Share News

NITI Aayog: నేడు 10వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.. అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం..

ABN , Publish Date - May 24 , 2025 | 08:32 AM

నేడు (మే 24, 2025న) నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం (NITI Aayog 10th Council Meeting) జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఈ సమావేశం రాష్ట్రాలకు తమ అభివృద్ధి లక్ష్యాలను సమీక్షించడానికి, కొత్త వ్యూహాలను రూపొందించడానికి ఒక అవకాశంగా మారనుంది.

NITI Aayog: నేడు 10వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.. అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం..
10th NITI Aayog Governing Council Meeting

నేడు శనివారం (మే 24, 2025న) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (narendra modi) అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం (NITI Aayog 10th Council Meeting) జరగనుంది. ఈ సమావేశం ‘వికసిత రాజ్యం కోసం వికసిత భారత్@2047’ అనే ఇతివృత్తంతో నిర్వహించబడుతుందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత మొదటిసారిగా ఈ భేటీ జరగనుండటం విశేషం. ఇది దేశ అభివృద్ధి లక్ష్యాలకు కొత్త ఊపును ఇవ్వనుంది.


దీర్ఘకాలిక దృష్టి

వికసిత రాజ్యం కోసం వికసిత భారత్ అనే భావన రాష్ట్రాలు జాతీయ ప్రాధాన్యతలు, స్థానిక వాస్తవాలకు అనుగుణంగా దీర్ఘకాలిక, సమగ్రమైన దార్శనిక పత్రాలను రూపొందించాలని పిలుపునిస్తుంది. ఈ దార్శనిక పత్రాలు కాలపరిమిత లక్ష్యాలను కలిగి ఉండాలని, అవి రాష్ట్రాల భౌగోళిక, జనాభా పరమైన ప్రత్యేకతలను సద్వినియోగం చేసుకోవాలని నీతి ఆయోగ్ సూచించింది. మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, సుస్థిరత, సాంకేతికత, పాలన సంస్కరణలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా రాష్ట్రాలు ఈ లక్ష్యాలను సాధించగలవని ప్రకటనలో తెలిపింది.


ఫలిత ఆధారిత మార్పు

ఈ సమావేశంలో డేటా ఆధారిత ప్రక్రియలు, ఫలిత ఆధారిత మార్పును ప్రోత్సహించే చర్చలు జరుగనున్నాయి. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు, సమాచార సాంకేతికత (ఐసీటీ) ఆధారిత మాద్యమాలు, పర్యవేక్షణ, మదింపు విభాగాల ద్వారా జవాబుదారీతనం వంటివి ఈ విధానంలో కీలకమైన అంశాలుగా ఉన్నాయి. ఈ చర్యలు రాష్ట్రాలు తమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి సహాయపడతాయని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. ఈ సమావేశంలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్య అభివృద్ధిని మెరుగుపరచడం, స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు.


కేంద్ర-రాష్ట్ర సమన్వయం

దేశవ్యాప్తంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించడం, వ్యాపారవేత్తలకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, ఉద్యోగ అవకాశాలను పెంచడం వంటి వ్యూహాలు ఈ సమావేశంలో ప్రధాన చర్చా అంశాలుగా ఉంటాయి. రాష్ట్రాలు తమ ప్రత్యేక బలాలను ఉపయోగించుకుని, ఈ లక్ష్యాలను సాధించేందుకు సమర్థవంతమైన విధానాలను రూపొందించాలని నీతి ఆయోగ్ సూచించింది.

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం, కేంద్రం, రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సమన్వయాన్ని పెంచే ఒక వేదికగా పనిచేస్తుంది. దేశం ఎదుర్కొంటున్న అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి, భారతదేశాన్ని వికసిత దేశంగా మార్చడానికి రాష్ట్రాలు ప్రధాన భాగస్వాములుగా ఉండాలని ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది. సమగ్రమైన, సుస్థిరమైన అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర సహకారం అత్యంత కీలకమని నీతి ఆయోగ్ ప్రకటనలో వెల్లడించింది.


ఇవీ చదవండి:

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..


పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రను భగ్నం చేసిన భారత్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 24 , 2025 | 09:45 AM