Russian Defence Minister Andrey Belousov: భారత్ రక్షణకు పూర్తి సహకారం
ABN , Publish Date - Dec 05 , 2025 | 02:15 AM
భారత్ రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబన సాధించేందుకు రష్యా రక్షణ పరిశ్రమ తోడ్పడుతుందని ఆ దేశ రక్షణ మంత్రి ఆండ్రే బెలొసోవ్ హామీ ఇచ్చారు....
రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబనకు తోడ్పడుతాం.. సైనిక దళాల ఆధునికీకరణకు సాయం చేస్తాం
రష్యా రక్షణ మంత్రి ఆండ్రే బెలొసోవ్ హామీ
దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి, ఎగుమతులపై దృఢ సంకల్పంతో ఉన్నాం: రాజ్‌నాథ్
వార్షిక సదస్సుకు ముందస్తుగా రక్షణ మంత్రుల భేటీ
న్యూఢిల్లీ, డిసెంబరు 4: భారత్ రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబన సాధించేందుకు రష్యా రక్షణ పరిశ్రమ తోడ్పడుతుందని ఆ దేశ రక్షణ మంత్రి ఆండ్రే బెలొసోవ్ హామీ ఇచ్చారు. భారత సైనిక దళాల ఆధునికీకరణకు రష్యా పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని చెప్పారు. భారత్, రష్యా వార్షిక సదస్సుకు ముందు సన్నాహకంగా.. ఇరుదేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, ఆండ్రే బెలొసోవ్ గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. శుక్రవారం జరిగే సదస్సులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయి తీసుకునే కీలక నిర్ణయాలు, జరగను న్న ఒప్పందాలపై చర్చించారు. ‘భారత్-రష్యా అంతర ప్రభుత్వ కమిషన్ ఆన్ మిలటరీ, మిలటరీ సాంకేతిక సమావేశం’లో భాగంగా ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా భారత రక్షణ పరిశ్రమ సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు దేశీయ ఉత్పత్తి, ఎగుమతులపై దృఢ సంకల్పంతో ముందుకు సాగుతామని రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. అధునాతన సాంకేతికతల్లో భారత్, రష్యా మధ్య సహకారాన్ని మరింతగా పెంచుకునేందుకు కొత్త అవకాశాలను అన్వేషిద్దామని ప్రతిపాదించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గాఢమైన నమ్మకం, పరస్పర గౌరవంతో కూడుకున్నాయని.. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని రక్షణ మంత్రులు ఈ సందర్భంగా అభిప్రాయానికి వచ్చారు. భారత్ రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు రష్యా రక్షణ పరిశ్రమ తోడ్పడుతుందని ఆండ్రే బెలొసోవ్ హామీ ఇచ్చారు. భారత సైనిక దళాల ఆధునికీకరణకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరతలు నెలకొన్న సమయంలోనూ భారత్, రష్యా రక్షణ సహకారం బలంగా ముందుకు సాగుతోందన్నారు. భారత్, రష్యా మధ్య దృఢమైన స్నేహం కాలపరీక్షను తట్టుకుని నిలిచిందని.. దక్షిణాసియా ప్రాంతంలో సమతుల్యతకు ఇది మార్గం వేసిందన్నారు. భేటీ అనంతరం రక్షణ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ సమావేశానికి ముందు రాజ్‌నాథ్, బెలోసోవ్ నేషనల్ వార్ మెమొరియల్ వద్ద నివాళి అర్పించారు. కాగా, ఆపరేషన్ సిందూర్‌లో అద్భుత పనితీరు చూపిన రష్యా ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థలు మరిన్నింటిని కొనేందుకు భారత్ ఆసక్తి చూపినట్టు సమాచారం.