Bihar Elections: బిహార్ ఎన్నికల్లో కొత్తగా 17 సంస్కరణలు.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు
ABN , Publish Date - Oct 05 , 2025 | 08:56 PM
ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా గతంలో 1500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఉండగా, ఇప్పుడు దానిని 1,200 ఓటర్లకు ఒక బూత్‌గా నిర్ణయించామని సీఈసీ చెప్పారు. దీంతో అదనంగా 12,817 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) కొత్తగా 17 సంస్కరణలు తీసుకు వస్తున్నట్టు ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రెండ్రోజుల పాటు బీహార్‌లో పర్యటించిన ఈసీ.. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, చీఫ్ ఎలక్టోరల్ అధికారులు, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రతినిధులతో వరుస సమావేశాలు జరిపింది. చీఫ్ సెక్రటరీ, డెరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇతర బ్యూరోక్రాట్లతో రాష్ట్రస్థాయిలో సమన్వయంపై సమీక్ష జరిపింది. అనంతరం మీడియా సమావేశంలో ఆ వివరాలను వెల్లడించింది.
'ఈ ఎన్నికల్లో కొత్తగా 17 సంస్కరణలు తీసుకువస్తున్నాం. వీటిలో కొన్ని ఎన్నికల నిర్వహణకు సంబంధించినవి, కొన్ని కౌంటింగ్‌కు సంబంధించినవి' అని సీఈసీ కుమార్ తెలిపారు. ఓటర్ రిజిస్ట్రేషన్ జరిగిన 15 రోజుల్లో 'ఎపిక్' (ఎలక్ట్రో ఫోటో ఐడెంటిటీ కార్డులు) డెలివరీ చేయాలనే కొత్త ఎస్ఓపీ తీసుకువచ్చామని, గరిష్టంగా 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండనుందని, అలాగే ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫోటోలను ఉంచుతామని, సీరియల్ నెంబర్ కూడా పెద్దగా కనిపించేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా గతంలో 1500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఉండగా, ఇప్పుడు దానిని 1,200 ఓటర్లకు ఒక బూత్‌గా నిర్ణయించామని చెప్పారు. దీంతో అదనంగా 12,817 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తంగా 90,712 బూత్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈసారి బూత్ స్థాయి అధికారులకు అధికారిక ఐడీ కార్డులు ఇస్తామని, ఇందువల్ల వారిని గుర్తించడం తేలికవుతుందని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్ వద్ద మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసే సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియకు మరింత పారదర్శకత కల్పిస్తూ అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ వెబ్‌కాస్టింగ్ కవరేజ్ ఉంటుందని చెప్పారు. ఫారం 17C, ఈవీఎం కౌంటింగ్ యూనిట్ మధ్య ఎలాంటి తేడా గుర్తించినా వివీపాట్‌ల రీకౌంటింగ్ జరుపుతామన్నారు. ఈవీఎం కౌంటింగ్ చివరి రెండు రౌండ్లకు ముందే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తప్పనిసరి చేస్తున్నట్టు చెప్పారు. నవంబర్ 22వ తేదీలోగా ఎన్నికలు పూర్తిచేస్తామని, ఒకటి లేదా రెండు దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలని వచ్చిన అభ్యర్థనలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఈసీ కుమార్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
ఆక్రమించింది వెనక్కి తీసుకోవాలి... మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
లెహ్ నిరసనకారుల మృతిపై న్యాయవిచారణకు వాంగ్‌చుక్ డిమాండ్
Read Latest Telangana News and National News