Rahul Gandhi Colombia: కొలంబియాలో భారత కంపెనీలపై రాహుల్ గాంధీ ప్రశంస
ABN , Publish Date - Oct 03 , 2025 | 03:00 PM
దక్షిణ అమెరికా కొలంబియా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కీలక ట్వీట్ చేశారు. భారతీయ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణల ద్వారా మంచి పేరు సంపాదిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. దీనికి ముందు EIA విశ్వవిద్యాలయంలో ప్రసంగించిన రాహుల్.. పలువురు పారిశ్రామికవేత్తల ఆధిపత్యం భారతదేశానికి ముప్పుగా అభివర్ణించారు.
కొలంబియా: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తుతం దక్షిణ అమెరికాలోని నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొలంబియా (Colombia)లో పర్యటించిన సందర్భంగా ఆయన భారత ద్విచక్రవాహన కంపెనీలైన బజాజ్, హీరో, టీవీఎస్‌లను ప్రశంసించారు. ఈ కంపెనీల విజయం భారతీయ కంపెనీలు బంధుప్రీతి ద్వారా కాదు, ఆవిష్కరణల ద్వారా విజయం సాధిస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ కొలంబియా వీధుల్లో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్ ముందు నిలబడి ఉన్న ఫొటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో షేర్ చేశారు. కొలంబియాలో భారత్ కంపెనీలు బాగా పనిచేస్తున్నట్లు చూసి తాను గర్వపడుతున్నానని రాహుల్ గాంధీ అన్నారు. భారతీయ కంపెనీలు పెట్టుబడిదారీ విధానం ద్వారా కాదు.. ఆవిష్కరణ ద్వారా విజయం సాధించగలవని నిరూపిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ ఈఐఏ (EIA) విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ది ఫ్యూచర్ ఈజ్ టుడే (The Future is Today) అనే సెమినార్‌లో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రజాస్వామ్యం, పరిశ్రమల గురించి విస్తృతంగా చర్చించారు. భారతదేశం ప్రస్తుతం తన ప్రజాస్వామ్య వ్యవస్థపై అంతులేని దాడులను ఎదుర్కొంటోందని, ఇది దేశానికి ముందున్న అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటని వ్యాఖ్యానించారు.
ఈ సవాళ్లను అధిగమించాలంటే, ప్రతి వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాహుల్ పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొంతమంది పెద్ద పారిశ్రామికవేత్తలు అధికంగా స్వాధీనం చేసుకుంటున్నారని, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని హెచ్చరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చిన్న, మధ్యస్థ పరిశ్రమలకు, సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం సంభవిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే, ఆర్థిక వ్యవస్థలో సమానత్వం, న్యాయం పాటించాలని రాహుల్ సూచించారు.
అంతేకాదు భారతదేశం వైవిధ్యభరితమైన దేశమని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఇక్కడ విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. ఈ వైవిధ్యాన్ని గౌరవించడం, దానిని బలోపేతం చేయడం ద్వారా దేశం ఐక్యంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ వైవిధ్యం భారతదేశ అసలైన బలం, భవిష్యత్తు సంపదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
చైనా లాగా భారతదేశం నియంతృత్వ పాలనను అంగీకరించదని, ప్రజలను అణచివేయదని ఆయన తెలిపారు. భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాలు, ఆలోచనలు నేటికీ విలువైనవని, ప్రపంచానికి అందించడానికి ఇంకా చాలా ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి