Rahul Gandhi: పాకిస్థాన్ కాల్పుల్లో మృతుల కుటుంబాలను పరామర్శించిన రాహుల్ గాంధీ
ABN , Publish Date - May 24 , 2025 | 12:00 PM
ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూకశ్మీర్ పూంచ్‌లో (Rahul Gandhi Poonch Visit) ప్రాణాలు కోల్పోయిన పలువురి కుటుంబాలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పరామర్శించి మానవీయతను చాటుకున్నారు. పాకిస్థాన్ షెల్లింగ్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం జమ్మూ కశ్మీర్ పూంచ్ (Rahul Gandhi Poonch Visit) చేరుకున్నారు. అక్కడ ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ షెల్లింగ్ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలను ఆయన కలిశారు. త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాల్పుల వల్ల ప్రభావితమైన ఆయా వ్యక్తుల బాధలను రాహుల్ గాంధీ విని వారికి ధైర్యం చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత రాహుల్ గాంధీ జమ్మూ కశ్మీర్‌లో పర్యటించడం ఇది రెండోసారి. అంతకుముందు, రాహుల్ ఏప్రిల్ 25న శ్రీనగర్‌కు వెళ్లారు. పాకిస్థాన్ కాల్పుల కారణంగా పూంచ్ జిల్లాలో ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అక్కడ 20 మందికి పైగా మరణించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా LG CMతో కూడా సమావేశం కానున్నారు.
పిల్లలు కష్టపడాలి..
త్వరలోనే అంతా సర్దుకుంటుందని రాహుల్ అన్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే, మీరు కష్టపడి చదవాలని అక్కడి పిల్లలకు రాహుల్ సూచించారు. కష్టపడి ఆడాలని, పాఠశాలలో చాలా మంది స్నేహితులను సంపాదించుకోవాలన్నారు. భారత్ ఆపరేషన్ సిందూర్ దాడి తర్వాత.. పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల వద్ద పెద్ద ఎత్తున షెల్లింగ్, డ్రోన్ దాడులు నిర్వహించింది. ఆ దాడుల్లో 27 మంది మరణించగా, 70 మందికి పైగా గాయపడ్డారు. దీనికి ముందు భారత వైమానిక దళం మే 6-7న రాత్రి ఆపరేషన్ సింధూర్ చర్యను చేపట్టింది. ఇందులో పాకిస్థాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి. ఆ క్రమంలో జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమచారం.
రాహుల్ మూడు ప్రశ్నలు..
ఈ క్రమంలో మే 23న రాహుల్ గాంధీ, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్‌ను ఎక్స్ వేదికపై మూడు ప్రశ్నలు అడిగారు. భారతదేశం ఎందుకు పాకిస్థాన్‌ను మన అంతర్జాతీయ సంబంధాల్లో ప్రాముఖ్యతగా తీసుకుంటోంది?, "పాకిస్థాన్‌పై మనం తీవ్రమైన విమర్శలు చేసినా, ఒక్క దేశం కూడా మనకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడం ఎందుకు?, డొనాల్డ్ ట్రంప్‌ను పాకిస్థాన్ విషయంలో 'మధ్యవర్తిత్వం' చేయమని అభ్యర్థించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు భారతదేశ విదేశాంగ విధానంపై సరికొత్త చర్చకు దారి తీశాయి. అయితే వీటిపై జైశంకర్ స్పందన ఎలా ఉంటుందోనని అనేక మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి:
జూన్ 2025లో బ్యాంకు సెలవులు..ఎప్పుడు, ఎక్కడ బంద్
నేడు 10వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి