BMC Polls: ఠాక్రే సోదరులు కలిసికట్టుగా పోటీ.. బీఎంసీ ఎన్నికలపై కుదిరిన అవగాహన
ABN , Publish Date - Dec 22 , 2025 | 09:40 PM
మరాఠా ప్రజలకు కంచుకోటగా దాదర్, శివడి, వోర్లి, ములుంద్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సీట్ల పంపకాలపై ఇంతకుముందు రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అయితే దాదాపు అన్నిచోట్ల ఆమోదయోగ్యమైన రీతిలో తాజాగా పరిష్కారం కుదిరినట్టు చెబుతున్నారు.
ముంబై: కీలకమైన బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMS) ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసేందుకు శివసేన యూబీటీ (UBT), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) మధ్య సోమవారంనాడు జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీలో రెండు పార్టీల నేతలు సుమారు రెండున్నర గంటల సేపు సమావేశమయ్యారు. మరాఠీ భాష మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సీట్ల పంపకాలకు సంబంధించి తలెత్తిన విభేదాలను ఇరు పార్టీలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నాయని, పొత్తులు, సీట్ల పంపకాలపై త్వరలోనే సంయుక్త ప్రకటన చేయనున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మరాఠా ప్రజల ఆధిక్యత ఉన్న దాదర్, శివడి, వోర్లి, ములుంద్ ప్రాంతాల్లో సీట్ల పంపకాలపై ఇంతకుముందు రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అయితే దాదాపు అన్నిచోట్ల ఆమోదయోగ్యమైన రీతిలో తాజాగా పరిష్కారం కుదిరినట్టు చెబుతున్నారు.
మరోవైపు, శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP-SP)ని కూడా తమతో కలుపుకొని వెళ్లేందుకు శివసేన (యూబీటీ), ఎంఎన్ఎస్ చర్చలు జరుపుతున్నాయి. బీఎంసీతో సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 2026 జనవరి 15న ఎన్నికలు జరుగనుండగా, జనవరి 16న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
సుపరిపాలనకు ప్రజలు పట్టం.. గోవాలో బీజేపీ విక్టరీపై మోదీ
గోవా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి