Share News

Parliament Clears Higher Excise: పొగాకుపై అధిక సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం

ABN , Publish Date - Dec 05 , 2025 | 02:58 AM

పొగాకుపై అధిక సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని విధించేందుకు అవకాశం కల్పించే బిల్లును గురువారం పార్లమెంటు ఆమోదించింది. ప్రస్తుతం పొగాకుపై విధించిన జీఎస్టీ పరిహార సెస్సు వసూళ్లను నిలిపివేసిన అనంతరం ఎక్సైజ్‌ సుంకం అమల్లోకి రానుంది.....

Parliament Clears Higher Excise: పొగాకుపై అధిక సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం

  • 60-70ు మేర విధించే అవకాశం

  • బిల్లుకు పార్లమెంటు ఆమోదం

న్యూఢిల్లీ, డిసెంబరు 4: పొగాకుపై అధిక సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని విధించేందుకు అవకాశం కల్పించే బిల్లును గురువారం పార్లమెంటు ఆమోదించింది. ప్రస్తుతం పొగాకుపై విధించిన జీఎస్టీ పరిహార సెస్సు వసూళ్లను నిలిపివేసిన అనంతరం ఎక్సైజ్‌ సుంకం అమల్లోకి రానుంది. ఈ బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదించగా, గురువారం రాజ్యసభ అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులను ‘డీ మెరిట్‌’ కేటగిరీగా పరిగణించి 40ు జీఎస్టీ పరిధిలో ఉంచినట్టు చెప్పారు. ప్రస్తుతం 28ు జీఎస్టీతో పాటు పరిహార సెస్సును వసూలు చేస్తున్నట్టు తెలిపారు. సిగరెట్లు, సిగార్లు, హుక్కా, జర్దా, సెంటెండ్‌ టుబాకో వంటి ఉత్పత్తులకు ఇది వర్తిస్తోందని వివరించారు. సెస్‌ వసూలును నిలిపివేసిన తరువాత ముడి పొగాకుపై 60-70ు ఎక్సయిజ్‌ డ్యూటీ వసూలు చేసే అవకాశం ఉందని తెలిపారు. పొగాకు సాగును తగ్గించి ఇతర వాణిజ్య పంటలు పండించాలని రైతులను కోరుతున్నట్టు ఆమె తెలిపారు. మరోవైపు.. భారతదేశ వాస్తవమైన ఆర్థిక పరిస్థితిని పతనమవుతున్న రూపాయి విలువ తెలియజేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ గురువారం మరో రూ.28 పైసలు దిగజారి రూ.90.43పైసలకు చేరిన నేపథ్యంలో ప్రధాని మోదీని విమర్శిస్తూ ఖర్గే ‘ఎక్స్‌’లో ఒక పోస్టు పెట్టారు. రూపాయి విలువ పడిపోడానికి కారణం ఏమిటని ఖర్గే ప్రశ్నించారు. కాగా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంపై వివిధ ప్రతిపక్ష పార్టీ ల నేతలు పార్లమెంటు భవనంలో గురువారం ఆందోళన నిర్వహించారు. పార్లమెంటు మకర ద్వారం వద్ద ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. కొందరు ఎంపీ లు మాస్కులు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు.

Updated Date - Dec 05 , 2025 | 02:58 AM