Nadendla Manohar: నిత్యవసర వస్తువుల పంపిణీ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల
ABN , Publish Date - Jun 01 , 2025 | 08:48 AM
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నిత్యవసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ క్రమంలో పిఠాపురంలో రేషన్ ద్వారా నిత్యవసర వస్తువులను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.
అమరావతి, జూన్ 01: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో రేషన్ పంపిణీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామన్నారు.
ఉదయం 8-12, సాయంత్రం 4-8 గంటల వరకు రేషన్ షాపులు పని చేస్తాయని చెప్పారు. ఈ 15 రోజుల్లో అవకాశం ఉన్న సమయాల్లో రేషన్ తీసుకునే వెసులుబాటును ప్రజలకు కల్పించామని తెలిపారు. అలాగే 65 యేళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు వారి వారి ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. అర్హులైన వారికి ప్రభుత్వం బియ్యాన్ని పూర్తిగా ఉచితంగా అందజేయనుంది.
ఈ నెలలోని తొలి 15 రోజుల్లో శెలవు దినాల్లో సైతం అంటే.. ఆదివారం కూడా రేషన్ షాపుల్లో నిత్యవసర వస్తువులను పంపిణీ చేయనున్నారు. అలాగే లబ్దిదారులు.. ఎక్కడ రేషన్ కార్డు ఉంటే అక్కడికే వెళ్లి నిత్యవసర వస్తువులను తీసుకోనవసరం లేదు. సమీపంలోని రేషన్ షాపుల్లో సైతం వాటిని తీసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇక గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పేరుతో కోట్ల రూపాయిల అవినీతి జరిగిందని ప్రభుత్వం గుర్తించింది.
ఈ నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారానే నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. అంతేకాకుండా.. ప్రజలు సైతం ఇదే విధానాన్ని అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం ఈ విధానం వైపు మొగ్గు చూపింది. ఈ విధానాన్ని జూన్ 1వ తేదీ నుంచి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఈ రేషన్ వద్దనుకునే లబ్ధిదారులకు నగదు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా 29,760 రేషన్ డిపోల ద్వారా ఈ పంపిణీ జరిగేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంత త్వరగా పాకిస్థాన్‌తో ఎందుకు ఒప్పందం చేసుకున్నట్లు..
శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదనీరు
For Andhrapradesh News And Telugu News