Salman Khan-Balochistan: ఎంత మాట అనేశాడు! బలొచిస్థాన్‌పై సల్మాన్ ఖాన్ కామెంట్స్ వైరల్
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:01 PM
బలొచిస్థాన్ ప్రత్యేక దేశమనే అర్థం వచ్చేలా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట ట్రెండవుతున్నాయి. పాక్ అభిమానులకు సల్మాన్ ఖాన్ గట్టి షాకే ఇచ్చాడంటూ జనాలు సెటైర్లు పేలుస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దాయాది దేశం పాకిస్తాన్ ప్రస్తుతం వేర్పాటువాదం, అప్ఘానిస్థాన్‌తో ఘర్షణల వల్ల అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పాక్ అభిమానులకు ఒకింత షాకిచ్చాయి. బలొచిస్థాన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది (Salman Khan Balochistan Remark).
సౌదీ అరేబియాలో ఏర్పాటు చేసిన జాయ్ ఫోరమ్-2025లో ఆమిర్ ఖాన్, షారూఖ్ ఖాన్‌తో పాటు సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ భారతీయ మూవీలకు ఉన్న మార్కెట్ గురించి ప్రస్తావించారు. ‘ సౌదీలో ప్రస్తుతం అనేక దేశాలకు చెందిన వారు ఉంటున్నారు. బలొచిస్థాన్, పాకిస్థాన్, అప్ఘానిస్థాన్‌కు చెందిన వారు ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు ఒక హిందీ మూవీ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తే అది పెద్ద హిట్ అవుతుంది. తమిళం, తెలుగు, మలయాళం మూవీలు కూడా ఇక్కడ కోట్లు రాబట్టుకొంటాయి’ అని ఆయన కామెంట్ చేశారు (Seperatist Movement In Balochistan).
ఈ కామెంట్‌కు సంబంధించిన క్లిప్ వైరల్ కావడంతో జనాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పాక్ భూభాగమైన బలొచిస్థాన్ పేరును ప్రత్యేక దేశమనే అభిప్రాయం కలిగేలా సల్మాన్ పేర్కొనడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. బలొచిస్థాన్ పాక్‌కు చెందినదని సల్మాన్ ఖాన్‌కు తెలియదా? లేక పొరపాటున అలా అన్నారా? అని జనాలు తెగ చర్చించుకుంటున్నారు. పాక్ అభిమానులకు సల్మాన్ గట్టి షాకిచ్చారని కొందరు కామెంట్ చేశారు.
బలొచిస్థాన్ పాక్ ప్రావిన్స్‌ల్లో ఒకటన్న విషయం తెలిసిందే. అయితే, పాక్ ప్రభుత్వం తమ భూభాగంలోని వనరులను కొల్లగొడుతోందని అక్కడ ఎంతోకాలంగా ఉద్యమం సాగుతోంది. ఈ క్రమంలో పురుడు పోసుకున్న వేర్పాటువాద సంస్థ బలోచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ రక్షణ దళాలపై దాడులు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
ఇవి కూడా చదవండి:
వివాహేతర సంబంధం.. భర్త ముందే మహిళను హత్య చేసిన లవర్
ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ.. అత్యంత విలువైన నగలతో దొంగలు పరార్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి