Rahul Gandhi: పకడ్బందీగా ఓట్ల చోరీ!
ABN , Publish Date - Aug 08 , 2025 | 05:12 AM
ఎన్నికల అవకతవకలపై అణుబాంబు ప్రయోగిస్తానని ఇటీవల ప్రకటించిన రాహుల్ గాంధీ.. దీనికి సంబంధించి గురువారం ఢిల్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్(పీపీటీ) ఇచ్చారు.
ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కై భారీగా అక్రమాలకు పాల్పడ్డాయి
ఐదు రకాల అవకతవకలతో మోసం
ఒక్క సెగ్మెంట్‌ను పరిశీలిస్తేనే.. 1,00,250 తప్పుడు ఓట్లు తేలాయి
ప్రజాస్వామ్యంపై ఇదో అణు బాంబు
డిజిటల్ ఓటర్ల జాబితాలు ఇస్తే.. దేశవ్యాప్త అక్రమాలు బయటికొస్తాయ్
న్యాయవ్యవస్థ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి: రాహుల్ గాంధీ
బెంగళూరులోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ లెక్కలతో పీపీటీ
బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం. అక్కడ గట్టి పట్టున్న కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనా ఉంది. కానీ 32,707 ఓట్ల మెజారిటీతో బీజేపీ గెలిచింది. ఈ లోక్‌సభ స్థానంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఆరింటిలో లీడ్‌లో నిలిచిన కాంగ్రె్‌సకు సుమారు 82 వేల మెజారిటీ వచ్చింది. మిగిలిన మహదేవపుర సెగ్మెంట్‌లో మాత్రం బీజేపీకి ఏకంగా 1,14,046 ఓట్ల మెజారిటీ వచ్చింది.
ఈ సెగ్మెంట్‌లోని ఓ సింగిల్ బెడ్రూమ్ ఇంటి చిరునామాపై 80 మంది, కేవలం ఒకే గది ఉన్న మరో ఇంట్లో 46 మంది ఓటర్లు ఉన్నారు. ఇలాంటి ‘బల్క్ ఓటర్లు’.. 10,452 మంది.
ఇక 0, -, %.. ఇలా గుర్తింపులేని చిరునామాలు ఉన్న ఓట్లు 40,009.. మూడు, నాలుగు ఓట్లున్న ‘డూప్లికేట్’ ఓటర్లు 11,965 మంది.. ఫొటో గుర్తించేలా లేని ఓటర్లు 4,132 మంది.. ఫారం-6ను దుర్వినియోగపర్చి నమోదైన ఓట్లు 33,692..
... దేశంలో ఎన్నికల అక్రమాలకు, ఎన్నికల కమిషన్-బీజేపీ కుమ్మక్కుకు సాక్ష్యమిదిగో అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చెప్పిన లెక్కలివి.
న్యూఢిల్లీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల అవకతవకలపై అణుబాంబు ప్రయోగిస్తానని ఇటీవల ప్రకటించిన రాహుల్ గాంధీ.. దీనికి సంబంధించి గురువారం ఢిల్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్(పీపీటీ) ఇచ్చారు. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ ఒక్కచోట పరిశీలిస్తేనే అనేక అక్రమాలు బయటపడ్డాయని చెప్పారు. దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఇలా ‘ఓట్ల చోరీ’కి పాల్పడి.. లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నారని ఆరోపించారు. ఇవన్నీ బయటపడతాయనే తా ము ఎన్నిసార్లు అడిగినా ఎన్నికల సంఘం డిజిటల్ ఓటర్ల జాబితాలు, సీసీకెమెరా పుటేజీలు ఇవ్వకుండా ఆధారాలను నాశనం చేస్తోందని ఆరోపించారు.
పక్కా అనుకున్న చోట్ల ఓటమితో సందేహం
2024 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో 16 లోక్‌సభ సీట్లు గెలుస్తామని తమ అంతర్గత సర్వేలో తేలిందని, కానీ 9 సీట్లే వచ్చాయని రాహుల్ చెప్పారు. తాము పక్కాగా గెలుస్తామనుకున్న స్థానాల్లో ఓటమితో సందేహం వచ్చి బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానంలో పరిశీలన జరిపామన్నారు. ‘‘బెంగళూరు సెంట్రల్‌లో బీజేపీ 32,707 ఓట్ల ఆధిక్యతతో గెలిచింది. కానీ ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క మహదేవపురలో తప్ప మిగతా ఆరింటిలో కాంగ్రె్‌సకే ఆధిక్యం వచ్చింది. 82వేలకుపైగా మెజారిటీ కాంగ్రె్‌సకే ఉంది. ఒక్క మహదేవపురలో మాత్రం బీజేపీకి ఏకంగా 1,14,046 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. దీనిపై సందేహంతో లోతుగా పరిశీలన జరిపాం. అక్కడి 6.5 లక్షల ఓట్లలో 1,00,250 తప్పుడు ఓట్లు ఉన్నట్టు గుర్తించాం’’ అని రాహుల్ చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసే కుట్ర
దేశంలో ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసే ప్రక్రియలో ఎన్నికల కమిషన్ భాగమైందని రాహుల్ ఆరోపించారు. ఒక్క అసెంబ్లీ స్థానంలోనే ఇన్ని అక్రమాలు జరిగితే.. దేశమంతటా ఎంతగా అవకతవకలు చోటు చేసుకున్నాయో తెలిసిపోతోందని పేర్కొన్నారు. ఈ అక్రమాలకు ఓటర్ల జాబితాలు, సీసీ కెవె ురా ఫుటేజీలే పక్కా సాక్ష్యాలని చెప్పారు. కానీ సీసీ కెమెరా ఫుటేజీలను బయటపెట్టకుండా కావాలనే నిబంధనలను కూడా మార్చారని విమర్శించారు. ‘‘ఎన్నికల సంఘం, కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీ కలసి చేసిన ఈ నేరపూరిత మోసం దేశ ప్రజలకు తెలియాలి. ఇది మన రాజ్యాంగానికి, జాతీయ జెండాకు వ్యతిరేకంగా జరిగిన నేరపూరిత కుట్ర’’ అని రాహుల్ మండిపడ్డారు. ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ కల్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పక్కా ప్రణాళిక ప్రకారం మోసం..
అంతా పక్కాప్రణాళిక ప్రకారం ఓట్ల చోరీ జరుగుతోందని రాహుల్ ఆరోపించారు. ‘‘సాధారణంగా పాలక పక్షాలపై ప్రజా వ్యతిరేకత ఉంటుంది. మీడియాలో అది కనిపిస్తుంది. కానీ బీజేపీ విషయంలో అలా జరగదు. ప్రజావ్యతిరేకతే లేనట్టుగా మెజారిటీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తుంది. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కూడా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఉంటాయి. అందుకు తగినట్టుగానే బీజేపీకి అనూహ్యంగా ఓట్లు వస్తాయి. లాడ్లీ బెహనా, పుల్వామా ఘటన వంటివి చూపి బీజేపీ గెలిచిందంటూ ప్రచారం చేస్తారు. ఎన్నికలు నెలల తరబడి జరుగుతాయి. షెడ్యూల్‌ను ఇష్టారాజ్యంగా నిర్ణయిస్తారు. భారీగా ఓట్ల చోరీ జరుగుతుంది’’ అని ఆరోపించారు. హరియాణా, మహారాష్ట్రలో ఇలాగే ఫలితాలు తారుమారు అయ్యాయన్నారు. మహారాష్ట్రలో ఐదేళ్లలో నమోదైన ఓటర్ల కంటే ఎక్కువగా.. 5 నెలల్లో కోటి మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారని గుర్తు చేశారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా, పార్లమెంట్‌లో ప్రస్తావించినా పట్టించుకునేవారే లేరన్నారు. మహారాష్ట్రలో సాయంత్రం 5.30 తర్వాత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందని ఈసీ చెప్పిందని... కానీ పెద్దగా క్యూలేవీ లేవని తమ కూటమి భాగస్వామ్య పార్టీలన్నింటికీ తెలుసని రాహుల్ స్పష్టం చేశారు. దీనిపై సందేహంతో సీసీ కెమెరా ఫుటేజీలు ఇవ్వాలని అడిగితే.. ధ్వంసం చేశామని ఈసీ చెప్పిందని గుర్తు చేశారు.
సంతకంతో సాక్ష్యాలు ఇవ్వండి: ఈసీ
ఓట్ల చోరీ ఆరోపణలపై సంతకంతో కూడిన డిక్లరేషన్, సాక్ష్యాలను తమకు అందజేయాలని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాహుల్ గాంధీకి లేఖ రాశారు. తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే తాను బహిరంగంగానే వివరాలు వెల్లడించానని, దానిని ప్రమాణం చేసి చెప్పినట్టుగానే తీసుకోవాలని రాహుల్ చెప్పారు. కాగా.. రాహుల్ నివాసంలో గురువారం సాయంత్రం ఇండి కూటమి నేతలతో విందు భేటీ జరిగింది. 25 పార్టీలకు చెందిన 50 మంది నేతలు ఇందులో పాల్గొన్నారు. బిహార్‌లో ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమీక్ష’, ఎన్నికల సంఘంపై ‘ఓట్ల చోరీ’ ప్రజెంటేషన్‌పై చర్చించారు.
రాహుల్‌ది కుటిల మోసం: బీజేపీ
ఎన్నికల కమిషన్‌పై రాహుల్ ఆరోపణ కాంగ్రెస్ కుట్రలో భాగమని బీజేపీ విమర్శించింది. మోదీపై విశ్వాసంతో ప్రజలు ఓట్లు వేస్తున్న విషయాన్ని గౌరవించలేకే ఈ విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. రాహుల్ తీరు రాజ్యాంగాన్ని నాశనం చేసే కుట్ర అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు.
నేడు బెంగళూరులో నిరసన ప్రదర్శన
‘ఓట్ల చోరీ’కి సంబంధించి శుక్రవారం బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఇతర నేతలతో కలసి నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని రాహుల్ తెలిపారు. ‘ఓట్ అధికార్ ర్యాలీ’ పేరిట ఈ సభను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి బెంగళూరులోని ఫ్రీడం పార్కులో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభ ముగిశాక స్థానిక ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి వినతిపత్రాన్ని సమర్పించనున్నారు.
డిజిటల్ జాబితాలు ఎందుకు ఇవ్వట్లేదు?
కంప్యూటర్లలో సులువుగా విశ్లేషించేందుకు వీలుగా డిజిటల్ ఓటర్ల జాబితాలను ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరితే నిరాకరించిందని రాహుల్ తెలిపారు. అందులో మతలబు ఏమిటని నిలదీశారు. వేలకొద్దీ పేజీలతో కూడిన జాబితాలను ఈసీ ఇచ్చిందని.. దీనితో 30, 40 మంది ఆరు నెలల పాటు రాత్రింబవళ్లు కష్టపడి.. ఒక్కో ఓటర్ పేరు, చిరునామా, ఫొటోలను పరిశీలించారని చెప్పారు. భౌతికంగా పరిశీలిస్తేనే ఇన్ని అక్రమాలు బయటపడ్డాయని.. డిజిటల్ జాబితాలిస్తే దేశవ్యాప్తంగా జరిగిన ‘ఓట్ల చోరీ’ అంతా బహిర్గతం అవుతుందని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు
గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
For More National News and Telugu News