Prashant Kishor: ఇంత త్వరగా పాకిస్థాన్‌తో ఎందుకు ఒప్పందం చేసుకున్నట్లు..
ABN , Publish Date - Jun 01 , 2025 | 08:14 AM
భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధం తన వల్లే ఆగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం పట్ల ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ట్రంప్ మాటలు నమ్మదగినవి కావన్నారు. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఉండ వచ్చని ఆయన పేర్కొన్నారు.
పాట్నా, జూన్ 01: పాకిస్థాన్‌తో భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇంత త్వరగా ఎందుకు చేసుకుందని ఎన్నికల వ్యూహకర్త, జాన్ సురజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సందేహం వ్యక్తం చేశారు. మరికొన్ని రోజుల పాటు పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా చేసి ఉంటే.. పాకిస్థాన్ ఇంకా త్వరగా దిగి వచ్చేదన్నారు. అయితే భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధం తన వల్లే ఆగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం పట్ల ఆయన స్పందించారు. ట్రంప్ మాటలు నమ్మదగినవి కావన్నారు. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
పాకిస్థాన్ కోరడం వల్ల భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించిందని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ వ్యాఖ్యలు నమ్మాల్సి ఉందని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని పాకిస్థాన్ కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి జై శంకర్ చేసిన ప్రకటన విశ్వసించదగిన విధంగా ఉందన్నారు. అంతేకాదు.. జై శంకర్ బాగా పుస్తకాలు చదవిన వ్యక్తి అని గుర్తు చేశారు. అలాగే ఆయన వివేకవంతుడు కూడా అని అభివర్ణించారు.
తూర్పు చంపారన్‌లో శనివారం ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై భారత్ దాడుల అంశాన్ని ప్రస్తావించారు. భారత్ బలంగా ఉండటంలో.. పాకిస్థాన్ దిగి వచ్చిందన్నారు. మరో రెండు రోజులు దాడులు చేసి ఉంటే.. పాకిస్థాన్ ఇంకాస్త తొందరగా దిగి వచ్చేదన్నారు. ఈ దాడుల ద్వారా పాకిస్థాన్ పాఠం నేర్చుకుందని ఆయన తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న తర్వాత.. ప్రజలకు అవాస్తవాలు ఎందుకు చెబుతున్నారంటూ కేంద్రాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ దాడులకు సంబంధించి.. మీరు చేస్తున్న వ్యాఖ్యలకు.. ఉగ్రవాదుల కాల్పులకు ఏ మాత్రం తేడా లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
మరోవైపు ప్రధాని మోదీ ఇటీవల రెండు రోజుల పాటు బిహార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను ఆయన ఈ బహిరంగ సభల ద్వారా వివరించారు. ఇంకోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాన్ సురజ్ పార్టీ తరఫున ఆయన బరిలో దిగుతున్నారు. గతంలో రాజకీయ పార్టీల నేతలను ఎన్నికల్లో గెలిపించే బాధ్యతలు ఆయన చేపట్టిన సంగతి తెలిసిందే. మరి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తారా? అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందేననే చర్చ అయితే సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
నిత్యవసర వస్తువుల పంపిణీ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదనీరు
For National News And Telugu News