Durgapur Incident: వైద్య విద్యార్థిపై అత్యాచారం.. నిందితుడిని పట్టించిన సోదరి
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:59 PM
పశ్చిమ బెంగాల్‌లో ఒరిస్సాకు చెందిన ఓ మెడికల్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులోని ఓ నిందితుడిని పట్టించేందుకు అతడి సోదరే పోలీసులకు సాయం చేసింది.
జాతీయం: పశ్చిమ బెంగాల్‌లో ఒరిస్సాకు చెందిన ఓ మెడికల్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక నిందితులకు సహకరించిన మరో యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు పారిపోయేందుకు సహకరించిన మరో యువకుడిని నేడు(మంగళవారం) అరెస్టు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఈ యువకుడి అరెస్ట్ లో అతడి సోదరి పోలీసులకు సాయం చేసింది. నిందితుడి సోదరి ఇచ్చిన సమాచారంతోనే పరారీలో ఉన్న అతడిని పోలీసులు గుర్తించారు. ఐదో నిందితుడిగా ఉన్న సఫీక్ దుర్గాపుర్‌లోని అందాల్ బ్రిడ్డి( Durgapur Incident) కింద దాక్కున్నాడు. ఆ విషయాన్ని అతడి సోదరి రోజినా పోలీసులకు చేరవేసింది. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. తన సోదరుడు చేసిన తప్పునకు తగిన శిక్ష అనుభవించాలనే ఉద్దేశంతోనే పోలీసులకు(Police) సమాచారం ఇచ్చినట్లు నిందితుడి సోదరి రోజినా మీడియాకు తెలిపింది. ఇక సదరు యువతి చేసిన పనికి సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వస్తున్నాయి. ప్రతి ఇంట్లో ఇలాంటి సోదరి ఉంటే..తప్పు చేయాలి అనుకునే వారికి భయం వేస్తుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక బాధితురాలు(Medical Student) ఆ రోజు జరిగిన భయానక క్షణాలను గుర్తు చేసుకుంది. శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లినప్పుడు కొందరు దుండగులు తమను వెంబడించినట్లు తెలిపింది. వెంటనే తాము అడవి(Forest) వైపు పరిగెత్తుతున్న సమయంలో తన స్నేహితుడు మరో వైపునకు వెళ్లడాని తెలిపింది. దీంతో నిందితులు తనను బలవంతంగా అడవిలోనే వేరే ప్రాంతానికి లాక్కెళ్లినట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాను వారిపై తిరగపడేందుకు ప్రయత్నిస్తుండగా..అరిస్తే మరికొంత మందిని పిలుస్తామని నిందితులు బెదిరించారంటూ కన్నీటి పర్యంతమైంది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు ఇంట్రస్టింగ్ పోస్ట్
భాగ్యనగరంలో మరో బడా మోసం.. .. రుణం పేరిట కుచ్చుటోపీ