Share News

Opposition On EC: ప్రశ్నలు అడిగితే ఎదురుదాడి.. ఈసీపై విపక్షాలు మండిపాటు

ABN , Publish Date - Aug 18 , 2025 | 07:36 PM

రాజకీయ పార్టీలు లేవనెత్తిన కీలక ప్రశ్నలకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని, ఆయన తన బాధ్యతల నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఓటు హక్కు అనేది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రధానమైన హక్కు అని, దానికి పరిరక్షించేందుకు ఉద్దేశించినదే ఈసీ అని చెప్పారు.

Opposition On EC: ప్రశ్నలు అడిగితే ఎదురుదాడి.. ఈసీపై విపక్షాలు మండిపాటు
INDIA alliance leaders

న్యూఢిల్లీ: ఓటు చోరీ ఆరోపణలు, బిహార్ ఎస్ఐఆర్(SIR) వివాదానికి సంబంధించి ఎన్నికల కమిషన్‌పై విపక్ష 'ఇండియా' కూటమి విరుచుకుపడింది. ఎన్నికల కమిషన్ పనితీరుపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. తామడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి బదులు ఎదురుదాడికి దిగుతోందని విమర్శించింది. బీజేపీ ప్రతినిధిగా సీఈసీ మాట్లాడుతున్నారని, ఎస్ఐఆర్‌ జాబితా, అవకతవకలపై తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఈసీ విఫలమైందని నేతలు ఆరోపించారు. కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, టీఎంసీ, ఇతర పార్టీల నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.


రాజకీయ పార్టీలు లేవనెత్తిన కీలక ప్రశ్నలకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని, ఆయన తన బాధ్యతల నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఓటు హక్కు అనేది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రధానమైన హక్కు అని, ప్రజాస్వామ్యం దానిపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. దాన్ని పరిరక్షించేందుకు ఉద్దేశించినదే ఈసీ అని చెప్పారు. విపక్షాలు అడిగిన నిర్దిష్టమైన ప్రశ్నలకు ఈసీఐ సమాధానం ఇచ్చే బదులు రాజకీయ పార్టీలను ప్రశించడం, దాడి చేయడం చేశారని అన్నారు. ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే వ్యవధి ఉన్న తరుణంలో రాజకీయ పార్టీలతో సంప్రదించకుండా ఇంత హడావిడిగా ఎస్ఐఆర్ ఎందుకు చేపట్టారనేది ఆయన చెప్పి ఉంటే బాగుండేదన్నారు. ఎస్ఐఆర్‌ ప్రకటనలో ఎందుకు దూకుడుగా వ్యవహరించారని ప్రశ్నించారు.


ప్రజాస్వామ్య సిద్ధాంతాలను పరిరక్షించడమే ఈసీ ఉద్దేశం కావాలని, తమ చర్చలను కప్పిపుచ్చుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగార్చడమే అవుతుందని ఆర్జేడీ నేత మనోజ్ ఝా అన్నారు. టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా మాట్లాడుతూ, డూప్లికేట్ ఓటర్ కార్డుల అంశాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో లేవనెత్తారని, దాన్ని ఇంతవరకూ పరిష్కరించనే లేదని అన్నారు. మోసపూరిత ఓటర్ల జాబితాల విషయంలో గత ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోసపూరిత ఓటర్ల జాబితాతోనే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించడమే నిజమైతే ఎలక్షన్ కమిషన్‌ను ప్రాసిక్యూట్ చేయాలని, లోక్‌సభను రద్దు చేయాలని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఫిర్యాదు చేసినందుకు అఫిడవిట్ సమర్పించాలని ఈసీ అడుగుతోందని, 2022లో ఓటర్ల జాబితా నుంచి 18,000 మంది ఓటర్లను తొలగించారనే ఫిర్యాదుతో తమ పార్టీ అఫిడవిట్లు సమర్పించిందని, దానిపై ఇంతవరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని అన్నారు. బిహార్‌లో హడావిడిగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంటులో చర్చకు అధికార పార్టీ ఎందుకు అనుమతించడం లేదని డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ ప్రశ్నించారు. సమస్య పరిష్కారానికి అన్ని చట్టపరమైన మార్గాలను ఆశ్రయిస్తామని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

మోదీకి పుతిన్ ఫోన్

మోదీని కలిసిన ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 18 , 2025 | 09:22 PM