PM Modi Gifts Bhagavad Gita To Putin: పుతిన్‌కు భగవద్గీత బహూకరించిన ప్రధాని మోదీ
ABN , Publish Date - Dec 05 , 2025 | 07:30 AM
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు భారత ప్రధాని మోదీ భగవద్గీతను కానుకగా ఇచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికిన అనంతరం.. విందు సందర్భంగా ఈ పవిత్ర గ్రంథాన్ని అందజేసినట్టు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ భగవద్గీతను బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు మోదీ. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి గీత ఒక ప్రేరణాత్మక గ్రంథమని ప్రధాని అభివర్ణించారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో రష్యా అధ్యక్షుడికి స్వాగతం పలికిన అనంతరం.. లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో రాత్రి విందు ఇచ్చారు మోదీ. ఈ సందర్భంగా గీతను బహూకరించినట్టు తెలిపారు.
'పుతిన్‌కు రష్యన్ భాషలో ఉండే భగవద్గీత ప్రతిని అందజేశాను. గీత బోధనలు ప్రపంచంలో లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయి. నా స్నేహితుడు పుతిన్‌ను భారత్‌కు స్వాగతించడం ఆనందంగా ఉంది. నేడు, రేపు మా మధ్య జరగబోయే చర్చల కోసం ఎదురుచూస్తున్నా. భారత్-రష్యాల మైత్రి ఎన్నో కాల పరీక్షలను ఎదుర్కొని దేశ ప్రజలకు గొప్ప ప్రయోజనం చేకూర్చింది' అని మోదీ చెప్పారు.
అంతకముందు.. రెండు రోజుల పర్యటన నిమిత్తం పుతిన్ గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఇరు దేశాల మధ్య జరిగే 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో.. వాణిజ్యం, రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగం వంటి పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి.
ఇవీ చదవండి: