Share News

Delhi Assembly Elections 2025: ఏ ఒక్క మురికివాడను కూల్చం.. మోదీ భరోసా

ABN , Publish Date - Feb 02 , 2025 | 04:58 PM

ఆప్ తమ ప్రకటనతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని, తాము ప్రచారం కోసం ప్రకటనలు చేయమని, చేసిన వాగ్దానాలను నిలబెట్టుకునేందుకు బడ్జెట్‌లో వెసులుబాట్లు కల్పిస్తామని ఢిల్లీలోని ఆర్కే పురంలో ఆదివారంనాడు జరిగిన ర్యాలీలో మోదీ పేర్కొన్నారు.

Delhi Assembly Elections 2025: ఏ ఒక్క మురికివాడను కూల్చం.. మోదీ భరోసా

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) విజయం సాధిస్తే ఢిల్లీలోని ఒక్క మురికివాడను (Slums) కూడా కూల్చమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడలను లక్ష్యంగా చేసుకుందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ప్రధాని కొట్టివేశారు. ఒక్క మురికివాడను కూడా తాము కూల్చే ప్రసక్తి లేదన్నారు. ఆప్ తమ ప్రకటనతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని, తాము ప్రచారం కోసం ప్రకటనలు చేయమని, చేసిన వాగ్దానాలను నిలబెట్టుకునేందుకు బడ్జెట్‌లో వెసులుబాట్లు కల్పిస్తామని ఢిల్లీలోని ఆర్కే పురంలో ఆదివారంనాడు జరిగిన ర్యాలీలో మోదీ పేర్కొన్నారు.

Delhi Assembly Elections 2025: స్వతంత్ర పరిశీలకులను నియమించండి.. ఈసీకి కేజ్రీవాల్ లేఖ


పథకాలన్నీ కొనసాగిస్తాం

అమలులో ఉన్న ప్రజాసంక్షేమ పథకాలన్నింటికీ తాము కొనసాగిస్తామని ఢిల్లీ ప్రజలకు మోదీ భరోసా ఇచ్చారు. ప్రజాప్రయోజనాలకే తాము పెద్దపీట వేస్తామని, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఏ పథకాన్ని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేసే ప్రసక్తి ఉండదని చెప్పారు. పూర్వాంచల్, బిహారీ కమ్యూనిటీల నుంచి తనకు పెద్ద సంఖ్యలో మెసేజ్‌లు వచ్చినట్టు చెప్పారు. ''వారి మనోభావాలను నేను అర్థం చేసుకోగలను. నేను కూడా పూర్వాంచల్ ఎంపీనే. కోవిడ్ సమయంలో వారి పట్ల కొన్ని పార్టీలు అనుచితంగా వ్యవహరించాయి. ఢిల్లీలోని బలవంతంగా పంపేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం పూర్వాంచల్, బీహార్ ప్రజలకు ఎప్పుడూ బాసటగా ఉంటుంది'' అని అన్నారు.


స్థానిక రైతులకు మేలు చేసేందుకు మఖానా బోర్డ్

బీహార్ కోసం ఎన్డీయే చేస్తున్న ప్రయత్నాలను మోదీ వివరిస్తూ, మఖానా బోర్డు ఏర్పాటు వల్ల స్థానిక రైతులకు, ముఖ్యంగా మఖానా సేద్యంలో ఉన్న దళిత కుటుంబాలకు మేలు జరుగుతుందని అన్నారు. దళిత కుటుంబాలకు మేలు చేసే పని ఎప్పుడూ తలపెట్టినప్పుడుల్లా కొందరు వ్యక్తులు తనను పరిహసిస్తుంటారని చెప్పారు.


మహిళలందరికీ రక్షణ కవచం

దేశంలోని తల్లులు, ఆడకూతుళ్లందరికీ మోదీ రక్షణ కవచంగా ఉంటారని ప్రధాని చెప్పారు. మూడోసారి దేశానికి తాను సేవలందిస్తున్నానంటే దేశంలోని మహిళల ఆశీర్వాదమే కారణమని అన్నారు. మోదీ ఇచ్చే ప్రతి హామీలోనూ మహిళలకు కీలక భూమిక ఉంటుందని స్పష్టంచేశారు.


అవినీతిలో దెందూదొందే

కాంగ్రెస్, ఆప్ పార్టీల అవినీతిపై మోదీ విమర్శలు గుప్పించారు. క్రీడల అభివృద్ధి పేరుతో రెండు పార్టీలు ఢిల్లీ యువతను వంచించాయని ఆరోపించారు. సీడబ్ల్యూజీ స్కామ్‌తో కాంగ్రెస్‌పై పడిన మచ్చ చెరిగిపోదని, స్పోర్ట్ యూనివర్శిటీ ముసుగులో ఢిల్లీ యువత భవిష్యత్తుతో ఆప్‌దా పార్టీ ఆడుకుందని విమర్శించారు. ఇవాల్టి యంగ్ ఇండియా బీజేపీని బలంగా నమ్ముతూ మద్దతిస్తోందని స్పష్టం చేశారు.


బడ్జెట్‌లో మధ్యతరగతికి స్నేహహస్తం

ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ప్రధానమంత్రి ప్రశంసలు కురిపించారు. ఇది ''మధ్యతరగతి వర్గాల మైత్రీ బడ్జెట్'' అని, ''ప్రజా బడ్జెట్'' అని అన్నారు. మధ్యతరగతి వర్గాన్ని గౌరవించి, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి రివార్డులు ఇచ్చే పార్టీ బీజేపీ అని చెప్పారు. కొత్త బడ్జెట్‌తో మధ్యతరగతి ప్రజలకు రోజువారీ అవసరాలు, కొనుగోళ్లు సులభతరమవుతాయని అన్నారు.


నెహ్రూ, ఇందిరపై చురకలు

ప్రజలు సంపాదించుకునే దానిపై మాజీ ప్రధానులు జహహ‌ర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ భారీగా పన్నులు వడ్డించే వారని, కానీ తమ ప్రభుత్వం పన్నుభారాన్ని సులభతరం చేసి మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కలిగించిందని వివరించారు. నెహ్రూ హయాంలో ఒక వ్యక్తి రూ.12 లక్షలు సంపాదిస్తే నాలుగోవంతు పన్ను రూపంలో వెళ్లిపోయేదని, ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉంటే రూ.12 లక్షలకు సుమారు రూ.10 లక్షలు టాక్సుల్లోకి వెళ్లిపోయేవని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల ఆదాయం అంటే రూ.2.6 లక్షలు పన్నుగా చెల్లించాల్సి వచ్చేదని, కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌తో రూ.12 లక్షల ఆదాయం సంపాదించే వారు పన్ను కట్టనవసరం లేదని (జీరో టాక్స్) వివరించారు.


కార్యకర్తలకు దిశానిర్దేశం

ఫిబ్రవరి 5వ తేదీ ఎంతో దూరంలో లేదని, బీజేపీ కార్యకర్తలు, శ్రేయాభిలాషులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రతి కుటుంబాన్ని, ఓటరును కలుసుకుని మోదీ అభినందనలు, శాల్యుటేషన్‌ను వారికి చేరవేయాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఢిల్లీని ఆప్‌దా ప్రభుత్వం నుంచి విముక్తి చెప్పాలని కార్యకర్తలందరినీ కోరుతున్నానని, ఫిబ్రవరి 5న బీజేపీకి ఓటు వేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త తమతో ఐదుగురిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు.



ఇవి కూడా చదవండి..

Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 06:15 PM