Share News

Rahul Gandhi: సుప్రీం వ్యాఖ్యలు అవాంఛనీయం

ABN , Publish Date - Aug 06 , 2025 | 05:29 AM

చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందన్న కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అవాంఛనీయమని విపక్షాల ‘ఇండీ’ కూటమి పేర్కొంది.

Rahul Gandhi: సుప్రీం వ్యాఖ్యలు అవాంఛనీయం

  • రాహుల్‌కు ‘ఇండీ’ కూటమి సమర్థన

  • ఎవరు నిజమైన భారతీయుడో నిర్ణయించేది జడ్జీలు కాదు: ప్రియాంక

న్యూఢిల్లీ, ఆగస్టు 5: చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందన్న కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అవాంఛనీయమని విపక్షాల ‘ఇండీ’ కూటమి పేర్కొంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతకు పూర్తి మద్దతు ప్రకటించింది. మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లోని వివిధ విపక్షాల నాయకులు సమావేశమయ్యారు. లోక్‌సభ, రాజ్యసభల్లోని ప్రతిపక్ష నేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా హాజరయ్యారు. జాతీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశాలపై వ్యాఖ్యలు చేయడం విపక్ష నేతగా రాహుల్‌ బాధ్యత అని పలువురు నేతలు పేర్కొన్నారు. రాహుల్‌నుద్దేశించి, పార్టీల ప్రజాస్వామిక హక్కులపైన సుప్రీంకోర్టు సిటింగ్‌ న్యాయమూర్తి అసాధారణ వ్యాఖ్య చేశారని, ఇది అవాంఛనీయమని అన్ని పార్టీల నాయకులూ అన్నట్లు కాంగ్రెస్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ అంశంపై రాహుల్‌ సోదరి, వయనాడ్‌ కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రాను మీడియాను ప్రశ్నించగా.. ఎవరు నిజమైన భారతీయులో నిర్ణయించేది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కాదని ఆమె బదులిచ్చారు. ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆయన విధి. అదే ఆయన చేశారు’ అని స్పష్టంచేశారు. మరోవైపు, సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇకనైనా రాహుల్‌ తన నడత మార్చుకోవాలని, రాజ్యాంగ విలువలను గౌరవించాలని బీజేపీ సూచించింది. కోర్టు ఆక్షేపణ ఆయనకు తీవ్ర హెచ్చరికవంటిదని ఆ పార్టీ సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని దేశమంతా తిరిగేవాళ్లకు.. ఆ రాజ్యాంగమంటే వీసమెత్తు గౌరవం ఉన్నా.. కోర్టు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.


ఇండీ కూటమి ప్రదర్శన 11కు వాయిదా

అసెంబ్లీ ఎన్నికల ముంగిట బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను నిరసిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కార్యాలయం వరకూ ప్రతిపక్ష ఇండీ కూటమి నిర్వహించ తలపెట్టిన ర్యాలీ 11కి వాయిదా పడింది. తొలుత ఈ నెల 8న ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించినా జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు- జార్ఖండ్‌ మాజీ సీఎం శిబూ సోరెన్‌ మృతితో వాయిదా పడిందని ఆ కూటమి వర్గాలు తెలిపాయి. అయితే, రాహుల్‌ గాంధీ నూతన నివాసంలో ఈ నెల 7న ఇండీ కూటమి పక్షాల విందు సమావేశం యథాతథంగా సాగుతుందని ఆ వర్గాల కథనం. ఇక 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహదేవపుర సెగ్మెంట్‌ ఓటర్ల జాబితాలో భారీస్థాయిలో అవకతవకలు జరిగినందుకు నిరసనగా రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో మంగళవారం బెంగళూరులో నిర్వహించాల్సిన ప్రదర్శన ఈ నెల 8కి వాయిదా పడింది.


రాజ్యసభలో సీఐఎస్‌ఎఫ్‌ దళాలపై రేణుక అసహనం

న్యూఢిల్లీ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) రాజ్యసభలో సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సిఐఎ్‌సఎఫ్‌) దళాలను మార్షల్స్‌లా నియమించి ప్రతిపక్ష ఎంపీలను అడ్డుకోవడంపై కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రేణుకాతో పాటు ప్రతిపక్ష ఎంపీలు మంగళవారం వెల్‌లోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా సిఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అనంతరం రేణుక మాట్లాడుతూ, పార్లమెంట్‌లో సిఐఎ్‌సఎఫ్‌ దళాలను మార్షల్స్‌గా వాడడం సరైంది కాదని అన్నారు. నిజమైన ఉగ్రవాదులను వారు పట్టుకోలేకపోయారని, ఆపరేషన్‌ మహదేవ్‌ పేరిట పట్టుకున్న వారు నిజమైన ఉగ్రవాదులో కాదో తెలియదని అన్నారు. కానీ పార్లమెంట్‌లో మాత్రం ఈ భద్రతా దళాలు మహిళలని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వ స్థాయి ఇదని రేణుకా విరుచుకుపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన

కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 05:29 AM