MLA Abhay Singh: రష్యాలో భారత సంతతి ఎమ్మెల్యే..
ABN , Publish Date - Dec 05 , 2025 | 02:17 AM
రష్యా నుంచి అత్యాధునికమైన క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-500ను కొనుగోలు చేయడానికి భారత్ ప్రయత్నించాలని రష్యాలోని భారత సంతతి ఎమ్మెల్యే అభయ్‌సింగ్ సూచించారు....
ఎస్-500 వ్యవస్థ కొనుగోలుకు భారత్ ప్రయత్నించాలన్న అభయ్‌సింగ్
న్యూఢిల్లీ, డిసెంబరు 4: రష్యా నుంచి అత్యాధునికమైన క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-500ను కొనుగోలు చేయడానికి భారత్ ప్రయత్నించాలని రష్యాలోని భారత సంతతి ఎమ్మెల్యే అభయ్‌సింగ్ సూచించారు. ఎస్-500 వ్యవస్థను రష్యా ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదని, దాన్ని పొందితే భారత్‌కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎస్‌యూ-57 యుద్ధ విమానాలు కూడా అద్భుతమని చెప్పారు. రష్యాలో నిపుణుల కొరత ఉందని, భారతీయులకు అక్కడ మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో రష్యాలో భారత సంతతి ఎమ్మెల్యే ఈ ప్రకటన చేయడంతో ఆయన ఎవరనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. బిహార్‌లోని పట్నాకు చెందిన అభయ్‌సింగ్ 1991లో అప్పటి సోవియట్ యూనియన్‌కు వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ తరఫున 2017లో తొలిసారిగా ఉక్రెయిన్ సరిహద్దుల్లోని కర్క్స్ ప్రాంత శాసనసభ్యుడిగా గెలిచారు. 2022లో మరోసారి విజయం సాధించారు. సోవియట్ యూనియన్ పతనం సమయంలోనే తాను పుతిన్‌ను చూశానని, ఆయనను ఆదర్శంగా తీసుకునే రాజకీయాల్లోకి వచ్చానని అభయ్‌సింగ్ చెప్పారు. భారత్‌లో జరిగే ఎన్నికల తరహాలోనే తాను ప్రచారం చేశానని, ప్రతిఒక్కరినీ కలిసి మద్దతు కూడగట్టుకుని, గెలిచానని పేర్కొన్నారు.