Share News

MK Stalin: కరూర్ తొక్కిసలాటపై బీజేపీ ఆందోళన ఉత్తదే: ఎంకే స్టాలిన్

ABN , Publish Date - Oct 03 , 2025 | 08:59 PM

తమిళనాడు మూడు ప్రధాన ప్రకృతి వైపరీత్యాలను చవిచూసిందని, ఏ సందర్భంలోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి రావడం కానీ, నిధులు ఇవ్వడం కానీ చేయలేదని స్టాలిన్ విమర్శించారు. ఇప్పుడు మాత్రం కరూర్‌కు ఆఘమేఘాల మీద వచ్చారని మండిపడ్డారు.

MK Stalin: కరూర్ తొక్కిసలాటపై బీజేపీ ఆందోళన ఉత్తదే: ఎంకే స్టాలిన్
MK Stalin

రామనాథపురం: కరూర్‌ తొక్కిసలాట (Karur Stampede) ఘటనపై బీజేపీకి కానీ, ఆ పార్టీ సారథ్యంలోని కేంద్రానికి కానీ ఎలాంటి నిజమైన ఆందోళన లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) అన్నారు. ఈ ఘటనను ఉపయోగించుకుని వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందాలని అనుకుంటోందని ఆరోపించారు. శుక్రవారంనాడిక్కడ జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తొక్కిసలాట కారణాలను తెలుసుకునేందుకు ఇంత హడావిడిగా ఎన్డీయే ఎంపీల బృందాన్ని ఎందుకు పంపాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మణిపూర్ అల్లర్లు జరిగినప్పుడు కానీ, గుజరాత్‌లో మోర్బీ వంతెన ప్రమాదం సమయంలో కానీ, ఉత్తరప్రదేశ్‌ కుంభమేళాలో తొక్కిసలాట జరిగినప్పుడు కానీ టీమ్‌లను ఎందుకు పంపలేదని నిలదీశారు.


'దీనికంతటికీ కారణం ఒకటే. కరూర్ తొక్కిసలాటపై వారికి ఎలాంటి ఆసక్తి కానీ ఆందోళన కానీ లేదు. కేవలం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన మాత్రమే ఉంది' అని స్టాలిన్ అన్నారు. ఇతరులపై ఆధారపడే పరాన్నిజీవిగా బీజేపీని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టేందుకు చూసే పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం, తప్పులు చేసి జవాబుదారీతనం నుంచి తప్పించుకోవాలనుకునే వారికి బీజేపీ 'వాషింగ్ మిషన్' లాంటిదని విమర్శించారు.


తమిళనాడు మూడు ప్రధాన ప్రకృతి వైపరీత్యాలను చవిచూసిందని, ఏ సందర్భంలోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి రావడం కానీ, నిధులు ఇవ్వడం కానీ చేయలేదని స్టాలిన్ విమర్శించారు. ఇప్పుడు మాత్రం కరూర్‌కు ఆఘమేఘాల మీద వచ్చారని అన్నారు. కాగా, స్టాలిన్ తన పర్యటనలో భాగంగా రామనాథపురం జిల్లాలో రూ.738 కోట్ల విలువైన అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. వీటిలో తన్గాచిమడం ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూలు భవనం, పారామకుడిలో కాలేజీ విద్యార్థుల కోసం హాస్టల్‌ వంటివి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

పీఓకేలో పాక్ మానవ హక్కుల ఉల్లంఘన.. భారత్ నిప్పులు

జాగ్రత్త.. ఉగ్రవాదాన్ని ఆపకపోతే ప్రపంచ పటం నుంచి తుడిచేస్తాం..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 03 , 2025 | 09:57 PM