PM Modi: కర్తవ్య భవన్‌ను ప్రారంభించిన మోదీ.. కీలక మంత్రిత్వ శాఖల కార్యాలయాలన్నీ ఒకేచోట
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:57 PM
ఢిల్లీలో వేర్వేరు చోట్ల ఉన్న కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పనిసామర్థ్యం, సమన్వయం పెరుగుతుందని కేంద్రం ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగా మొదటి కర్తవ్య భవన్-3ని ప్రధాని ప్రారంభించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ కీలక మంత్రిత్వ శాఖల కార్యాలయాలన్నింటినీ ఒక చోట చేర్చే 'కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్స్'లో మొదటిదైన 'కర్తవ్య భవన్ 3' (Kartavya Bhavan 3)ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారంనాడిక్కడ ప్రారంభించారు. ఢిల్లీలోని అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఇక నుంచి ఇక్కడ నుంచే పనిచేయనున్నారు. ఈ తరహాలో 10 కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్‌లు నిర్మించేందుకు కేంద్రం సంకల్పించింది.
ఢిల్లీలో వేర్వేరు చోట్ల ఉన్న ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కార్యాలయాలను ఒకే చోటకు తీసుకురావడం ద్వారా పనిసామర్థ్యం, సమన్వయం పెరుగుతుందని కేంద్రం ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగా మొదటి కర్తవ్య భవన్-3ని ప్రధాని ప్రారంభించారు. హోం శాఖ, విదేశాంగ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, ఎంఎస్ఎంఈ, డీఓపీటీ, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ కార్యాలయాలు ఇక్కడి నుంచి పనిచేయనున్నాయి. నార్త్, సౌత్ బ్లాక్‌లలో ఉన్న ఈ కార్యాలయాలు కర్యవ్య భవన్‌కు తరలి రానున్నాయి. రైసిన్ హిల్‌లో రెండు బ్లాక్‌లను భారతదేశ ఇతిహాస, ఆధునిక చరిత్రను ప్రతిబింబించే మ్యూజియంగా మార్చనున్నారు.
ప్రస్తుతం పలు కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యాలయాలు పాతపడిన శాస్త్రి భవన్, క్రిషి భవన్, ఉద్యోగ్ భవన్, నిర్మాణ్ భవన్‌లలో నడుస్తున్నాయి. ఇవన్నీ 1950-1970 మధ్య నిర్మితమయ్యాయి. ఇవన్నీ నిర్మాణపరంగా కాలం చెల్లినవిగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యామ్నాయంగా సెంట్రల్ విస్టా రీడవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ (సీసీఎస్) కింద పది భవంతులు నిర్మించాలని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిలో 2-3 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అవి వచ్చే నెలలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 10 సీసీఎస్ భవనాల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్
విమానాశ్రయాలకు ఉగ్రముప్పు.. హై అలర్ట్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి