Patna High Court Congress: పాట్నా హైకోర్టు ఆదేశం.. మోదీ తల్లి వీడియో తొలగించాలని కాంగ్రెస్‌కు ఆదేశం
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:33 PM
పాట్నా హైకోర్టు బుధవారం కాంగ్రెస్ పార్టీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీపై ఏఐతో తయారు చేసిన డీప్‌ఫేక్ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కాంగ్రెస్‌కు కోర్టు సూచించింది.
ఇటీవల బీహార్‌లో రాజకీయాలు మరింత హాట్ హాట్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీ బిహార్ యూనిట్ ఒక ఏఐ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ కనిపించారు. అది డీప్‌ఫేక్ వీడియో కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో పాట్నా హైకోర్టు (Patna High Court Congress) బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆ వీడియోను తక్షణమే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నుంచి తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీబీ బజంతరి ఈ మేరకు ప్రకటించారు. ఈ ఏఐ వీడియో బిహార్ కాంగ్రెస్ యూనిట్ అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి షేర్ అయ్యింది. వీడియో చూసినవారు వెంటనే స్పందించారు. ప్రధానమంత్రిని తల్లిని అలా చూపించడం అనాగరికం అంటూ బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
కోర్టు ఎందుకు జోక్యం చేసుకుంది?
ఈ ఏఐ వీడియో విషయంలో బీజేపీ ఢిల్లీ ఎన్నికల సెల్ కన్వీనర్ సంకేత్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఆ వీడియో ప్రధాని మోదీ, ఆయన తల్లి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీని ఆధారంగా బీహార్ పోలీసులు కాంగ్రెస్ నాయకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ ఎఫ్‌ఐఆర్‌లో భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 18(2), 336(3), 336(4), 340(2), 352, 356(2), 61(2)లను ఉదహరించారు. పాట్నా హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచి ఈ వీడియోను వెంటనే తొలగించాలని ఆదేశించింది.
కాంగ్రెస్ ఏం చెబుతోంది?
కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము ప్రధాని మోదీ, ఆయన తల్లినో అగౌరవపరచలేదని స్పష్టం చేసింది. ఈ వీడియో విషయంలో పార్టీ అంతర్గతంగా ఒక దర్యాప్తు కూడా ప్రారంభించినట్టు గత వారం ప్రకటించింది. ఈ వీడియోను ఎవరు షేర్ చేశారు, దీని వెనుక ఉద్దేశం ఏంటని తెలుసుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని పార్టీలోని సీనియర్ నాయకులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి