాలో చేసినందున ఇది తమ పరిధిలోకి రాదని పేర్కొంటూ ఈ పిటిషన్‌ను 2024 నవంబర్‌లో అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు. అయితే కోర్ట్ ఆఫ్ స్పెషల్ జడ్జి (ఎంపీ/ఎమ్మెల్యే) ఈ ఏడాది జూలై 21న మిశ్రా రివిజన్ పిటిషన్‌ను స్వీకరించి, విచారణకు ఏసీజేఎంను ఆదేశించింది. ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వుపై రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక కోర్టు చర్య తప్పని, చట్టవిరుద్ధమని, కోర్టు పరిధిలోకి రాదని రాహుల్ తన రివిజన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మహిళల అకౌంట్లలోకి రూ.7,500 కోట్లు.. ముఖ్యమంత్రి మహిళా యోజన షురూ
బ్లాక్ బోర్డు గుర్తుపై తేజ్‌ప్రతాప్ జనశక్తి జనతాదళ్ పోటీ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి