Record Rainfall: 14 ఏళ్ల తర్వాత ఆగస్టులోనే అత్యధిక వర్షపాతం..ఈ ప్రాంతాల్లో భారీగా నమోదు..
ABN , Publish Date - Aug 31 , 2025 | 07:35 PM
ఈసారి మాన్సూన్ వాయవ్య భారతదేశంలో తీవ్రంగా ప్రభావం చూపించింది. భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ ఆగస్టులో 14 ఏళ్లలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది.
మీకు ఇప్పటివరకు దేశంలో కురిసిన భారీ వర్షాల రికార్డ్ గురించి తెలుసా? ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. ముఖ్యంగా వాయవ్య భారతదేశంలో 2001 తర్వాత ఇంత భారీ వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి.
భారత వాతావరణ శాఖ (IMD) చెప్పిన డేటా ప్రకారం, ఈ ఆగస్టులో 265 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 34.5% ఎక్కువ. అంటే, గత 14 ఏళ్లలో ఆగస్టు నెలలో ఇదే అత్యధిక వర్షపాతం (August 2025 heavy rains). 1901 నుంచి ఈ లెక్కలను చూస్తే, ఇది 13వ అత్యధిక వర్షపాతం కావడం విశేషం.
వాయవ్య భారతంలో హవా
ఈ సీజన్‌లో జూన్, జూలై, ఆగస్టు మూడు నెలలూ వాయవ్య భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. జూన్‌లో 111 మి.మీ వర్షం (42% ఎక్కువ), జూలైలో 237.4 మి.మీ (13% ఎక్కువ) నమోదైంది. ఇక ఆగస్టులో 265 మి.మీతో సాధారణం 197.1 మి.మీ కంటే చాలా ఎక్కువ.
మొత్తంగా జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు 614.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం 484.9 మి.మీ కంటే 27% ఎక్కువ. ఈ భారీ వర్షాలకు కారణం? యాక్టివ్ మాన్సూన్ పరిస్థితులు (Western Disturbances) వర్షాలను మరింత పెంచాయని IMD చెబుతోంది.
పంజాబ్‌లో దశాబ్దాల తర్వాత వరదలు
ఈ భారీ వర్షాలు ఓవైపు ప్రకృతి అందాలను తెచ్చినా, మరోవైపు మాత్రం కొన్ని ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. పంజాబ్‌లో దశాబ్దాల తర్వాత ఇంత భారీ వరదలు వచ్చాయి. నదులు ఉప్పొంగి, కాలువలు పొంగిపొర్లడంతో వేల హెక్టార్ల వ్యవసాయ భూములు నీట మునిగాయి. లక్షలాది మంది స్థానికులు నిరాశ్రయులయ్యారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్‌లో కూడా క్లౌడ్‌బర్స్ట్‌లు ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ విపత్తులు ఆ ప్రాంతాల్లో జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.
దక్షిణ భారతంలోనూ
ఇక దక్షిణ భారతదేశం విషయానికొస్తే ఆగస్టులో 250.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 31% ఎక్కువ. 2001 నుంచి ఇది మూడో అత్యధిక వర్షపాతం. 1901 నుంచి ఎనిమిదో అత్యధికం. జూన్ నుంచి ఆగస్టు వరకు మొత్తం 607.7 మి.మీ వర్షం కురిసింది. ఇది సాధారణం 556.2 మి.మీ కంటే 9.3% ఎక్కువ. దక్షిణాదిలో కూడా వర్షాలు బాగానే కురిశాయి. కానీ వాయవ్య భారతదేశంతో పోలిస్తే విపత్తులు తక్కువ.
దేశవ్యాప్తంగా వర్షాల స్థితి
మొత్తం దేశంలో ఆగస్టులో 268.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 5% ఎక్కువ. జూన్ నుంచి ఆగస్టు వరకు 743.1 మి.మీ వర్షం కురిసింది, ఇది సాధారణం కంటే 6% ఎక్కువ. ఈ సంవత్సరం మాన్సూన్ సీజన్ దేశవ్యాప్తంగా చాలా యాక్టివ్‌గా ఉందని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఈ వర్షాలు సంతోషాన్ని తెచ్చినా, మరికొన్ని చోట్ల విధ్వంసాన్ని మిగిల్చాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి