Share News

P Chidambaram On Operation Blue Star: ఆపరేషన్ బ్లూస్టార్ పెద్ద పొరపాటు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 12 , 2025 | 02:51 PM

మిలటరీపై కానీ, అధికారులపై కానీ తనకు ఎలాంటి అగౌరవం లేదని, అయితే స్వర్ణ దేవాలయం స్వాధీనం చేసుకోవడానికి ఎంచుకున్న మార్గం మాత్రం సరికాదన్నదే తన అభిప్రాయమని చిదంబరం తెలిపారు. స్వర్ణ దేవాలయం స్వాధీనానికి ఆర్మీని దూరంగా ఉంచాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

P Chidambaram On Operation Blue Star: ఆపరేషన్ బ్లూస్టార్ పెద్ద పొరపాటు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు
P Chidambaram on Operaton Blue Star

న్యూఢిల్లీ: ముంబై పేలుళ్లకు ప్రతీకార చర్యలు తీసుకోరాదనే బయట ఒత్తిళ్ల కారణంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం (P Chidambaram) తాజాగా 'ఆపరేషన్ బ్లూస్టార్' (Operation Blue Star)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వర్ణ దేవాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అప్పట్లో ఇందిరాగాంధీ (Indira Gandhi) ఆదేశాలపై నిర్వహించిన సైనిక చర్యను ఒక తప్పిదంగా అభివర్ణించారు. ఈ నిర్ణయంతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన ప్రాణాలను కోల్పోయారని చెప్పారు. పాత్రికేయుడు హరిందర్ బవేజా (Harinder Baweja) రచించిన 'దే విల్ షూట్ యు, మేడమ్' అనే పుస్తకంపై చర్చ సందర్భంగా చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలిలో జరుగుతున్న కుష్వంత్ సింగ్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆయన పాల్గొన్నారు.


'స్వర్ణదేవాలయం స్వాధీనం చేసుకోవడానికి, మిలిటెంట్లను పట్టుకోవడానికి మార్గం ఉంది. అయితే ఆపరేషన్ బ్లూస్టార్‌తో తప్పుడు మార్గం ఎంచుకున్నారు. ఆ పొరపాటుకు ఇందిరాగాంధీ తన ప్రాణాలను కోల్పాయారని నేను అంగీకరిస్తున్నా. అయితే ఈ పొరపాటు ఆర్మీ, పోలీసులు, ఇంటెలిజెన్స్, సివిల్ సర్వీస్ సమష్టిగా తీసుకున్న నిర్ణయం. ఒక్క ఇందిరాగాంధీని మాత్రమే తప్పుపట్టడం సరికాదు' అని చిదంబరం అన్నారు.


ఎవరి పట్ల అగౌరవం లేదు..

మిలటరీపై కానీ, అధికారులపై కానీ తనకు ఎలాంటి అగౌరవం లేదని, అయితే స్వర్ణ దేవాలయం స్వాధీనం చేసుకోవడానికి ఎంచుకున్న మార్గం మాత్రం సరికాదన్నదే తన అభిప్రాయమని చిదంబరం తెలిపారు. స్వర్ణ దేవాలయం స్వాధీనానికి ఆర్మీని దూరంగా ఉంచాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.


పంజాబ్ అసలు సమస్య ఏమిటంటే..

పంజాబ్‌ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఆర్థిక పరిస్థితి అని చిదంబరం అన్నారు. 'పంజాబ్‌లో పర్యటన జరిపినప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఖలిస్థాన్, వేర్పాటువాదం అంటూ జరుగుతున్న రాజకీయ ప్రచారం దాదాపు తగ్గిపోయింది. ఆర్థిక పరిస్థితే అక్కడి ప్రధాన సమస్య. అక్రమ వలసదారులు ఎక్కువగా పంజాబ్‌ నుంచి వచ్చారు' అని చెప్పారు.


గోల్డెన్ టెంపుల్‌ను స్థావరంగా చేసుకుని వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తున్న జర్నేల్ సింగ్ భింద్రన్‌వాలేను పట్టుకునేందుకు 1984 జూన్ 1న భారత సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టింది. మేజర్ జనరల్ బ్రార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సైనిక చర్య జూన్ 8 వరకూ కొనసాగింది. భద్రతా బలగాలు భింద్రేన్‌వాలేను మట్టుబెట్టింది. అఖల్‌ తఖ్త్‌ డ్యామేజ్‌కు దారితీసింది. సైనిక చర్యపై సిక్కు వర్గాల్లో విస్తృత స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఘటన జరిగిన కొన్ని నెలలకే ఇందిరాగాంధీని ఆమె బాడీగార్డులు కాల్చిచంపారు.


ఇవి కూడా చదవండి..

కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!

మచాడో మాదిరే రాహుల్‌ పోరాటం

For More National News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 03:58 PM