Share News

Sonam Wangchuk: లెహ్ నిరసనకారుల మృతిపై న్యాయవిచారణకు వాంగ్‌చుక్ డిమాండ్

ABN , Publish Date - Oct 05 , 2025 | 03:49 PM

లద్దాఖ్‌లో హింసాత్మక ఘటనల అనంతరం జాతీయ భద్రతా చట్టం(NSA) కింద అరెస్టయిన వాంగ్‌చుక్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జోథ్‌పూర్ జైలులో ఉన్నారు. వాంగ్‌చుక్‌ను ఆయన అన్నయ్య డోర్జీ లే, న్యాయవాది ముస్తఫా హజి కలుసుకున్నారు.

Sonam Wangchuk: లెహ్ నిరసనకారుల మృతిపై న్యాయవిచారణకు వాంగ్‌చుక్ డిమాండ్
Sonam Wangchuk

జోథ్‌పూర్: లద్దాఖ్ ప్రజలు రాష్ట్ర హోదా కోసం చేపట్టిన పోరాటాన్ని గాంధేయవాద పద్ధతిలో అహింసా మార్గంలో కొనసాగించాలని పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) కోరారు. లెహ్ నిరసనల్లో నలుగురు మృతిచెందడంపై ఆయన స్వతంత్ర న్యాయ విచారణకు (independent judicial inquiry) డిమాండ్ చేశారు. లద్దాఖ్‌లో హింసాత్మక ఘటనల అనంతరం జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అరెస్టయిన వాంగ్‌చుక్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ జైలులో ఉన్నారు. వాంగ్‌చుక్‌ను ఆయన అన్నయ్య డోర్జీ లే, న్యాయవాది ముస్తఫా హజి జైలులోనే కలుసుకున్నారు. తన లాయర్ ద్వారా వాంగ్‌చుక్ లద్దాఖ్ వాసులను ఉద్దేశించి తాజా ప్రకటన చేశారు.


'నేను శారీరకంగా, మానసికంగా బాగున్నా. నా కోసం ఆందోళన చెందుతున్న వారందరికీ కృతజ్ఞతలు. లెహ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు లద్దాఖ్ వాసుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. వారి మృతిపై స్వతంత్ర న్యాయ విచారణ జరగాలి. ఇది జరగనంత వరకూ నేను జైలులోనే ఉండేందుకు సిద్ధంగా ఉన్నా' అని వాంగ్‌చుక్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


రాష్ట్ర హోదా డిమాండ్‌కు తాను బలంగా కట్టుబడి ఉన్నట్టు వాంగ్‌చుక్ తెలిపారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడం, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో దానిని చేర్చడం అనే న్యాయబద్ధమైన డిమాండ్లకు సంబంధించి అపెక్స్ బాడీ, కేడీఏకు బాసటగా నిలుస్తానని, లద్దాఖ్ ప్రజల ప్రయోజనాల కోసం అపెక్స్ బాడీ ఏ నిర్ణయం తీసుకున్నా తాను వెన్నంటి ఉంటానని చెప్పారు. ప్రజలు గాంధేయవాద పద్ధతిలో శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.


లెహ్‌లో శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఒక జవానుతో సహా నలుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఘటన జరిగిన రెండ్రోజుల తర్వాత వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. లద్దాఖ్ గతంలో జమ్మూకశ్మీర్‌లో భాగంగా ఉండగా, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగిస్తూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించడంతో 2019లో లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతమైంది. కాగా, వాంగ్‌చుక్‌ను ఎన్ఎస్ఏ కింద అరెస్టు చేయడం అన్యాయమంటూ ఆయన భార్య గీతాంజలి జే అంగ్మో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సోమవారం నాడు విచారణకు రానుంది.


ఇవి కూడా చదవండి..

డార్జిలింగ్‌లో కొండచరియల బీభత్సం.. 17 మందికి చేరిన మృతులు

కరూర్ తొక్కిసలాట ఒక కుట్ర: ఖుష్బూ

Read Latest Telangana News and National News

Updated Date - Oct 05 , 2025 | 04:02 PM