PM Modi Putin Meeting: 25 ఒప్పందాలు!
ABN , Publish Date - Dec 05 , 2025 | 02:20 AM
రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం 6.35 గంటలకు ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో దిగిన పుతిన్‌కు..
పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత్-రష్యా మధ్య కుదిరే అవకాశం
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు స్వయంగా స్వాగతం పలికిన మోదీ
ప్రధాని కారులోనే ఆయన అధికారిక నివాసానికి పుతిన్
రష్యా అధినేతకు మోదీ ప్రైవేటు విందు.. నేడు ఇరువురి మధ్య చర్చలు
మరో ఐదు రెజిమెంట్ల ఎస్-400లు, రూపే-మిర్ అనుసంధానం,పౌర అణు సహకారం సహా పలు కీలక ఒప్పందాలపై సంతకాలు
ఎస్-500లు, ఎస్‌యూ-57 యుద్ధవిమానాల కొనుగోలుపై చర్చ!
ఇరుదేశాల మధ్య 2030కి 100 బిలియన్ డాలర్ల వాణిజ్యమే లక్ష్యం
భారత్ ‘రక్షణ’కు సహకారం.. రాజ్‌నాథ్‌తో భేటీలో రష్యా రక్షణ మంత్రి
న్యూఢిల్లీ, డిసెంబరు 4: రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం 6.35 గంటలకు ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో దిగిన పుతిన్‌కు.. ప్రొటోకాల్‌కు భిన్నంగా ప్రధాని నరేంద్రమోదీ సాదర స్వాగతం పలికారు. కళాకారులు సంప్రదాయ నృత్యం చేస్తుండగా.. విమానం దిగిన పుతిన్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సాధారణంగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తన సొంత కారును మాత్రమే వాడే పుతిన్‌ను.. ప్రధాని మోదీ తన టొయోటా ఫార్చ్యూనర్ కారులో తన అధికారిక నివాసానికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఎక్స్’లో ఆయన ఒక పోస్టు పెట్టారు. ‘‘నా స్నేహితుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు స్వాగతం పలికినందుకు ఆనందంగా ఉంది. ఈ రాత్రి, రేపు మా ఇద్దరి మధ్య జరిగే సమావేశాల కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. భారత్-రష్యా స్నేహం కాలపరీక్షకు నిలిచింది, మన ప్రజలకు అపారమైన మేలు చేకూర్చింది’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆ తర్వాత పుతిన్‌కు ఆయన ప్రైవేటు విందు ఇచ్చారు. పుతిన్ రాక సందర్భంగా మోదీ అధికారిక నివాసాన్ని విద్యుద్దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పుతిన్‌తోపాటు వచ్చిన బృందంలో ఏడుగురు రష్యన్ మంత్రులు, పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు, రష్యా సెంట్రల్ బ్యాంకు గవర్నర్ ఉన్నారు. కాగా.. శుక్రవారం ఉదయం 11 గంటలకు పుతిన్ రాష్ట్రపతి భవన్‌లో త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. 11.30 గంటలకు రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మాగాంధీకి నివాళులు అర్పిస్తారు. 11.50 గంటలకు హైదరాబాద్ హౌస్‌లో మొదలయ్యే ఇండియా-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్-మోదీ పాల్గొననున్నారు. రెండు గంటలపాటు సాగే ఈ సమావేశంలో.. ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం, బయటి ఒత్తిళ్ల నుంచి ఇరుదేశాల వాణిజ్యాన్ని కాపాడడం, పౌర అణు ఇంధన సహకారం, ఎరువుల రంగంలో సహకారం పెంపు, యురేషియన్ ఎకనమిక్ యూనియన్‌తో భారత్ ప్రతిపాదించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సహా పలు అంశాలు కీలకంగా చర్చకురానున్నాయి. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ముడిచమురును కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారీగా పెరిగిపోతున్న వాణిజ్య లోటు గురించి భారత్ ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది (ప్రస్తుతం మనదేశం రష్యా నుంచి ఏటా 65 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.5.8 లక్షల కోట్ల) విలువైన దిగుమతులు చేసుకుంటుండగా.. రష్యాకు మన ఎగుమతులు కేవలం 5 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.45 వేల కోట్లు) ఉన్నాయి).
2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ఈచర్చ జరగనుంది. అలాగే.. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లపై అమెరికా విధిస్తున్న ఆంక్షల ప్రభావంపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల గురించి పుతిన్ మోదీకి వివరించనున్నట్టు సమాచారం.
కీలక అంకం.. ఒప్పందాలు
భేటీ అనంతరం.. రష్యా నుంచి కొత్తగా మరో ఐదు రెజిమెంట్ల ఎస్-400ల కొనుగోలు, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో వినియోగించిన క్షిపణుల స్థానంలో కొత్త మిస్సైళ్ల కొనుగోలు, రష్యాలో ప్రస్తుతం నిపుణుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భారతీయ కార్మికులు, పలు రంగాల నిపుణులు రష్యాకు వెళ్లడాన్ని సులభతరం చేసే, వారి హక్కులకు రక్షణ కల్పించే మొబిలిటీ ఒప్పందం, ఇరుదేశాల మధ్య రక్షణ సహకారం, ఇరు దేశాల చెల్లింపు వ్యవస్థలైన ‘రూపే-మిర్’ అనుసంధానం సహా... 25 (10 ప్రభుత్వ, 15 వాణిజ్య) కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందాల ఫలితంగా ఫార్మా, వ్యవసాయం, ఆహార ఉత్పత్తులు తదితర రంగాల్లో రష్యాకు భారత ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే.. రష్యా నుంచి అత్యంత అధునాతన ఎస్-500ల కొనుగోలు, ఐదో తరం యుద్ధవిమానాలైన ఎస్‌యు-57ల కొనుగోలు, ఉమ్మడి ఉత్పత్తి, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, అంతరిక్ష రంగం, అణు ఇంధనం, సైన్స్ అండ్ టెక్నాలజీ, పోర్టుల అభివృద్ధి తదితర అంశాలకు సంబంధించి కూడా శుక్రవారంనాటి భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. శిఖరాగ్ర సమావేశం ముగిశాక మధ్యాహ్నం 1.50 గంటలకు పుతిన్-మోదీ సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు. అనంతరం.. రష్యా ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన భారత చానల్‌ను పుతిన్ ప్రారంభిస్తారు. సాయంత్రం ఏడు గంటలకు రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరి వెళ్లి.. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇచ్చే విందుకు హాజరై రాత్రి 9 గంటలకు మాస్కోకు తిరుగుప్రయాణం అవుతారు. కాగా.. గురువారం సాయంత్రం రష్యా, భారత్ రక్షణ మంత్రుల సమావేశం జరిగింది. రష్యా నుంచి అదనంగా ఎస్-400 మిసైల్ సిస్టమ్స్, కీలక మిలటరీ హార్డ్‌వేర్ కొనుగోలుపై ప్రధానంగా వారు చర్చించినట్టు సమాచారం. భారత సైనిక దళాల ఆధునికీకరణకు, రక్షణ ఉత్పత్తుల రంగంలో స్వావలంబనకు సహకరిస్తామని రష్యా రక్షణ మంత్రి అంద్రేయ్ బెలొసోవ్ ఈ భేటీలో హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పెంపొందించుకునే దిశగా కొత్త అవకాశాలను అన్వేషిద్దామని రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు విధించిన వేళ.. ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా జరుగుతున్న వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కి వస్తున్న దశలో జరుగుతున్న పుతిన్-మోదీ భేటీని పాశ్చాత్య దేశాలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయి.
11 ఏళ్లలో ఆరుగురికి ఆహ్వానం
ప్రొటోకాల్‌కు భిన్నంగా గురువారం సాయంత్రం ప్రధాని మోదీ ఎయిర్‌పోర్టుకు వెళ్లి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆహ్వానించడాన్ని అంతా ఆసక్తిగా చూశారు. అయితే, మోదీ ఇలా వేరే దేశాల అధినేతలను ఆహ్వానించడానికి విమానాశ్రయానికి వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. గడిచిన 11 ఏళ్లలో ఆయన 6 సందర్భాల్లో ఇలా వెళ్లారు. 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను, 2017లో బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనాను, జపాన్ ప్రధాని షింజో అబెను, 2020లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను, 2024 జనవరిలో యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను, 2025 ఫిబ్రవరిలో ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీని స్వయంగా ఆహ్వానించారు.
అప్పుడాయన.. ఇప్పుడీయన..
కిందటి సంవత్సరం మన ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు.. మాస్కోలో ఆయనకు పుతిన్ ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారు! దానికి ప్రతిగా మోదీ.. గురువారం రాత్రి పుతిన్‌కు ప్రైవేటు డిన్నర్ ఇచ్చి తమ స్నేహబంధాన్ని మరింత పటిష్ఠం చేసుకున్నారు! ఇక.. మూణ్నెల్ల క్రితం చైనాలోని టియాన్జిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సమయంలో.. మోదీని పుతిన్ తన కారులో ఎక్కించుకుని దాదాపు 45 నిమిషాలపాటు అందులోనే చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో.. గురువారం రాత్రి ప్రధాని మోదీ పుతిన్‌ను తన టొయోటో ఫార్చ్యూనర్ కారులో ఎక్కించుకుని తన అధికారిక నివాసానికి తీసుకెళ్లడంతో.. సామాజిక మాధ్యమాల్లో పలువురు ‘కార్‌పూలింగ్ 2.0’ జరిగిందంటూ రెండు ఫొటోలూ పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
IndiGo Crisis: ఆకాశాన్నంటిన విమాన టికెట్ ధరలు!
Parliament Clears Higher Excise: పొగాకుపై అధిక సెంట్రల్ ఎక్సైజ్ సుంకం