ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అడ్డుపడుతున్న చైనా ..
ABN , Publish Date - Jun 24 , 2025 | 08:03 AM
Mumbai Ahmedabad Bullet Train project: దేశంలో మొట్టమొదటి హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు అయిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్‌ను సకాలంలో పట్టాలెక్కించాలని కేంద్ర ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోంది. కానీ, ఈ ప్రాజెక్టుకు చైనా అడ్డంకిగా మారింది. భూగర్భ విభాగాన్ని నిర్మించడానికి అవసరమైన 3 భారీ యంత్రాలను..
Bullet Train TBMs stuck in China: భారతదేశపు మొట్టమొదటి హై స్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ భూగర్భ విభాగాన్ని నిర్మించడానికి అవసరమైన మూడు భారీ టన్నెల్ బోరింగ్ యంత్రాలు (TBMలు) చైనా ఓడరేవులో నిలిచిపోయాయి. ఈ యంత్రాలను జర్మన్ కంపెనీ హెరెన్‌క్నెక్ట్ నుండి ఆర్డర్ చేశారు. కానీ అవి చైనాలోని గ్వాంగ్‌జౌ నగరంలో తయారయ్యాయి. రెండు యంత్రాలు 2024 అక్టోబర్ నాటికి.. ఒక యంత్రం ఈ ఏడాది ప్రారంభంలోనే ఇండియాకు రావాల్సి ఉంది. కానీ, చైనా అధికారులు ఈ యంత్రాలు ఇండియాకు రానీయకుండా అడ్డుకుంటున్నారు. వీటిని రప్పించేందుకు భారత అధికారులు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. నిలిపివేతకు గల కారణాలను డ్రాగన్ చెప్పడం లేదు. దీంతో ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) చేపట్టింది. ఈ ప్రాజెక్టు విలువ రూ. 1.08 లక్షల కోట్లు. సొరంగ పనుల కోసం NHSRCL జర్మన్ కంపెనీకి మూడు TBM యంత్రాలను ఆర్డర్ ఇచ్చింది. కానీ, అవి చైనాలోని గ్వాంగ్‌జౌ నగరంలో తయారయ్యాయి. TBM-1, TBM-2 సన్వాలి (ఘన్సోలి) నుంచి విఖ్రోలి, విఖ్రోలి నుండి BKC మధ్య సొరంగాలను నిర్మిస్తాయి. TBM-3 విఖ్రోలి నుంచి సన్వాలి మధ్య సొరంగాలను నిర్మిస్తుంది. మొదటి రెండు యంత్రాలు 2024 అక్టోబర్ నాటికే రావాల్సి ఉంది. TBM-3 ఈ సంవత్సరం ప్రారంభంలో రావాల్సి ఉంది. చైనా అడ్డుపడటం వల్ల ఇప్పటికీ ఈ మూడింటిలో ఒక్క యంత్రమూ భారత్ చేరుకోలేదు.
ఆగిపోయిన టన్నెలింగ్ పనులు..
నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) TBM యంత్రాలను ఉపయోగించి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC), సావ్లి (ఘన్సోలి) మధ్య సొరంగం నిర్మించబోతోంది. యంత్రాలు రావడం ఆలస్యం అయితే బుల్లెట్ రైలు ప్రాజెక్టు సొరంగం పనులు ఆలస్యం కావచ్చు. ముఖ్యంగా BKC నుండి షిల్ఫాటా వరకు 21 కి.మీ.. థానే క్రీక్ కింద 7 కి.మీ. సొరంగం పనులు పూర్తి కావాల్సి ఉంది. అయితే, NHSRCL అధికారులు దీని గురించి ఏమీ చెప్పడం లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యం ఇప్పటికీ అలాగే ఉన్నట్లు తెలుస్తోంది.
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఆలస్యం భారత్-చైనాల నడుమ దౌత్యపరమైన ఆందోళనలను లేవనెత్తింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. దౌత్య మార్గాల ద్వారా యంత్రాలను విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మరికొన్ని ముఖ్యమైన వస్తువులు కూడా TBMలతోపాటే నిలిచిపోయాయి. ఇవి ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కూడా అవసరం.
ఇవీ చదవండి:
దారుణం.. 30 మంది భార్యలు హతం
ప్రధాని కలుపుగోలుతనం గొప్ప ఆస్తి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి