BJP Victory: ఢిల్లీ విజయాన్ని కట్టబెట్టిన బీజేపీ వ్యూహం ఇదీ!
ABN , Publish Date - Feb 08 , 2025 | 03:32 PM
గత ఎన్నికల్లో కేవలం 8 సీట్లే గెలుచుకున్న బీజేపీ తాజా ఎన్నికల్లో అసాధారణ గెలుపును సొంతం చేసుకోవడం వెనక డబుల్ ఇంజెన్ అభివృద్ధి మంత్రం పనిచేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు హామీతో పాటు మిడిల్ క్లాస్ వర్గం బీజేపీకి జైకొట్టడంతో కాషాయం పార్టీకి విజయం నల్లేరు మీద నడకగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీపై ఆప్ ఆధిపత్యానికి గండికొట్టి విజయం దిశగా నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ దూసుకుపోతోంది. 45 పైచిలుకు స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా ఆప్ మాత్రం కేవలం 21 స్థానాల్లోనే మెరుగైన స్థితిలో ఉంది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మరో కీలక నేత మనీశ్ శిశోడియా బరిలోకి దిగిన న్యూఢిల్లీ, ప్రతాప్‌గంజ్ స్థానాలు కూడా బీజేపీ అకౌంట్‌లోకి చేరాయి. 26 ఏళ్ల తరువాత దేశ రాజధాని బీజేపీ చేతుల్లోకి వెళ్లడం దాదాపుగా ఖరారైపోయింది. అయితే, బీజేపీ గెలుపు విషయం అటుంచితే 2020లో కేవలం 8 సీట్లకు పరిమితమైన కాషాయం పార్టీ కేవలం ఐదేళ్లల్లో ఆప్‌ను మట్టి కరిపించి తిరుగులేని ఆధిపత్యాన్ని సొంతం చేసుకోవడంపై విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు (2025 Delhi Legislative Assembly Election).
గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లకే పరిమితమైంది. ఆప్ ఏకంగా 62 స్థానాల్లో విజయఢంకా ఎగరవేసింది. దీంతో, సునాయసంగా రెండోసారి ఢిల్లీ పగ్గాలు చేపట్టింది. 1993లో ఒక పర్యాయం మినహా బిజేపీ దేశరాజధానిలో ఎప్పుడూ వెనకంజలోనే ఉంది. అప్పట్లో కమలం పార్టీ ఏకంగా 49 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 14 సీట్లకు పరిమితమైంది. కానీ 1998 తరువాత మాత్రం బీజేపీ ట్రాక్ రికార్డు సైలెంట్ అయిపోయింది. 1998 నాటి ఎన్నికల్లో బీజేపీ 15 సీట్లకు పరిమితం కాగా కాంగ్రెస్ మాత్రం 52 సీట్లల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక 2003 ఎన్నికల్లో బీజేపీ కొద్దిగా పుంజుకుని 20 సీట్లు దక్కించుకుంది. ఆ తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్య 23కు చేరింది.
Arvind Kejriwal: ఢిల్లీ ఫలితాలను శాసించిన మిడిల్ క్లాస్.. ఇదీ కామన్ మ్యాన్ పవర్
ఇక 2013 నాటికి సీన్‌లోకి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ కాషాయం పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా మారారు. నాటి ఎన్నికల్లో బీజేపీ 31 సీట్లు ఆప్ 28 సీట్లు గెలిచుకున్నాయి. ఆ తరువాత కేజ్రీవాల్ కాంగ్రెస్‌తో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే, ఈ పొత్తు రెండేళ్లకు మించిన మనలేకపోయింది. 2015 ఆప్ కాంగ్రెస్‌కు గుడై చెప్పి ఒంటరిగా ఎన్నికల్లో దిగి సొంతంగా మెజారిటీ సాధించింది. ఇక నాటి ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు సీట్లకే పరిమితమైంది. 2020 ఎన్నికల్లో ఆప్ ఏకంగా 62 సీట్లు గెలుచుకుని అజేయంగా నిలిచింది. బీజేపీ ఎనిమిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
బీజేపీ గెలుపునకు కారణాలు..
డబుల్ ఇంజన్ ప్రభుత్వం నినాదంతో ఈసారి ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి ఈ వ్యూహం బాగా కలిసొచ్చింది. ప్రధాని మోదీ విస్తృత ప్రచారం కూడా పార్టీ విజయానికి మరో ప్రధాన కారణంగా నిలిచింది. మునుపటి ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తామంటూనే ఆయన ఆప్ అవినీతికి ముగింపు పలుకుతామన్న హామీతో ఓటర్ల మద్దతు కూడగట్టారు. దేశ రాజధానిలో డబుల్ ఇంజన్ అభివృద్ధి ఉంటుందని భరోసా ఇచ్చారు. వీటికి తోడు ఢిల్లీ ఎన్నికల్లో కీలకంగా ఉన్న మిడిల్ క్లాస్ వర్గం బీజేపీకి జైకొట్టడం పార్టీని విజయ తీరానికి చేర్చింది.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి