Share News

Louvre Museum Robbery: ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ.. అత్యంత విలువైన నగలతో దొంగలు పరార్

ABN , Publish Date - Oct 19 , 2025 | 05:26 PM

ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో భారీ చోరీ జరిగింది. అపోలో గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచి విలువైన నగలను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Louvre Museum Robbery: ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో చోరీ.. అత్యంత విలువైన నగలతో దొంగలు పరార్
Louvre robbery 2025

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోగల ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో తాజాగా భారీ చోరీ జరిగింది. నేపోలియన్ కాలానికి చెందిన అత్యంత విలువైన నగలను దొంగలు చోరీ చేశారు. మెరుపువేగంతో లోపలికొచ్చి నగలను చోరీ చేశారని అక్కడి మీడియా చెబుతోంది. మ్యూజియంలో భారీ చోరీ జరిగిందని ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు (Louvre Museum robbery).

ఫ్రాన్స్ రాజకుటుంబానికి చెందిన నగలను పెట్టిన అపోలో గ్యాలరీలోని గదిలో ఈ చోరీ జరిగింది. ప్రత్యేక నిచ్చెన సాయంతో పైకెక్కిన దుండగులు కిటీలను ప్రత్యేక కట్టర్‌లతో తొలగించి లోపలికి ప్రవేశించారు. ఏడు నిమిషాల వ్యవధిలో నగలను తీసుకుని బయటపడ్డారు. దొంగల వద్ద మెకానికల్ రంపాలు కూడా ఉన్నట్టు తెలిసింది. చోరీ జరిగిన తీరు చూస్తుంటే దొంగలు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగి ఉంటారని ఫ్రాన్ మంత్రి పేర్కొన్నారు. మొత్తం తొమ్మిది నగలను చోరీ చేశారని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే ప్యారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. ఏ మేరకు నష్టం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చోరీ విషయాన్ని ప్రాన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి నేటి ఉదయం ప్రకటించారు. ప్రస్తుతం తాను అక్కడే సిబ్బందితో పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిపారు (Nepolean-Era jewels Stolen).


ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతమైనదిగా లౌవ్రే మ్యూజియానికి పేరుంది. రోజుకు సుమారు 30 వేల మంది మ్యూజియాన్ని సందర్శిస్తుంటారు. దాదాపు 33 వేల కళాఖండాలు, పురాతన వస్తువులు, పెయింటింగ్స్‌ను ఈ మ్యూజియంలో చూడవచ్చు. ప్రపంచప్రఖ్యాత మోనాలిసా పెయింటింగ్ ఈ మ్యూజియంలోనే ఉంది.

గతంలో కూడా ఈ మ్యూజియంలో జరిగిన చోరీలు సంచలనం కలిగించాయి. రినైసాన్స్ కాలం నాటి కళాఖండాలను కొందరు 1983లో చోరీ చేశారు. వాటిని 2021లో మ్యూజియం అధికారులు చేజిక్కించుకోగలిగారు. ఇక 1911లో మ్యూజియం మాజీ ఉద్యోగి ఒకరు లియోనార్డో డావిన్సీ రూపొందించిన చిత్రాన్ని తన కోట్‌లో దాచుకుని ఎత్తుకెళ్లి పోయాడు. రెండేళ్ల తరువాత అధికారులు ఆ చిత్రం ఆచూకీని కొనుగొని తిరిగి తీసుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

అఫ్ఘానిస్థానీలు మా దేశాన్ని విడిచి వెళ్లాల్సిందే: పాక్ రక్షణ శాఖ మంత్రి

భారతీయులకు ట్రంప్ షాక్..ఆ గ్రీన్‌ కార్డ్‌ లాటరీలో నోఛాన్స్‌

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 19 , 2025 | 06:58 PM