Share News

Arvind Kejriwal Vs CEC: కేజ్రీవాల్ ఆరోపణలు.. స్పందించిన ఈసీ

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:36 PM

Arvind Kejriwal Vs CEC: ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తనదైన శైలిలో స్పందించింది. అది కూడా తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించింది. అందులో కూడా ఎక్కడా ఆప్ కానీ.. కేజ్రీవాల్ పేరు కానీ లేకుండా స్పందించింది.

Arvind Kejriwal Vs CEC: కేజ్రీవాల్ ఆరోపణలు.. స్పందించిన ఈసీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 04: బీజేపీ ముందు కేంద్ర ఎన్నికల సంఘం లొంగిపోయిందంటూ ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తనదైన శైలిలో మంగళవారం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించింది. ఢిల్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ తరచూ ఆరోపణలు గుప్పిస్తున్నారని.. ఇలాంటి దురాశలకు ఎన్నికల సంఘం లొంగదని స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో ఈసీఐని ఒకే సభ్య సంస్థగా భావించి.. ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి తెచ్చే వ్యూహాలను సైతం గమనించామంది.

ఈ నేపథ్యంలో వివేకంతో వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అయితే ఎక్స్ ఖాతా వేదికగా ఈసీఐ స్పందిస్తూ.. ఎక్కడ ఆమ్ ఆద్మీ పేరు కానీ.. కేజ్రీవాల్ పేరు కానీ లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీలతోపాటు అభ్యర్థులు లేవనెత్తిన సమస్యలపై 1.5 లక్షల మంది అధికారులు చర్యలు తీసుకుంటున్నారని వివరించింది. వారంతా న్యాయ బద్దంగా.. ఎక్కడ పక్షపాతం లేకుండా.. స్టాండర్డ్ అపరేటింగ్ ప్రొసిజర్ ద్వారా నిపక్షపాతంగా పని చేస్తున్నారని ఈసీఐ స్పష్టం చేసింది.


ఇంతకీ అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారంటే..

కేంద్రంలోని బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం లొంగిపోయిందని మాజీ సీఎం కేజ్రీవాల్ సోమవారం న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో ఆరోపించారు. మీ పని మీరు చేయండి.. మీ పదవికి న్యాయం చేయండంటూ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్‍కు అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా సూచించారు. దేశ రాజధాని న్యూఢిల్లీ నగర ప్రజల మెదళ్లలో కొన్ని సందేహాలు ఉన్నాయన్నారు. వాటిని తీర్చండంటూ కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు ఆయన సూచించారు. ఈ మాసాంతం మీరు ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నారు.

Also Read: ఆ ఉచ్చులో పడకండి.. సీఎం చంద్రబాబుకు కీలక సూచన


ఆ క్రమంలో మీకు.. గవర్నర్? లేదా రాష్ట్రపతి? పదవి ఆశను కేంద్రం చూపించిందా? అంటూ ప్రశ్నించారు. ఈ రెండు పోస్టుల్లో మీకు ఏ ఆశ చూపించిందంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తాను నమస్కరించి ఆయనకు ఒకటే సూచన చేయదలుచుకున్నానని తెలిపారు. మీ పని మీరు చేయండి.. మీ ఉద్యోగానికి తగిన న్యాయం చేయండని తాను రెండు చేతులు నమస్కరిస్తూవేడుకొంటున్నానన్నారు. మీరు ఉద్యోగం నుంచి రిటైరవుతోన్న వేళ.. దేశాన్ని.. అలాగే దేశంలోని ప్రజా స్వామ్యాన్ని సైతం నాశనం చేయవద్దంటూ తాను వేడుకొంటున్నట్లు తెలిపారు.


మరోవైపు.. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి, బీజపీ అభ్యర్థి పర్వేష్ వర్మ నగదు పంచుతున్నాడని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఈ మాసం మొదట్లో ఆరోపించిన విషయం విధితమే. అతడిపై సీఈసీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. అలాగే హర్యానా నుంచి న్యూఢిల్లీకి యమనా నది ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ఆ యమునా నదిలో విషం కలిపిందంటూ ఆయన ఆరోపణ గుప్పించిన సంగతి తెలిసిందే.


70 స్థానలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 05వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, ఆప్ మధ్య ఉండనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థులను బరిలో దింపింది. ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి.. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రావాల్ కు ఝలక్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే వరుసగా మరోసారి అధికారాన్ని అందుకొని.. బీజేపీకి తన గెలుపుతో సత్తా చాటాలని ఆప్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థికి ఓటర్లు పట్టం కట్టాడు అనేది తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఆగాల్సిందేనన్నది సుస్పష్టం.

For National News And Telugu News

Updated Date - Feb 04 , 2025 | 04:37 PM