Bihar Elections Opinion Poll: సీఎం రేసులో మొదటి స్థానంలో నితీష్.. ఒపీనియన్ పోల్ జోస్యం
ABN , Publish Date - Oct 06 , 2025 | 08:27 PM
నితీష్ కుమార్ సారథ్యంలోని ప్రభుత్వం పని తీరు గొప్ప సంతృప్తిని ఇచ్చిందని 42 శాతం మంది స్పందించగా, చాలా సంతృప్తిగా ఉందని 31 శాతం మంది, సంతృప్తిగా ఉందని 31 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రధాన రాజకీయ పార్టీల్లో వేడి రాజుకుంది. ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉండనున్నాయనే దానిపై ఒపీనియన్ పోల్స్ (Openion polls) కూడా వెలువడుతున్నాయి. తాజాగా 'ఐఏఎన్ఎస్-మాట్రిజ్ న్యూస్ కమ్యూనికేషన్' ఒపీనియన్ పోల్స్ వెలువరించింది. బిహార్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాపులారిటీ ప్రధాన 'గేమ్ ఛేంజర్' కానుందని, ముఖ్యమంత్రి రేసులో నితీశ్ మొదటి ఛాయెస్‌లో ఉన్నారని తెలిపింది.
మోదీ జనాకర్షణ ఎన్నికలపై ప్రధానంగా ఉంటుందని 57 శాతం మంది అభిప్రాయపడగా, కొంతమేరకు ఉండొచ్చని 18 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. బిహార్‌లో బీజేపీ సుపరిపాలన అందించగలదని 35 శాతం మంది అభిప్రాయపడగా, ఆ తర్వాత స్థానంలో 18 శాతంతో జేడీయూ ఉంది. ఆర్జేడీకి సానుకూలంగా 13 శాతం, జన్‌సురాజ్‌కు 8 శాతం, కాంగ్రెస్‌కు 2 శాతం మంది స్పందించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాలనలో శాంతిభద్రతలు బాగున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటివి మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న ఎన్డీయేకు సవాళ్లు కావచ్చని అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి రేసులో నితీష్ కుమార్ మొదటి ఛాయెస్‌గా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా నితీష్‌కే తమ ప్రాధాన్యత అని 42 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 15 శాతంతో తేజస్వి యాదవ్ రెండో స్థానంలో ఉండగా, 9 శాతంతో జన్‌సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ మూడో స్థానంలో ఉన్నారు. చిరాగ్ పాశ్వాన్ (ఎల్‌జేపీ-రామ్ విలాస్)కు 8 శాతం, సమ్రాట్ చౌదరి (బీజేపీ) 3 శాతం, గిరిరాజ్ సింగ్ (బీజేపీ)కు 1 శాతం, ఉపేంద్ర కుష్వాహ (జేడీ-యూ)కు ఒక శాతం మద్దతు లభించింది. 17 శాతం మంది ఎటూ తేల్చిచెప్పలేదు. 4 శాతం మంది ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు.
నితీష్ కుమార్ సారథ్యంలోని ప్రభుత్వ పని తీరు గొప్ప సంతృప్తిని ఇచ్చిందని 42 శాతం మంది స్పందించగా, చాలా సంతృప్తిగా ఉందని 31 శాతం మంది, సంతృప్తిగా ఉందని 31 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 72 శాతం మంది శాంతి భద్రతల పరంగా నితీష్ ప్రభుత్వానికి మద్దతు తెలుపగా.. లాలూ యాదవ్ హయాంలో శాంతిభద్రతలు బాగున్నట్టు 10 శాతం అభిప్రాయపడ్డారు. 12 శాతం మంది ఇద్దరి పట్లా అసంతృప్తి వ్యక్తం చేయగా, 6 శాతం మంది ఎటూ తేల్చిచెప్పలేదు.
సంక్షేమ పథకాల ప్రభావం
కాగా, సంక్షేమ పథకాల ప్రభావం ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వే అభిప్రాయపడింది. 125 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ మంచి ప్రభావం చూపుతుందని 61 శాతం మంది అభిప్రాయపడగా, కొంత ప్రయోజనం ఉండొచ్చని 9 శాంత మంది, ఎలాంటి ప్రయోజనం ఉండదని 21 శాతం మంది అభిప్రాయపడ్డారు. మహిళలకు రూ.10,000 ఇన్‌స్టాల్‌మెంట్స్ అందించే మహిళా రోజ్‌గార్ యోజన ప్రభావం సానుకూలంగా ఉండొచ్చని 52 శాతం మంది అభిప్రాయపడ్డారు. 10 శాతం మంది కొంతవరకు ఉండొచ్చని, 19 శాతం మంది ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. 19 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు.
కాగా, ఆర్జేడీ చెబుతున్న 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనపై తమకు విశ్వాసం లేదని 61 శాతం మంది అభిప్రాయపడగా, 18 శాతం మంది తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. 11 శాతం మంది పాక్షిక నమ్మకం వ్యక్తం చేయగా, 10 శాతం ఎటూ తేల్చిచెప్పలేదు. ఈసీఐ చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మంచి చర్యగా 54 శాతం మంది ఆమోదం తెలుపగా.. 17 శాతం మంది ఈ ప్రక్రియ అవసరమని చెప్పారు. 16 శాతం మంది ఎటూ తేల్చిచెప్పలేదు. స్థానిక ఎమ్మెల్యేల పనితీరు నుంచి సంక్షేమ పథకాలు, నాయకత్వ ప్రాధాన్యతల వరకూ పలు అంశాలపై 'ఒపీనియన్ పోల్ రిపోర్ట్ @ బిహార్' పేరుతో ఈ పోల్‌ను ఐఏఎన్ఎస్-మాట్రిజ్ నిర్వహించింది.
ఇవి కూడా చదవండి..
ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..
Read Latest Telangana News and National News