Prime Minister Modi: వంద జిల్లాల్లో స్వేచ్ఛావాయువులు
ABN , Publish Date - Oct 22 , 2025 | 03:56 AM
దేశంలో నక్సల్-మావోయిస్టు ఉగ్రవాదం నిర్మూలనలో తుది అంకంలో ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు.
మావోయిస్టు ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తున్నాం..పదేళ్ల కిందట 125 జిల్లాల్లో .. ప్రస్తుతం
11 జిల్లాలకే పరిమితం: ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్‌తో పాటు ఇదీ గొప్ప విజయమే
మన భద్రతా బలగాలకు సెల్యూట్
ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు
పణజీ, అక్టోబరు 21: దేశంలో నక్సల్-మావోయిస్టు ఉగ్రవాదం నిర్మూలనలో తుది అంకంలో ఉన్నామని ప్రధాని మోదీ అన్నారు. భద్రతాదళాలు 90 శాతం వరకు విజయం సాధించాయని.. వందకుపైగా జిల్లాలకు దీని నుంచి విముక్తి కల్పించాయని చెప్పారు. ఆయా జిల్లాల ప్రజలు స్వేచ్ఛావాయువులు పీలుస్తూ దీపావళి జరుపుకొంటున్నారని అన్నారు. సదరు ఉగ్రవాదం ప్రస్తుతం 11 జిల్లాలకే పరిమితమైందని తెలిపారు. దీపావళిని పురస్కరించుకుని ఆయన గోవా తీరంలో విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై జవాన్లతో కలిసి పండుగ జరుపుకొన్నారు. భద్రతాదళాల ధైర్యసాహసాలను కొనియాడారు. మావోయిస్టుల ఉగ్రవాదంపై కీలక విజయాలు సాధించాయన్నారు. ‘2014కి ముందు దాదాపు 125 జిల్లాలు మావోయిస్టుల గుప్పిట్లో ఉండేవి. గత దశాబ్ద కాలంగా కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో 11 జిల్లాలకు తగ్గిపోయింది. వీటిలో కూడా మూడు జిల్లాల్లోనే మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. వారి నుంచి విముక్తి పొందిన వందకుపైగా జిల్లాలు తొలిసారి స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాయి. ‘జీఎ్‌సటీ బచత్ ఉత్సవ్’ కారణంగా ఈ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ జిల్లాల్లో భారత రాజ్యాంగం పేరెత్తితేనే అణచివేసేవారు. ఇప్పుడక్కడ స్వదేశీ మంత్రం ప్రతిధ్వనిస్తోంది’ అని చెప్పారు. దేశంలో అంతర్గతంగా యుద్ధం చేయాలంటే ఎంతో సహనం అవసరమని, అమాయకులెవరూ చనిపోకుండా చూసుకోవలసి ఉంటుందని గుర్తుచేశారు. తమ ప్రాబల్య ప్రాంతాల్లో స్కూళ్లు, రోడ్లు, ఆస్పత్రులను నిర్మించడానికి నక్సల్స్ అనుమతించలేదని.. వాటిని పేల్చేసి డాక్టర్లను కాల్చిచంపారని తెలిపారు. ఇప్పుడవే ప్రాంతాల్లో హైవేలు నిర్మిస్తున్నామని.. స్కూళ్లు, ఆస్పత్రులు పిల్లలకు నూతన భవిష్యత్‌ను ఇస్తున్నాయని చెప్పారు. భద్రతాదళాల త్యాగాలు, ధైర్యసాహసాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ పోరులో అవయవాలు కోల్పోయి వీల్‌చైర్లకే పరిమితమైనా పోలీసు జవాన్లు పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. మంగళవారం పోలీసు అమరవీరుల దినం సందర్భంగానూ.. ప్రాణత్యాగాలు చేసిన పోలీసులకు మోదీ నివాళులు అర్పించారు.
‘ఆత్మనిర్భర భారత్’కు
విక్రాంత్ నిదర్శనం
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్.. ‘ఆత్మనిర్భర భారత్’కు తిరుగులేని నిదర్శనమని ప్రధాని తెలిపారు. దీనిని కదులుతున్న నగరంగా అభివర్ణించారు. ‘త్రివిధ దళాల మధ్య అద్భుత సమన్వయం.. మన నౌకాదళం చొప్పించిన భయం.. వైమానిక దళ అసాధారణ నైపుణ్యం, సైన్యం సాహసం.. కలగలిపి ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్‌ను కాళ్లబేరానికి తీసుకొచ్చాయన్నారు. ‘కొన్నేళ్లుగా భారత దళాలు స్వావలంబనతో అత్యాధునికత సంతరించుకున్నాయి. బ్రహ్మోస్, ఆకాశ్ వంటి క్షిపణులు తమ సామర్థ్యాలను ఆపరేషన్ సిందూర్‌లో నిరూపించుకున్నాయి. పలు దేశాలు ఇప్పుడీ క్షిపణుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. గత 11 ఏళ్లలో మన రక్షణ ఉత్పత్తులు మూడు రెట్లు పెరిగాయి. గత ఏడాది ఈ ఉత్పత్తులపై వ్యయం రూ.లక్షన్నర కోట్లకు చేరుకుంది. 2014 నుంచి వివిధ భారత షిప్‌యార్డులు నౌకాదళానికి 40 స్వదేశీ యుద్ధనౌకలు, జలాంతర్గాములను నిర్మించి ఇచ్చాయి. అంటే సగటున ప్రతి 40 రోజులకు ఓ యుద్ధనౌక, జలాంతర్గామి నిర్మించాయన్న మాట. ప్రపంచ అగ్ర రక్షణ ఉత్పత్తిదారుల్లో ఒకరిగా నిలవాలన్నది భారత లక్ష్యం’ అని స్పష్టంచేశారు. ప్రధాని ఆదివారం సాయంత్రం ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పైకి వచ్చారు. సోమవారమంతా అక్కడే ఉన్నారు. ఉదయం యోగా సెషన్‌లో పాల్గొన్నారు. యుద్ధనౌకలు, యుద్ధవిమానాల విన్యాసాలను పరిశీలించారు.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి