Traffic Jam : భారీ ట్రాఫిక్ జామ్.. అంబులెన్స్‌లోనే ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ABN , Publish Date - Aug 10 , 2025 | 08:07 PM
స్థానికంగా మెరుగైన వైద్య సదుపాయాల లేమి, గుంతలతో కూడిన రోడ్లు, మరో పక్క భారీ ట్రాఫిక్ జామ్ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా 49 ఏళ్ల మహిళ.. ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది.
ముంబై, ఆగస్టు 10: స్థానికంగా మెరుగైన వైద్య సదుపాయాల లేమి, గుంతలతో కూడిన రోడ్లు, మరో పక్క భారీ ట్రాఫిక్ జామ్ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. తీవ్రగాయాలపాలైన 49 ఏళ్ల మహిళను ముంబై ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా మృతిచెందింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన ఛాయా పురవ్ మరణం.. పాల్ఘర్‌లోని ఆరోగ్య మౌలిక సదుపాయాల లేమిని, జిల్లాను మాగ్జిమమ్ సిటీకి అనుసంధానించే NH-48పై ట్రాఫిక్ భయాన్ని ఏకకాలంలో వెలుగులోకి తెచ్చింది.
జులై 31న, పాల్ఘర్ మధుకర్ నగర్‌లోని పురవ్ ఇంటి సమీపంలో ఒక చెట్టు కొమ్మ ఆమెపై పడటంతో పురవ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె పక్కటెముకలు, భుజాలు, తలకు గాయాలయ్యాయి. పాల్ఘర్‌లో ట్రామా కేర్ సెంటర్ లేదు. దీంతో స్థానిక ఆస్పత్రి ఆమెను ముంబైలోని హిందూజా ఆసుపత్రికి రిఫర్ చేసింది. అయితే, ఈ పెద్దాసుపత్రి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణానికి సాధారణంగా 2:30 గంటలు పడుతుంది. దీని ప్రకారం, పురవ్ కు అనస్థీషియా ఇచ్చారు. ఆమె భర్త అంబులెన్స్‌లో ఆమె పక్కనే కూర్చుని ఉండగా వారి ప్రయాణం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది.
అనంతరం అంబులెన్స్ NH-48లో భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంది. దీంతో వారు బయలుదేరిన మూడు గంటల తర్వాత సుమారు 6 గంటలకు అంబులెన్స్ సగం దూరం మాత్రమే ప్రయాణించింది. అనస్థీషియా ప్రభావం తగ్గడం ప్రారంభమైంది. దీంతో పురవ్ విపరీతమైన నొప్పితో బాధపడింది. ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో అంబులెన్స్ రాత్రి 7 గంటల ప్రాంతంలో హిందూజా ఆసుపత్రి నుంచి 30 కి.మీ. దూరంలోని మీరా రోడ్ లోని ఆర్బిట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే చాలా ఆలస్యమైంది. పురవ్ ను పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు. 30 నిమిషాల ముందు ఆసుపత్రికి చేరుకుంటే కాపాడ గలిగేవాడినని ఆమె భర్త కౌశిక్ వాపోయారు. ఆమె నాలుగు గంటలు భరించలేని నొప్పితో బాధపడుతుండటం తాను కళ్లారా చూశానంటూ మృతురాలి భర్త కన్నీటి పర్యంతమయ్యారు.
భార్య మరణంతో షాక్ కు గురైన భర్త.. తన భార్య పురవ్ ను కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నించామని, కానీ ట్రాఫిక్ జామ్ తమ ప్రయత్నాలన్నింటినీ విఫలం చేసిందని అన్నారు. 'రోడ్డు గుంతలతో నిండి ఉంది. అది ఆమెకు చాలా బాధ కలిగించింది. ఆమె నొప్పితో అరుస్తూ ఏడుస్తోంది. వీలైనంత త్వరగా తనను ఆసుపత్రికి తీసుకెళ్లమని వేడుకుంది. కానీ మేము ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాము. జనం తమ వాహనాలను రాంగ్ రూట్ లో నడపడంతో ట్రాఫిక్ జామ్ మరింత తీవ్రమైందని' మృతురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ నియోజకవర్గాన్ని కృష్ణాజిల్లాలోనే కొనసాగించండి
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
For More AndhraPradesh News And Telugu News