PM Modi Vande Mataram Debate: లోక్‌సభలో వందేమాతరం చర్చను ప్రారంభించనున్న మోదీ
ABN , Publish Date - Dec 07 , 2025 | 09:31 PM
స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన బంకించంద్ర ఛటర్జీ 'వందేమాతర గీతం' చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై లోక్‌సభలో చర్చ ఉంటుంది.
న్యూఢిల్లీ: జాతీయ గీతం వందేమాతరం (Vande Mataram) 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లోక్‌సభలో సోమవారంనాడు ప్రత్యేక చర్చ జరుగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ చర్చను ప్రారంభిస్తారు. స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన బంకించంద్ర ఛటర్జీ 'వందేమాతర గీతం' చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై చర్చ ఉంటుంది. ఈ ప్రత్యేక చర్చకు 10 గంటల పాటు సమయం కేటాయించారు.
రాజ్యసభలో అమిత్‌షా
కాగా, వందేమాతరంపై ఈనెల 9న రాజ్యసభలో జరుగునున్న ప్రత్యేక చర్చను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ప్రారంభిస్తారని తెలుస్తోంది. రాజ్యసభలో పార్టీ నేత జేపీ నడ్డా సైతం ఈ చర్చలో పాల్గొంటారు. డిసెంబర్ 1న ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19 వరకూ జరుగనున్నారు. ఎస్ఐఆర్‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో తొలి రెండ్రోజుల సమావేశాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎస్ఐఆర్‌పై చర్చ వెంటనే ప్రారంభించాలని విపక్షాలు పట్టుబట్టగా, బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుగా వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరుపుతామని అధికార పక్షం తెగేసి చెప్పింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదర్చడంతో తొలుత 8వ తేదీన వందేమాతరంపై ఉభయసభల్లో చర్చ జరిపేందుకు అంగీకారం కుదిరింది. అనంతరం ఎన్నికల సంస్కరణల పేరుతో ఉభయసభల్లోనూ చర్చ మొదలవుతుంది.
ఇవి కూడా చదవండి..
ట్రావెల్ కష్టాలకు ప్రత్యామ్నాయంగా సోమవారం ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు ఇండిగో రూ.610 కోట్లు రీఫండ్.. పౌర విమానయాన శాఖ వెల్లడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి