Task cut out for Australia: భారత్‌తో సిరీస్ వేళ.. ఆస్ట్రేలియాకు డబుల్ షాక్!
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:57 PM
ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు భారత్‌తో జరగబోయే తొలి వన్డేకు దూరమయ్యారు. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ మొదటి వన్డే మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. ఎందుకంటే..
భారత్, ఆస్ట్రేలియా మధ్య త్వరలో వన్డే సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఎలాగైనా భారత్ పై గెలిచి వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తున్న ఆస్ట్రేలియాకు రెండు బిగ్ షాకులు తగిలాయి. ఇలా టీమిండియాతో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టు అనూహ్య సవాళ్లను ఎదుర్కొంటోంది.
ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు భారత్‌తో జరగబోయే తొలి వన్డేకు దూరమయ్యారు. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా(Adam Zampa ), వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్(Josh Inglis) మొదటి వన్డే మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. ఇండియా , ఆసీస్(Australia) మధ్య అక్టోబర్ 19న పెర్త్‌లో తొలి వన్డే జరగనుంది. ఆడమ్ జంపా, జోష్ ఇంగ్లిష్ స్థానంలో మాథ్యూ కుహ్నెమాన్, జోష్ ఫిలిప్‌లను జట్టులోకి తీసుకున్నారు. అయితే జోష్ ఫిలిప్ మొదటిసారి వన్డేలలో వికెట్ కీపింగ్ చేయనున్నాడు.
ఇక ఆడమ్ జంపా, జోష్ ఇంగ్లిష్(Josh Inglis)కుటుంబ పనుల కారణంగా ఈ వన్డేకు దూరమైనట్లు తెలుస్తోంది. జంపా తండ్రి కానున్నాడు. అతడి భార్య త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలోనే అతడు తొలి వన్డేకు అందుబాటులో ఉండడం లేదు. అయితే అతను సిరీస్‌లోని చివరి రెండు వన్డేలకు అందుబాటులో ఉంటాడని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు జోష్ ఇంగ్లిస్ కాలు కండరం గాయం నుంచి కోలుకోలేదు. ఈ గాయం కారణంగానే అతను న్యూజిలాండ్ పర్యటనలో కూడా ఆడలేకపోయారు. దీంతో జోష్ తొలి రెండో వన్డేలో ఆడటం కూడా కష్టమే. మొత్తంగా ఆసీస్ (Australia Squad Changes), భారత్ వన్డే సిరీస్ ఆసక్తికరంగా మారింది.