Share News

Viral News: 55 ఏళ్ల వయస్సులో 17వ బిడ్డకు జననం.. డాక్టర్ల షాక్

ABN , Publish Date - Sep 01 , 2025 | 08:00 PM

రాజస్థాన్‌కి చెందిన ఓ చిన్న గ్రామం లిలావాస్. అక్కడ ఓ మహిళ అనేక మందిని షాక్‌కి గురిచేసింది. 55 ఏళ్ల వయస్సులో ఓ పసిబిడ్డకు తల్లిగా మారింది. అది కూడా ఆమె 17వ బిడ్డ కావడం విశేషం. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

Viral News: 55 ఏళ్ల వయస్సులో 17వ బిడ్డకు జననం.. డాక్టర్ల షాక్
Udaipur woman 17th baby

రాజస్థాన్ ఉదయపూర్ జిల్లా (Rajasthan Udaipur)లో ఓ చిన్న గ్రామం లిలావాస్. సాధారణంగా ఉండే ఈ గ్రామం, ఇటీవల ఒక మహిళ విషయంలో చర్చనీయాంశంగా మారింది. ఆమె 55 ఏళ్ల వయస్సులో కూడా మళ్లీ తల్లిగా మారింది. అది కూడా 17వ సారి. ఇంత వయసులో తల్లి తనాన్ని అనుభవించడం వింతగా ఉన్నా, ఆమె దైర్యం, సంకల్పం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Udaipur woman 17th baby


55 ఏళ్లలో 17వ బిడ్డ

ఉదయ్‌పూర్ జిల్లాలోని ఝడోల్ బ్లాక్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రేఖా అనే 55 ఏళ్ల మహిళ తన 17వ బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా ఈ వయసులో మహిళలు మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ ఉంటారు. కానీ రేఖా మాత్రం తన కొత్త బిడ్డను చూసుకుంటూ, అదే సమయంలో తన మనవళ్లను కూడా సంరక్షిస్తోంది. ఆమె భర్త కవరా రామ్ కల్బేలియా ఒక స్క్రాప్ డీలర్.

వీళ్ల కుటుంబంలో మూడు తరాలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. రేఖాకు ప్రస్తుతం 12 మంది పిల్లలు ఉన్నారు. వారిలో ఏడుగురు అబ్బాయిలు, మరో ఐదుగురు అమ్మాయిలు. ఇంకా ఆమె పిల్లలకు పిల్లలు కూడా ఉన్నారు. అంటే రేఖా ఒకేసారి అమ్మగా, అమ్మమ్మగా బాధ్యతలు నిర్వహిస్తోంది.


బంధువులు, పొరుగువాళ్లు..

రేఖా మొత్తం 17 సార్లు గర్భం దాల్చింది. కానీ దురదృష్టవశాత్తూ ఐదుగురు పిల్లలు (నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) జన్మించిన కొద్దిసేపటికే మరణించారు. ఈ కొత్త బిడ్డ జన్మించినప్పుడు, గ్రామస్తులు, బంధువులు, పొరుగువాళ్లు సైతం ఆసుపత్రిలో గుమిగూడారు. ఎందుకంటే ఈ బిడ్డకు సోదరులు, సోదరీమణులు స్వాగతం పలకడం నిజంగా అరుదైన సంఘటన అని చెప్పుకోవచ్చు.


కుటుంబం సవాళ్లు

వారికి ఆనందం ఉన్నప్పటికీ, కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. కవరా రామ్ స్క్రాప్ వ్యాపారం ద్వారా కొద్దిపాటి ఆదాయం సంపాదిస్తాడు. ఆ డబ్బుతో ఇంత పెద్ద కుటుంబాన్ని పోషించడం, పిల్లల పెళ్లిళ్లు చేయడం చాలా కష్టం. ఈ కుటుంబంలో ఎవరూ స్కూలుకు వెళ్లలేదు. విద్య లేకపోవడం వల్ల వాళ్ల జీవనం మరింత కష్టతరంగా మారింది. కానీ వాళ్లు ఒకే చోట స్థిరంగా ఉండరు, ఎప్పటికప్పుడు స్థలం మారుతూ ఉంటారు. ఇలాంటి జీవనశైలి వల్ల వైద్య సదుపాయాలు, ప్రభుత్వ సహాయ పథకాలు వాళ్లకు అందడం కష్టంగా మారింది.


వైద్య సవాళ్లు

రేఖా డెలివరీ చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఆమె మొదట డాక్టర్లకు ఇది తన నాలుగో గర్భం అని చెప్పింది. కానీ తర్వాత 17వ గర్భం అని తేలింది. డాక్టర్ రోషన్ దరంగి, ఈ డెలివరీని నిర్వహించిన గైనకాలజిస్ట్, రేఖాకు స్టెరిలైజేషన్ గురించి కౌన్సెలింగ్ ఇవ్వాలని చెప్పారు. రేఖా ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమెకు సోనోగ్రఫీ, ప్రీ-డెలివరీ టెస్టులు ఏవీ జరగలేదు.

ఇంత ఎక్కువ సార్లు గర్భం దాల్చడం వల్ల గర్భాశయం బలహీనమవుతుంది. రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అదృష్టవశాత్తూ ఈసారి డెలివరీ సజావుగా జరిగింది. ఇలాంటి కేసులు గిరిజన ప్రాంతాల్లో సాధారణమని, అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని పలువురు అంటున్నారు.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 01 , 2025 | 08:09 PM