Rahul Priyanka Gandhi Detained: ఓట్ల వివాదం.. పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక సహా పలువురు నేతలు
ABN , Publish Date - Aug 11 , 2025 | 01:02 PM
ఢిల్లీ పార్లమెంట్ నుంచి ఎన్నికల కమిషన్ ఆఫీస్ వరకు నిరసనగా వెళ్తున్న ఇండియా కూటమి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సంజయ్ రౌత్, సాగరికా ఘోష్ సహా పలువురు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలు మరోసారి ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాట బాటపట్టారు. బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ(Special Intensive Revision – SIR) ప్రక్రియ, 2024 ఎన్నికల్లో ఓట్ల మోసాలకు పాల్పడ్డారంటూ వీరంతా పార్లమెంట్ నుంచి భారత ఎన్నికల సంఘం కార్యాలయం వరకు నిరసన చేపట్టారు.
ఈ ఆందోళనలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, శివసేన నాయకుడు సంజయ్ రౌత్, అఖిలేష్ యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ సాగరికా ఘోష్‌తోపాటు పలువురు ఇండియా కూటమి ఎంపీలు, నేతలు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణలు, ఓట్ల చోరీ అంశాలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వీరంతా ఆందోళనకు దిగారు.
అసలైన ఓటర్లు కూడా..
అయితే ఈ నిరసన మధ్యలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళన సాగుతున్నప్పటికీ, పోలీసు బలగాలు ముందు జాగ్రత్తగా పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని బస్సులోకి ఎక్కించారు. ఇందులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సంజయ్ రౌత్, సాగరికా ఘోష్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఇండియా కూటమి వాదన ప్రకారం, బిహార్‌లో ఓటర్ల జాబితాల సవరణ పేరుతో లక్షలాది అసలైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని, ఈ ఓట్ల మోసం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని హెచ్చరిస్తున్నారు.
అదుపులోకి తీసుకోవడాన్ని
ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండియా కూటమి నేతలను అదుపులోకి తీసుకోవడాన్ని పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని, ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత లేదని వారు విమర్శించారు. ఈ నిరసన ద్వారా ఎన్నికల సంస్కరణలపై దృష్టి సారించాలని, ఓటర్ల హక్కులను కాపాడాలని ఇండియా కూటమి నేతలు పిలుపునిచ్చారు.
పోలీసులు వారిని ఎందుకు ఆపారు?
ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్‌కు ఒక లేఖ రాసి మధ్యాహ్నం 12.30 గంటలకు కలవాలని పిలుపునిచ్చింది. ఎన్నికల కమిషన్ ఆయన్ను 30మంది ఎంపీలతో రావాలని, సమావేశానికి ముందు ఆ ఎంపీల గురించి తెలియజేయాలని కోరింది. దీనిని దృష్టిలో ఉంచుకుని, 30 మంది ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లవచ్చని పోలీసులు నిరసన తెలుపుతున్న ఎంపీలకు తెలిపారు. కానీ ప్రతిపక్షం దీనికి అంగీకరించలేదు.
మరోవైపు మార్చ్ కు ఎటువంటి అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ హౌస్ కు కొద్ది దూరంలో ఉన్న ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం వైపు వారిని కదలకుండా ఆపివేశారు. అదుపులోకి తీసుకున్న ఇండియా కూటమి నేతలను సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల కమిషన్ నుంచి 30 మంది ఎంపీలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ఆ క్రమంలో ఎంపీలు పెద్ద సంఖ్యలో ఉన్నందున, తాము వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మల్లికార్జున ఖర్గే
దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళితే, ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. వాళ్లు దేనికో భయపడుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ఇది శాంతియుతంగా జరిగిన ఆందోళన మాత్రమేనని, ఎన్నికల కమిషన్ దీన్ని మరింత సున్నితంగా నిర్వహించాలన్నారు. కూటమి పార్టీల నుంచి 30మంది ఎంపీలను మాత్రమే ఎంచుకోవడం సాధ్యం కాదన్నారు.
ఇవి కూడా చదవండి
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి