IndiGo Crisis: ఆకాశాన్నంటిన విమాన టికెట్ ధరలు!
ABN , Publish Date - Dec 05 , 2025 | 03:00 AM
దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కొనసాగుతోంది. గురువారం ఏకంగా 550కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. రోజూ దాదాపు నాలుగు లక్షల మంది ప్రయాణికులు ఇండిగో విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ఇండిగోలో నెలకొన్న అంతర్గత సమస్యల.....
ఇండిగో సంక్షోభంతో రేట్లు పైపైకి.. ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు రూ.36,668
ఢిల్లీ నుంచి ముంబైకి రూ.40,452
పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న పోటీ సంస్థలు.. ప్రయాణికులకు ఇక్కట్లు
మూడో రోజు 550కి పైగా ఇండిగో సర్వీసుల రద్దు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కొనసాగుతోంది. గురువారం ఏకంగా 550కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. రోజూ దాదాపు నాలుగు లక్షల మంది ప్రయాణికులు ఇండిగో విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ఇండిగోలో నెలకొన్న అంతర్గత సమస్యల వల్ల రెండు మూడు రోజులుగా భారీ సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. పలు విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఈ ప్రభావం టికెట్ ధరలపై పడింది. ఎంతలా అంటే.. ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లడం కంటే ముంబై వెళ్లడానికే ఎక్కువ ఖర్చు పెట్టాల్సినంతగా ధరలు పెరిగిపోయాయి! ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు శుక్రవారం విమాన టికెట్ కనిష్ఠ ధర రూ.36,668. అదే సమయంలో ఢిల్లీ నుంచి ముంబైకి టికెట్ ధర రూ.40,452. ఇండిగో సంస్థ భారీగా విమాన సర్వీసులు రద్దు చేయడంతో దేశంలో విమాన టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పోటీ విమానయాన సంస్థలు ప్రస్తుత పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాయి. టికెట్ ధరలు అమాంతం పెరగడంతో ప్రయాణికులు బెంబేలిత్తిపోతున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఇండిగో సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం..
కొవిడ్ తర్వాత ఇండిగో సంస్థ ఇంత పెద్ద సంఖ్యలో సర్వీసులు రద్దు చేయడం ఇదే తొలిసారి. విమానాల రద్దు, ఇతర సమస్యలతో అనేక విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు. గురువారం 550కిపైగా సర్వీసులు రద్దయ్యాయి. ఇందులో హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే 72 సర్వీసులు, బెంగళూరులో 73, చెన్నైలో 39, విశాఖలో 6 ఇండిగో సర్వీసులు నిలిచిపోయాయి. ఉన్నపళంగా విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది, ఇండిగో ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. ఇక విమాన టికెట్ రేట్లు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి గురు, శుక్రవారాల్లో విమాన టికెట్ గరిష్ఠ ధర రూ.30వేల పైనే ఉంది. శుక్రవారం ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ వెళ్లే డెల్లా ఎయిర్‌లైన్స్ విమాన టికెట్ ధర రూ.36,668లు కాగా.. ఢిల్లీ నుంచి ముంబై నేరుగా వెళ్లే విమాన టికెట్ ధర గరిష్ఠంగా రూ.40,452 పలుకుతోంది. శుక్రవారం ఢిల్లీ నుంచి ముంబైకి ఉదయం 7.05 గంటలకు, సాయంత్రం 4, రాత్రి 7.40, 8.30 గంటలకు బయల్దేరే ఎయిర్ ఇండియా సర్వీసులన్నింట్లో టికెట్ ధర రూ.38,676 ఉండడం గమనార్హం. అలాగే ముంబై నుంచి ఢిల్లీకి రూ.36,222గా ఉంది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో బుక్ చేసుకునే వారికి ఈ ధర ఉంది. ఇవి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు నగరాలకు నేరుగా విమాన సర్వీసుల టికెట్ ధరలు కనిష్ఠంగా రూ.22 వేల నుంచి రూ.30 వేల వరకు ఉన్నాయి. సాధారణంగా ప్రధాన నగరాల మధ్య టికెట్ ధరలు రూ.6-10 వేల వరకు ఉంటాయి. ఢిల్లీ నుంచి విజయవాడకు కూడా విమాన టికెట్ ధరలు మోతెక్కుతున్నాయి. శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విజయవాడ బయల్దేరే ఎయిర్ ఇండియా విమాన టికెట్ ధర రూ.34,987 ఉంది. ఇక విజయవాడ నుంచి ఢిల్లీకి నేరుగా వెళ్లే విమాన టికెట్ ధరలు గరిష్ఠంగా రూ.20 వేలకుపైగానే ఉన్నాయి.
గందరగోళానికి కారణమేంటి?
ఇండిగోలో నెలకొన్న సంక్షోభం వెనక అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీసుకొచ్చిన నిబంధనలు. పైలట్లకు, ఇతర సిబ్బందికి తగినంత విశ్రాంతి లేకపోవడం కూడా విమాన దుర్ఘటనలకు కారణమని గుర్తించిన డీజీసీఏ గత ఏడాది జనవరిలో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ ఏడాది నవంబరు నుంచి ఈ నిబంధనలను పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం.. విమాన సిబ్బందికి వారాంతపు విశ్రాంతి వ్యవధి గతంలో కంటే పెరిగింది. గతంలో డ్యూటీ షెడ్యూల్‌లో కనీసం ఆరు నైట్ షిఫ్టులు ఉండగా.. ప్రస్తుతం వాటిని రెండుకు కుదించారు. రాత్రి వేళల్ని గతంలో కంటే ఒక గంట అదనంగా పెంచారు. ప్రయాణికులకు చౌకగా సేవలు అందించడానికి వీలుగా ఇండిగో ఎక్కువగా రాత్రి సర్వీసులను (టికెట్ ధరలు తక్కువగా ఉంటాయి) నడుపుతూ వస్తోంది. కొత్త నిబంధనలతో రాత్రి వేళల్లో పని చేయడానికి తగినంత మంది సిబ్బంది లేకుండా పోయారు. ఇండిగో రోజుకు సగటున 2,200 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతోంది. భారీ సంఖ్యలో, అది కూడా రాత్రి వేళల్లో ఎక్కువగా విమానాలు నడపడంతో డీజీసీఏ నిబంధనల ప్రభావం ఇండిగోపై తీవ్రంగా పడింది. దీని ఫలితమే, విమానాల రద్దు, షెడ్యూళ్ల మార్పు, జాప్యం. ఇండిగోలో సంక్షోభం వెనక ఆ సంస్థ స్వయంకృతాపరాధం కూడా ఉందని పైలట్ల సంఘాలు విమర్శిస్తున్నాయి. ‘ఫ్లయిట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్’ను అమలు చేయడానికి డీజీసీఏ రెండేళ్ల సమయం ఇచ్చినప్పటికీ ఇండిగో తగిన ప్రణాళికలు రూపొందించుకోలేదని, అందువల్లే ఈ గందరగోళం తలెత్తిందని ‘ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్’ వెల్లడించింది.
సరిదిద్దడానికి కృషి చేస్తున్నాం: ఇండిగో
రోజుకు సగటున 3.80 లక్షల మంది ప్రయాణికులకు తాము సేవలందిస్తుంటామని, ఇటీవల తమ వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారని, అందుకు క్షమాపణ కూడా చెప్పామని ఇండిగో సీఈవో పీటర్ ఎల్‌బర్స్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నిర్వహణపరమైన సవాళ్లు, మైనర్ టెక్నికల్ సమస్యలు, షెడ్యూళ్లలో మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పెరిగిన విమానాల రద్దీ, కొత్తగా అమల్లోకి వచ్చిన ఫ్లయిట్ డ్యూటీ నిబంధనలు అన్నీ కలిసి ప్రస్తుత సంక్షోభానికి కారణమయ్యాయని వివరించారు. సంస్థ కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఇండిగో అంతరాయాలపై మంత్రి రామ్మోహన్ సమీక్ష
ఇండిగో విమానాల రాకపోకల్లో అంతరాయాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు గురువారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆ సంస్థకు సూచించారు. ఈ పరిస్థితిని సాకుగా తీసుకొని విమాన చార్జీలు పెంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనల కారణంగా సమస్య తలెత్తినట్లు ఆ కంపెనీ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివరణతో రామ్మోహన్ సంతృప్తి చెందలేదు. సమయం ఇచ్చినా సిబ్బంది విధుల సమయాలను తగిన విధంగా రూపొందించకపోవడాన్ని ప్రశ్నించారు. సర్వీసుల రద్దుపై ప్రయాణికుల కు ముందుగానే సమాచారం ఇవ్వాలన్నారు. విమానాశ్రయాల్లో చిక్కుకున్న ప్రయాణికులకు హోటల్, ఇతర సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
MLA Abhay Singh: రష్యాలో భారత సంతతి ఎమ్మెల్యే..
PM Modi Putin Meeting: 25 ఒప్పందాలు!